సాక్షి, కర్నూలు: విశాఖ వయా కర్నూలు టూ మహారాష్ట్ర ఇదేదో ఆర్టీసీ బస్సు అనుకుంటే పొరపాటే. గంజాయి రవాణా చేసే స్మగ్లర్లు (ముఠా) ఎంచుకున్న రూటు. మహారాష్ట్రలోని నాసిక్, సోలాపుర్ ప్రాంతాల్లో గంజాయికి అమితమైన డిమాండ్ ఉండడంతో విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి నిత్యం రవాణా చేస్తూ స్మగ్లర్లు భారీగా సొమ్ము చేసుకొంటున్నట్లు పోలీసు విచారణలో బయటపడింది. తెలంగాణ రాష్ట్రం జనగాం జిల్లా వెంకన్న కుంట గ్రామానికి చెందిన సానబోయిన సాయికుమార్, హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్ దర్గాబర్మాశ్ ప్రాంతంలో నివాసముంటున్న మహ్మమద్ మునావర్, మహారాష్ట్ర సితార జిల్లా శనివార పేట్ ప్రాంతానికి చెందిన ఖాజా ఖాన్, సమీర్, ముజాఫర్, కొరేగోన్ తాలుకా దుమ్ములవాడి గ్రామానికి చెందిన విశాల్ చంద్రకాంత్ షిండే, ఉత్తరాఖండ్ రాష్ట్రం చంపావత్ జిల్లా లోహగాట్ తాలుకా రాయ్‌నగర్ చౌడీకి చెందిన ఆదిత్యరాయ్ తదితరులు ముఠాగా ఏర్పడి, గంజాయిని రవాణా చేస్తూ పోలీçసులకు చిక్కి కటకటాల పాలయ్యారు.
వారి వద్ద నుంచి రూ.50 లక్షల విలువ చేసే 651 కిలోల గంజాయి పాకెట్లతోపాటు మినీలారీ, రెండు కార్లు, రూ.20 వేల నగదు, ఐదు సెల్‌ఫోన్లను నాగలాపురం పోలీసులు స్వాధీనం చేసుకొని, జిల్లా కేంద్రానికి తీసుకువచ్చి అడిషనల్ ఎస్పీ దీపికా పాటిల్ ఎదుట హాజరు పరిచారు. శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో కర్నూలు ఇన్‌చార్జ్ డీఎస్పీ బాబాఫకృద్దీన్, కర్నూలు తాలుకా సీఐ పవన్‌కిశోర్, నాగలాపురం ఎస్‌ఐ కేశవతో కలిసి అడిషనల్ ఎస్పీ విలేకరులకు వివరాలు వెల్లడించారు.
స్మగ్లర్లు ఇలా దొరికారు..
ఏపీ 16ఎక్స్6264 మినీ లారీకి డ్రైవర్ వెనుక సగభాగం ఐరన్ సీట్లో ప్రత్యేక కేబిన్ తయార్ చేసి పైభాగంలో గవాక్షం తరహాలో రంద్రం ఏర్పాటు చేసి, అందులో నుంచి రహస్య కేబిన్‌లోకి గంజాయి పాకెట్లను నింపి లారీ వెనుక భాగంలో ఖాళీ ప్లాస్టిక్ బాక్స్‌లు నింపారు. వెనుక ఒక కారు, ముందు కారులో ముఠా సభ్యులు లారీకి ఎస్కార్టుగా విశాఖ పట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి కర్నూలు మీదుగా మహారాష్ట్రలోని నాసిక్‌కు బయలుదేరారు. ఈనెల 15న రూరల్ సీఐ పవన్‌కిశోర్ ఆధ్వర్యంలో నాగలాపురం పోలీసు స్టేషన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. లారీలో భారీ మొత్తంలో గంజాయి రవాణా చేస్తున్నట్లు అజ్ఞాత వ్యక్తుల నుంచి సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు విస్తృతం చేశారు.
రెండు కార్ల మధ్య లారీ కాన్వాయ్ రూపంలో కర్నూలు వైపు నుంచి వేగంగా దూసుకొస్తుండగా పోలీసులు అప్రమత్తమై అడ్డుకొని సోదాలు చేశారు. లారీ వెనుక భాగంలో ఖాళీ ప్లాస్టిక్ బాక్స్‌లు కనిపించడంతో అందులో ఏమి లేవనీ.. నిర్ధారణకు వచ్చారు. కారులో సోదా చేయగా వెనుక డిక్కీ భాగంలో కొన్ని గంజాయి పొట్లాలు కనిపించాయి. వెంటనే అందులో ఉన్నవారిని అదుపులోకి తీసుకొని విచారించగా లారీకి ఏర్పాటు చేసిన రహస్య కేబిన్ గుటురట్టయింది. లారీ పైభాగం మొత్తం టార్పాలిన్‌తో కప్పి ఉండడంతో దానిని తొలగించారు. పైన సుమారు ఐదడుగుల విస్తీర్ణంలో రంధ్రం కనిపించింది. అందులోంచి లారీలోకి తొంగి చూడగా రహస్య కేబిన్‌లో గంజాయి పొట్లాలు భద్ర పరిచిన విషయం బయట పడింది.
హైదరాబాద్ వైపు నిఘా పెరగడంతో..
మహారాష్ట్ర సితార జిల్లా శనివార్‌పేట్‌కు చెందిన ఖాజాఖాన్ కొన్నేళ్లుగా గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రలోని నాసిక్, సోలాపుర్ ప్రాంతాలకు రవాణా చేసేవాడు. ఇటీవల ఆ మార్గంలో పోలీసుల నిఘా పెరగడంతో గంజాయి ముఠా రూటు మార్చుకుంది. విశాఖ నుంచి కర్నూలు మీదుగా రెండుసార్లు నాసిక్‌కు భారీ మొత్తంలో రవాణా చేసినప్పటికీ పోలీసుల నిఘాకు చిక్కలేదు.ఇదే సరైన మార్గమని భావించిన గంజాయి ముఠా మూడోసారి ఇదే మార్గంగుండా వెళ్తూ పోలీసుల నిఘాకు చిక్కారు. ముఠాలోని సభ్యులను లోతుగా విచారిస్తున్నామని, వారిచ్చే సమాచారం ఆధారంగా అండగా ఉన్న వ్యక్తుల సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అడిషనల్ ఎస్పీ దీపికా పాటిల్ తెలిపారు. భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను పట్టుకున్నందుకు సీఐ పవన్‌కిశోర్‌తోపాటు నాగలాపురం ఎస్‌ఐ కేశవ, సిబ్బందిని దీపికా పాటిల్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment