నల్లగొండ జిల్లా చిట్యాలలో బంగారం, వెండి ఉంచిన సంచులను బయటికి తీస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు గురువారం రికార్డు స్థాయిలో రూ.78.03 కోట్లు విలువ చేసే నగదు, మద్యం, ఇతర వస్తువులను జప్తు చేశారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో జప్తు చేసిన నగదు, ఇతర వస్తువుల మొత్తం విలువ రూ.243.76 కోట్లకు పెరిగిపోయింది. కాగా, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు రూ.87.92 కోట్లు.
ఒక్క రోజు 6వేల లీటర్ల మద్యం జప్తు
తాజాగా రూ.1.21 కోట్లు విలువ చేసే 6132 లీటర్ల మద్యం జప్తు చేశారు. దీంతో ఈ నెల 9 నుంచి ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం మద్యం 65,223 లీటర్లు కాగా, దీని విలువ రూ.10.21 కోట్లు. గురువారం రూ.16.77లక్షలు విలువ చేసే 103.165 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న గంజాయి 2950 కిలోలకు పెరిగింది. దీని విలువ రూ.7.72 కోట్లు. ఇప్పటి వరకు మరో రూ.7.72 కోట్లు విలువ చేసే ఇతర మత్తు పదార్థాలను జప్తు చేశారు. గురువారం రూ.57.67 కోట్లు విలువ చేసే బంగారం, వెండి, ఇతర వస్తువులు పట్టుకున్నారు.
83కిలోల బంగారం పట్టివేత
అందులో 83.046 కిలోల బంగారం, 212 కిలోల వెండి, 112.195 క్యారట్ల వజ్రాలు, 5.35 గ్రాముల ప్లాటినం ఉంది. దీంతో ఇప్పటి వరకు పట్టుబడిన బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువుల విలువ రూ.120.40 కోట్లకు ఎగబాకింది. ఇందులో 181 కిలోల బంగారం, 693కిలోల వెండి, 154.45 క్యారెట్ల వజ్రాలున్నాయి. గురువారం రూ.8.84 కోట్లు విలువ చేసే ల్యాప్‌టాప్‌లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామగ్రి తదితర వస్తువులను పట్టుకున్నారు. దీంతో ఇప్పటి వరకు పట్టుబడిన ఇలాంటి వస్తువుల విలువ రూ.17.84 కోట్లకు చేరింది.
హైవేపై రూ.750 కోట్ల నగదు కలకలం
అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా సరిహద్దులోని 44వ జాతీయ రహదారిపై ఏకంగా రూ.750 కోట్ల నగదు పట్టుబడినట్లు సామాజిక మాధ్యమాల్లో గురువారం వైరల్ అయింది. దీంతో జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు. ’’రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు కేరళ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి హైదరాబాద్ యూబీఐకి నగదును బదిలీ చేస్తున్నట్టు మంగళవారం రాత్రి సమాచారం వచ్చింది.
ఈ మేరకు జిల్లా నుంచి ఆర్డీఓ, లీడ్ బ్యాంక్ మేనేజర్, డీఎస్పీ అధికారులు విచారణ చేసేందుకు స్పాట్‌కు వెళ్లి, నగదుకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఆ తర్వాత పోలీస్ ఎస్కార్ట్‌తో నగదును హైదరాబాద్‌లోని యూబీఐకి చేరినట్లు నిర్ధారణ చేసుకున్నాము’’’ అని క్రాంతి ఆ ప్రకటనలో వివరించారు. అయితే ఎంత మేరకు నగదు ఉందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment