50 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం
రైల్వేకోడూరు రూరల్:
అక్రమ రవాణాకు సిద్ధం చేసిన 50 ఎర్ర చందనం దుంగలతో పాటు నాలుగు కార్లు, మూడు ఆటోలు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేసినట్లు రాజంపేట డీఎస్పీ ఏ.రాజేంద్ర తెలిపారు. స్థానిక పోలీసు స్టేషనులో శనివారం సాయంత్రం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. శనివారం ఉదయం 6 గంటల సమయంలో ముందస్తు సమాచారం మేరకు సీఐ రసూల్ సాహెబ్,
సిబ్బంది మండలంలోని బిల్లుపాటిపల్లె వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా నెంబరు ప్లేటు లేని బొలేరో వాహనం అటు వైపు వచ్చిందన్నారు. దానిని ఆపమన్నా ఆపకుండా అతివేగంగా వెళ్లిపోయిందన్నారు.
దీన్ని తమ సిబ్బంది చాకచక్యంగా పట్టుకుని తనిఖీ చేయగా అందులో 7 ఎర్రచందనం దుంగలు కన్పించాయన్నారు. అందులో ఉన్న ఇరుగూరి నరేష్, నరేష్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా వారిచ్చిన సమాచారం మేరకు వాగేటికోన వద్ద మూడు ఆటోలు, ఒక ఆల్టో కారు, ఒక క్వాలీస్ కారు, ఒక విస్టా కారు, ఒక అవెంజర్ ద్విచక్ర వాహనం 43 ఎర్రచందనం దుంగలు దొరికాయన్నారు. అక్కడున్న గంగయ్య, నరసింహారెడ్డిని అరెస్టు చేశామన్నారు. వారిని పూర్తిగా విచారించగా దుబాయ్‌కు చెందిన అమీద్ సాహుల్ బాయ్, తిరుత్తణికి చెందిన మణి, సింగపూర్‌కు చెందిన సుబ్రమణి, కందస్వామి, రెడ్ హిల్స్‌కు చెందిన వెంకటేశు, అన్నా నగర్‌కు చెందిన భాస్కర్‌లకు విక్రయిస్తామని తెలిపారన్నారు. వీరితో పాటు చెన్ చెంగ్యూ, చెన్ చెంగాయ్, కేవీ. దావోద్ జాగాయ్, డి.పద్మనాభన్, అమీర్ ఖాజా, ఫిరోజ్ దస్తగిరి అనే స్మగ్లర్లకు కూడా విక్రయిస్తామనిఅంగీకరించారన్నారు. అరెస్టు చేసిన వారిలో నరేష్‌కు అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయని తేలిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ మంజునాథ, సిబ్బంది పాల్గొన్నారు.