సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని మండావలి జైలులో గడుపుతున్న ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు దుబాయ్‌లో మూడు ఫ్లాట్లు ఉన్నాయని, హైదరాబాద్‌లోని ఒక ఫార్మా కాంట్రాక్టర్ నుంచి 2020లో అందిన ముడుపులతో వీటిని కొనుగోలు చేశారని ఆరోపించాడు. ఈ మేరకు మండావలి జైలు నుంచి మీడియాకు సుఖేష్ తన న్యాయవాది అనంత మాలిక్ ద్వారా తాజాగా మరో లేఖను విడుదల చేశారు.
దుబాయ్‌లోని జుమైరా పామ్స్‌లోని మూడు అపార్ట్‌మెంట్లను అత్యవసరంగా 65 మిలియన్ దిర్హామ్స్ (ఏఈడీ)కు అమ్మాలని వారం క్రితం దుబాయ్‌లోని తన సహచరుడు మనోజ్ జైన్‌ను కేజ్రీవాల్ కోరారని సుఖేశ్ ఆ లేఖలో ఆరోపించాడు. తనకు, సత్యేందర్ జైన్‌కు మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌లో దుబాయ్‌లో మూడు అపార్ట్‌మెంట్ల కొనుగోలు లావాదేవీల వివరాలున్నాయని, ఆ చాట్‌ను విడుదల చేస్తానని సుఖేశ్ పేర్కొన్నాడు. వారం రోజుల్లో ఈడీ, అవినీతి నిరోధక విజిలెన్స్‌కి ఆధారాలు పంపిస్తానని కూడా వెల్లడించాడు. సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడటం ఆపకపోతే హతమారుస్తామని బెదిరించారని పేర్కొన్నాడు. త్వరలో కేజ్రీవాల్ తిహార్ జైలుకు చేరుతారన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు.
Comments
Please login to add a commentAdd a comment