సాక్షి, ఆదోని(కర్నూలు): జిల్లాలో కొందరు పోలీసులు..అసాంఘిక శక్తులతో చేతులు కలుపుతున్నారు. దొంగలతో దోస్తీ చేస్తూ పోలీసు శాఖ ప్రతిష్ట మంట గలుపుతున్నారు. గడిచిన ఏడాది కాలంలో ఒక్క ఆదోని సబ్ డివిజన్ పరిధిలోనే ఎస్‌ఐ, ఇద్దరు ఏఎస్‌ఐలు, ఆరుగురు కానిస్టేబుళ్లు పలు ఆరోపణలపై క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు. మూడు రోజుల క్రితం కోసిగి స్టేషన్ పరిధిలోని చిన్న భూంపల్లి గ్రామంలో పేకాట ఆడుతూ పట్టుబడ్డ పది మంది నిందితుల్లో నలుగురిని తప్పించి.. వారి స్థానంలో అమాయకులను కోర్టులో హాజరు పరిచారు. ఈ ఘటనలో ఎస్‌ఐ శ్రీనివాసులు, ఏఎస్‌ఐ ఏసేబు, ఇద్దరు కానిస్టేబుళ్లు రామాంజి, తిప్పన్నను బాధ్యులుగా చేస్తూ పలు సెక్షన్ల కింద ఆదోని టూ టౌన్ పోలీసులు కేసు నమోదైంది.
రెండు రోజుల క్రితం ఆదోని వన్ టౌన్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్‌లో పేకాట క్లబ్బుపై దాడి చేసి.. విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఈ ఆరోపణలపై కానిస్టేబుళ్లు రంగస్వామి, రంగన్నను వీఆర్‌కు పంపారు. అంతకు ముందు మట్కా, దొంగ బంగారం, బియ్యం వ్యాపారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై వన్‌టౌన్‌లో పని చేస్తున్న జయరాముడు, టూ టౌన్‌లో పనిచేస్తున్న ప్రసాద్ సింగ్, హాజీ బాష, చిన్న హుసేని, తాలూకా ఏఎస్‌ఐ నాగరాజుపై జిల్లా ఎస్పీ సస్పెన్షన్ వేటు వేశారు. నాగరాజుపై ఇంకా సస్పెన్షన్ వేటు కొనసాగుతుండగా మిగిలిన వారు మళ్లీ విధులలో చేరారు. అసాంఘిక శక్తులకు సింహ స్వప్నంగా ఉండాల్సిన పోలీసులు..అందుకు విరుద్ధంగా వ్యవహరించడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో చాలా మంది పోలీసులు.. ఉన్నత స్థాయి అధికారులకు తెలియకుండా అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. స్పెషల్ బ్రాంచ్, ఇంటలిజెన్స్ వర్గాలచే రహస్యంగా విచారణ చేపడితే ఎవరెవరికి అసాంఘిక శక్తులో సన్నిహిత సంబంధాలు ఉన్నాయో బయటపడే అవకాశం ఉంది. ఇలాంటి వారిని గుర్తించి కఠినమైన చర్యలు తీసుకుంటేనే పోలీసు శాఖ ప్రతిష్ట పెరుగుతుంది. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా మట్కా, పేకాట, అక్రమ గుట్కా, మద్యం, నాటు సారా వ్యాపారాలకు చెక్ పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment