సాక్షి, అమరావతి : గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌ను భారీ కుట్రకు సంబంధించిన సామాజిక, ఆర్థిక నేరంగా గతంలో విచారణకు వచ్చినప్పుడు హైకోర్టు అభివర్ణించింది. బెయిల్ మంజూరు చేసే సమయంలో న్యాయస్థానాలు ఇలాంటి కేసులను ప్రత్యేక దృష్టి కోణంలో చూడాలని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చెప్పిందని గుర్తు చేసింది. ఈ స్కామ్‌లో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నిందితులపై ఉన్నవి తీవ్ర ఆరోపణలని తెలిపింది. ఈ స్కామ్‌లో రూ.371 కోట్ల ప్రజాధనం ముడి పడి ఉందని, చాలా తీవ్రత ఉందని హైకోర్టు తెలిపింది.
ఈ స్కిల్ కుంభకోణంలో ఇద్దరు కీలక నిందితులు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా, హైకోర్టు వారి పిటిషన్లు కొట్టేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు వేర్వేరు న్యాయమూర్తులు వేర్వేరు సందర్భాల్లో ఈ మేరకు తీర్పు ఇచ్చారు. షెల్ కంపెనీల కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్‌లను దర్యాపు అధికారులు కోర్టు ముందు ఉంచలేదన్న నిందితుల వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఆ విషయాలన్నీ తుది ట్రయల్‌లో చెప్పుకోవాలని స్పష్టం చేసింది. కేసు రికార్డులను పరిశీలించిన హైకోర్టు.. షెల్ కంపెనీల కొనుగోలు జరిగిన తీరును గమనించింది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, వారి బెయిల్ పిటిషన్లను కొట్టేస్తున్నట్లు తెలిపింది.
రిమాండ్ తిరస్కరణ సరికాదు..
ఇదే కుంభకోణంలో కీలక నిందితుడి రిమాండ్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించడాన్ని కూడా హైకోర్టు తప్పు పట్టింది. రిమాండ్ సమయంలో కింది కోర్టు మినీ ట్రయల్ నిర్వహిస్తూ ఫలానా సెక్షన్ వర్తించదంటూ తేల్చేయడంపై హైకోర్టు ఆక్షేపణ తెలిపింది. రిమాండ్ సమయంలో మినీ ట్రయిల్ తగదని స్పష్టం చేసింది. నిందితునిపై నమోదు చేసిన కేసు విచారణకు స్వీకరించదగ్గదా.. కాదా.. అన్నది మాత్రమే చూడాలని స్పష్టం చేసింది.
నేరంలో నిందితుల పాత్ర గురించి క్షుణ్ణంగా చెప్పాల్సిన అవసరం లేదంది. 41ఏ సీఆర్పీసీ కిందకు రాని నేరాలకు కూడా 41ఏ ఇవ్వాలని చెప్పడం సరికాదంది. ఈ మొత్తం కేసులో ఐపీసీ 120బి ప్రకారం నేరపూరిత కుట్ర ఉందన్న విషయాన్ని ఏసీబీ ప్రత్యేక కోర్టు విస్మరించిందని హైకోర్టు ఆక్షేపించింది. రిమాండ్ తిరస్కరిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment