ఆరు ఓల్వోలు స్వాధీనం
Published Fri, Nov 1 2013 1:57 AM | Last Updated on Tue, Nov 6 2018 4:56 PM
తేటగుంట(తునిరూరల్), న్యూస్‌లైన్ :తుని మండలం తేటగుంట శివారు ప్రాంతీయ రవాణా అధికారి (ఆర్టీఏ) చెక్‌పోస్టు వద్ద జాయతీ రహదారిపై వెళ్లే ప్రైవేట్ ఓల్వో బస్సులను అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు నిర్వహించిన తనిఖీల్లో సక్రమంగా రికార్డులు, ప్రయాణికుల వివరాలు, ఫైర్ సేఫ్టీలు లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన నాలుగు ఓల్వో బస్సులను సీజ్ చేశారు. ఈ బస్సులు ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళుతుండగా చెక్‌పోస్టు వద్ద అధికారులు సీజ్ చేసి తుని రూరల్ పోలీసులకు అప్పగించారు. నవీన్, దివాకర్, ఎస్‌వీఆర్, కావేరి ట్రావెల్స్‌కు చెందిన నాలుగు బస్సుల్లో ప్రయాణిస్తున్న సుమారు రెండు వందల మంది ప్రయాణికులను కిందికి దించిఆర్టీసీ బస్సుల్లో ఆయా ప్రాంతాలకు ఆర్టీఏ అధికారులు పంపించారు.
మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం శివారు (పాలమూరు)లో జరిగిన బస్సు ప్రమాద ఘటనతో ఉలిక్కిపడిన రవాణా శాఖ అధికారులు పెద్ద సంఖ్యలో బస్సులను తనిఖీ చేశారు. ప్రాంతీయ రవాణా అధికారి తిలక్ మాట్లాడుతూ స్పీడ్ గన్ మరమ్మతుల కారణంగా వాహనాల వేగాన్నిత నిఖీలు చేయడం లేదన్నారు. ప్రైవేట్ బస్సుల తనిఖీ కంబాలచెరువు (రాజమండ్రి) : రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ వద్ద ఆర్టీవో హైమారావు ఆధ్వర్యంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పరంధామరెడ్డి ఓల్వో బస్సులను తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తున్న వాసవి ట్రావెల్స్‌కు చెందిన బస్సులో ప్రయాణికుల వివరాలు లేకపోవడంతో ఆ బస్సును సీజ్ చేశారు. భద్రతా ప్రమాణాలు లేకుండా, అగ్నిమాపక నిరోధ యంత్రం, ప్లాస్టిక్ హేమర్ వంటి రక్షణ సామగ్రి లేకుండా నడుస్తున్న నవీన్ ట్రావెల్స్, కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఒక్కో బస్సు, ఎస్వీఆర్ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులపై కేసులు నమోదు చేశారు. అలాగే రికార్డులు సరిగా లేకపో వడంతో కాకినాడలో ఓ ఓల్వో బస్సును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Advertisement