
మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక పరిణాణం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న టాలీవుడ్ నటుడు నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు నిర్వహించింది. అయితే పోలీసులు సోదాలు నిర్వహించే సమయంలో నవదీప్ ఇంట్లో లేరని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అతన్ని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు రామ్‌చంద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా.. ఈ కేసులో నవదీప్ ఇప్పటికే మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నార్కోటిక్ బ్యూరో పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు.
అసలేం జరిగిందంటే...
మాదాపూర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న ఫ్లాట్‌లో గత నెల 31న జరిగిన డ్రగ్ పార్టీ తీగ లాగిన టీఎస్ నాబ్ అధికారులు గురువారం మరో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నైజీరియన్లతో పాటు టాలీవుడ్‌కు చెందిన వాళ్లు ఉన్నారు. ఈ కేసులో పట్టుబడిన రామ్‌చంద్ విచారణలోనే నటుడు నవదీప్ పేరు వెలుగులోకి వచ్చింది. . నవదీప్‌కు స్నేహితుడు, సన్నిహితుడు అయిన రామ్‌చంద్ తన వాంగ్మూలంలో నవదీప్ సైతం తనతో కలిసి మాదకద్రవ్యాలు సేవించినట్లు వెల్లడించాడు. చివరిసారిగా గత శనివారం వీరిద్దరు వీటిని తీసుకున్నట్లు బయటపెట్టాడు. దీంతో టీఎస్ నాబ్ అధికారులు నవదీప్‌ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు.
నవదీప్‌ను అరెస్టు చేయొద్దు: హైకోర్టు
డ్రగ్స్ కేసులో నవదీప్‌ను మంగళవారం వరకు అరెస్టు చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. గుడిమల్కాపూర్ పోలీసు స్టేషన్ పరిధి డ్రగ్స్ కేసులో పోలీసులు 13 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నవదీప్ వినియోగదారుడిగా ఉన్నాడని.. అతడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ శుక్రవారం లంచ్ మోషన్ రూపంలో నవదీప్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment