సా«్వధీనం చేసుకున్న డ్రగ్స్‌ను పరిశీలిస్తున్న పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో దొరికిన తీగను లాగుతుంటే టాలీవుడ్ డ్రగ్ డొంక కదులుతోంది. తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (టీఎస్–నాబ్) అధికారులకు గత నెల 31న అక్కడి సర్వీస్ ఫ్లాట్‌లో చిక్కిన వారిలో ఫిల్మ్ ఫైనాన్షియర్ కె.వెంకటరమణారెడ్డి ఉండగా... గురువారం పట్టుబడిన వారిలో ‘డియర్ మేఘ’ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డి ఉన్నారు. హీరో నవదీప్, ‘షాడో’ చిత్ర నిర్మాత రవి ఉప్పలపాటి తదితరులు పరారీలో ఉన్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. ఐసీసీసీలో టీఎస్–నాబ్ ఎస్పీ (వెస్ట్) డి.సునీతా రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
స్నాప్‌చాట్‌లో గాడ్ హెడ్స్ పేరుతో...
నెల్లూరుకు చెందిన బి.బాలాజీ గతంలో ఇండియన్ నేవీలో అధికారిగా పని చేశాడు. కంటికి తీవ్రమైన గాయం కావడంతో మెడికల్లీ అన్‌ఫిట్ అయ్యాడు. దీంతో నేవీ నుంచి బయటకు వచ్చి వ్యాపారిగా మారాడు. తరచుగా హైదరాబాద్‌కు వచ్చి వెళ్లే బాలాజీ తన స్నేహితులతో కలిసి ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లోని సర్వీస్ ఫ్లాట్‌లో రేవ్ పార్టీలకు హాజరయ్యేవాడు. ఇలా ఇతడికి హైదరాబాద్‌తో పా టు బెంగళూరు డ్రగ్ పెడ్లర్స్‌తో సంబంధాలు ఏర్ప డ్డాయి.
దీంతో హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లు, గెస్ట్ హౌస్‌ల్లో రేవ్ పార్టీలు ఏర్పాటు నిర్వహించేవాడు. స్నాప్‌చాట్‌లో గాడ్ హెడ్స్ పేరుతో ఐడీ క్రియేట్ చేసి దీని ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. ఈ యాప్‌లో మెసేజ్ చదవగానే డిస్‌అప్పియర్ అయ్యే ఆప్షన్ ఉండటంతోపాటు కస్టమర్లకు ప్రత్యేక కోడ్‌లు ఇవ్వడం ద్వారా దందా సాగించాడు. గత నెల 31న ఇతడితోపాటు రమణారెడ్డి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ వద్ద సీనియర్ స్టెనోగా పని చేస్తున్న డి.మురళిని అరెస్టు చేశారు. వీరిని విచారించడంతో ఈ డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి.
నైజీరియన్ల ద్వారా రామ్ కిషోర్‌కు...
బాలాజీ ముగ్గురు నైజీరియన్లతోపాటు నగరానికి చెందిన రామ్ కిషోర్ వైకుంఠం (పరారీలో ఉన్నాడు) నుంచి డ్రగ్స్ ఖరీదు చేసేవాడు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న నైజీరియన్లు అమోబీ చికోడి మొనగాలు, ఇక్బావే మైకేల్, థామస్ అనఘకాలు నుంచి బాలాజీకి కొకైన్, ఎండీఎంఏ, ఎక్స్‌టసీ అందుతున్నాయి. డ్రగ్ పార్టీల నిర్వహణకు బాలాజీకి రమణా రెడ్డి ఫైనాన్స్ చేస్తుండేవాడు.ఇతడికి బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఖాతా ఉంది.
ఇందులో ప్రస్తుతం రూ.5.5 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతోపాటు రమణారెడ్డి, బాలాజీలకు ఉన్న ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. వీటిని స్వాధీనం చేసుకోవడానికి కసరత్తు చేస్తున్నారు. బాలాజీ నుంచి డ్రగ్స్ ఖరీదు చేసిన 18 మంది కస్టమర్లలో సినీ రంగానికి చెందిన వారితోపాటు పబ్‌లు, స్నూకర్ పార్లర్ల నిర్వా హకులు ఉన్నారు. హైటెక్ సిటీ ప్రాంతంలో స్నాట్ పబ్ నిర్వహించే సూర్య, జూబ్లీహిల్స్‌లో టెర్రా కేఫ్ అండ్ బిస్ట్రో నిర్వహించే అర్జున్, గుంటూరులో స్నూకర్ పార్లర్ నిర్వహించే పీఎస్ కృష్ణ ప్రణీత్ కీలకం. వీరు తమ సంస్థల్లోనే రహస్య గదులు ఏర్పాటుచేసి డ్రగ్స్ వినియోగానికి సహకరిస్తూ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఫోన్లు ఆఫ్ చేసుకున్న నవ్‌దీప్, రవి
బాలాజీ నుంచి డ్రగ్స్ ఖరీదు చేసి వినియోగిస్తున్న వారిలో ప్రముఖులు, సినీ రంగానికి చెందిన వారూ ఉన్నట్లు టీఎస్ నాబ్ గుర్తించింది. హీరో నవదీప్, షాడో, రైడ్ చిత్రాల నిర్మాత రవి ఉప్పలపాటి, మోడల్ శ్వేత, మాజీ ఎంపీ దేవరకొండ విఠల్‌రావ్ కుమారుడు సురేశ్ రావ్, ఇంద్రతేజ్, కార్తీక్‌లతోపాటు కలహర్‌రెడ్డి ఉన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు బెంగళూరులో జరిగిన డ్రగ్ పార్టీకి హాజరయ్యారనే విషయం 2021లో వెలుగులోకి వచ్చి కలకలం సృష్టించింది.
ఈ పార్టీ నిర్వాహడుకు కలహర్‌రెడ్డే కావడం గమనార్హం. మరోపక్క ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు చేసిన 2017 నాటి టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ నవదీప్ పేరు ఉంది. నిందితుల కోసం ఏసీపీ కె.నర్సింగ్‌రావు, ఇన్‌స్పెక్టర్ పి.రాజేష్, కానిస్టేబుల్ సత్యనారాయణ తదితరుల బృందం గాలించింది.
అమోబీ చికోడి, ఇక్బావే మైకేల్, థామస్‌తోపాటు సురేశ్ రావ్, కొల్లి రామ్‌చంద్, కూరపాటి సందీప్, అనుగు సుశాంత్ రెడ్డి, కృష్ణ ప్రణీత్‌లను పట్టుకుంది. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. నవదీప్, రవి ఉప్పలపాటి సహా మిగిలిన నిందితులు తమ ఫోన్లు ఆఫ్ చేసుకుని, కుటుంబంతో సహా పరారయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment