మాల్యాకు షాక్: తొలి చార్జ్‌షీటు
ముంబై: సుదీర్ఘం కాలంగా వార్తల్లో నిలుస్తున్న మాల్యాగేట్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం లండన్ కోర్టులో ఊరట లభించిన లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యాకు ఈ సారి గట్టి షాకే తగిలింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్( ఈడీ) ముంబై పీఎంఎల్‌ఏ కోర్టులో బుధవారం మొట్టమొదటి చార్జ్‌షీట్ ఫైల్ చేసింది. ఉద్దేశ పూర్వక భారీ రుణ ఎగవేత దారుడిగా తేలిన మాల్యాపై ఎట్టకేలకు అధికారంగా ఐడీబీఐ రూ.900 కోట్ల కేసులో చార్జ్‌షీటను నమోదు చేసింది.
బ్యాంకులకు వేలకోట్ల రుణాలను ఎగవేసి లండన్‌కు పారిపోయిన మాల్యాను దేశానికి రప్పించే క్రమంలో ఎన్‌డీఏ సర్కారు మరింత వేగంగా కదులుతోంది. ఈ క్రమంలో సుదీర్ఘ కాలం విరామం తరువాత ఈడీ మాల్యాపై చార్జ్ షీట్ నమోదు చేయడం విశేషం.
లండన్‌లోని వెస్ట్ మినిష్టర్ కోర్టులో భారీ ఊరట లభించింది. మాల్యాని భారత్‌కు అప్పగించాలని భారత ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై ప్రారంభమైన విచారణ కాసేపటికే జులై 6వ తేదీకి వాయిదా పడింది. అంతేకాదు మాల్యా బెయిల్‌ని డిసెంబర్ 4వ తేదీ వరకు పొడిగించింది. మరోవైపు డిసెంబర్ వరకు బెయిల్ గడువు పొడిగింపుపై హర్షం వ్యక్తం చేసిన విజయ్ మాల్యా తానెలాంటి తప్పు చేయలేదనీ, దీనికి తగిన ఆధారాలు తన వద్ద వున్నాయని పేర్కొన్న సంగతి తెలిసిందే.