చంద్రబాబు తప్పించుకోలేరు..‘యావజ్జీవం’ తప్పదు! | Yellow media distorting anticipatory bail | Sakshi
Sakshi News home page

చంద్రబాబు తప్పించుకోలేరు..‘యావజ్జీవం’ తప్పదు!

Published Sat, Jan 13 2024 4:57 AM | Last Updated on Sat, Jan 13 2024 10:20 AM

Yellow media distorting anticipatory bail - Sakshi

‘చంద్రబాబు శాశ్వతంగా జైలు పక్షిగా మారక తప్పదు. ఒకట్రెండ్రోజులు ఆలస్యం కావచ్చు తప్ప, యావజ్జీవ కారాగార శిక్ష మాత్రం పక్కా’ అని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఐపీసీ 409 సెక్షన్‌ కింద ఒక్కో కేసులో విడివిడిగా యావజ్జీవ కారాగార శిక్ష, పీసీ యాక్ట్‌ 13(బి) కింద ఒక్కో కేసులో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు రూ.కోటి ఫీజు చెల్లిస్తూ.. ప్రత్యేక విమానాల్లో చంద్రబాబు తీసుకువచ్చే న్యాయవాదులతో కేసు విచారణను కాస్త జాప్యం చేయగలరేమోగానీ నేరం నుంచి మాత్రం తప్పించలేరని స్పష్టం చేస్తున్నారు.భారీ అవినీతి కుంభకోణాల కుట్రదారు, లబ్దిదారులు.. చంద్ర­బాబు, ఆయన కుటుంబం, సన్నిహితులు, బినామీలేనని డాక్యుమెంటరీ ఆధారాలు, న్యాయ స్థానాల్లో నమోదు చేసిన కీలక సాక్షుల వాంగ్మూలాలు స్పష్టం చేస్తున్నాయి.

స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబుపై అభియోగాలతో ఏకీభవిస్తూ ఏసీబీ న్యాయస్థానం జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించడాన్ని బట్టి చూస్తుంటే.. ఈ ఒక్క కేసు చాలు చంద్రబాబుకు యావజ్జీవ శిక్ష పడటానికి అని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.అనారోగ్య కారణాలతో స్కిల్‌ స్కామ్‌ కేసులో బెయిల్‌ ఇస్తున్నప్పుడు గానీ.. తాజాగా మూడు కేసుల్లో హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ సందర్భంగా గానీ చంద్రబాబు అవినీతి చేయలేదని ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు. తద్వారా చంద్రబాబు, లోకేశ్‌తోపాటు సహచర కుట్రదారులైన టీడీపీ ప్రభుత్వంలో మంత్రులది కూడా జైలు దారేనన్నది స్పష్టమవుతోంది. స్కిల్‌ కార్పొరేషన్, ఫైబర్‌నెట్, అసైన్డ్‌ భూములు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్, మద్యం, ఇసుక కుంభకోణాల ద్వారా చంద్రబాబు ముఠా ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి ఎంతగా బరితెగించిందనే విషయం చర్చనీయాంశమైంది.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్కిల్‌ కార్పొరేషన్, ఫైబర్‌నెట్, అసైన్డ్‌ భూములు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్, మద్యం, ఇసుక కుంభకోణాలకు కర్త, కర్మ, క్రియ గత ముఖ్యమంత్రి చంద్రబాబే అని సీఐడీ దర్యాప్తులో పూర్తి ఆధారాలతో వెల్లడి కావడంతో ఆయనకు ఏ రకంగా చూసినా జీవిత ఖైదు తప్పదని న్యాయ నిపుణులు బల్ల గుద్ది చెబుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలోనే ఆయన సర్వం తానై కుట్ర పన్నారు. అందుకోసం కేబినెట్‌కు తెలియకుండా చీకటి జీవోలు జారీ చేశారు. స్కిల్‌ ప్రాజెక్ట్, ఫైబర్‌ నెట్, బినామీల పేరుతో అసైన్డ్‌ భూములు పొందిన వారికి భూ సమీకరణ ప్యాకేజీ, మద్యం కొనుగోళ్లపై ప్రివిలేజ్‌ పన్ను.. జీఎస్టీ ఎత్తివేత, ఉచిత ఇసుక విధానం.. ఇలా అన్ని కుంభకోణాలకు మార్గం సుగమం చేసేందుకు గత టీడీపీ ప్రభుత్వం వేర్వేరు జీవోలను జారీ చేసింది.

ఆ జీవోకు కూడా కేబినెట్‌ ఆమోదం లేకపోవడం చంద్రబాబు కుట్రను వెల్లడిస్తోంది. ఆ జీవోలకు సంబంధించిన నోట్‌ ఫైళ్లను కూడా మాయం చేయడం గమనార్హం. మాయం చేసిన నోట్‌ ఫైళ్లను సీఐడీ అధికారులు రిట్రీవ్‌ చేసి వెలుగులోకి తేవడంతో అన్ని కుంభకోణాల కుట్రలకు కీలక ఆధారాలు లభించాయి. చంద్రబాబు ముఠా గల్లంతు చేసిన అమరావతిలో అసైన్డ్‌ భూముల రికార్డులను సీఐడీ వెలికి తీసింది. స్కిల్‌ స్కామ్, ఫైబర్‌ నెట్‌ స్కామ్‌లలో కొల్లగొట్టిన నిధులు చంద్రబాబు నివాసానికే చేర్చిన అవినీతి నెట్‌వర్క్‌ను బ్యాంకు ఖాతాల వివరాలతోసహా ఛేదించింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ మార్పులు, క్విడ్‌ ప్రో కో కింద చంద్రబాబు కరకట్ట నివాసం పొందడం, హెరిటేజ్‌ ఫుడ్స్‌కు భూములు దక్కడం, చంద్రబాబు, నారాయణ బినామీల పేరిట భూ సమీకరణ ప్యాకేజీ పొందడం మొదలైనవన్నీ రికార్డులతో సహా వెలుగులోకి వచ్చాయి.

ఈ విధంగా చంద్రబాబు, లోకేశ్, నారాయణల పాత్రను స్పష్టం చేస్తూ పూర్తి డాక్యుమెంటరీ ఆధారాలు లభించాయి. మరోవైపు ఈ కుంభకోణాలన్నింటికి చంద్రబాబే అని కీలక సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చారు. అది కూడా 164 సీఆర్‌సీపీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలాలు నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసైన్డ్‌ భూములను అన్యాక్రాంతం చేయడం చట్ట విరుద్ధమని చెప్పినప్పటికీ చంద్రబాబు పట్టించుకోలేదని అప్పటి సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, గుంటూరు జిల్లా కలెక్టర్‌ వాంగ్మూలాలు ఇచ్చారు. ఫైబర్‌నెట్, స్కిల్‌ స్కామ్‌లలో నిబంధనలకు విరుద్ధంగా నిధులు మంజూరు చేయొద్దని చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని కీలక అధికారుల వాంగ్మూలాలు నమోదు చేశారు.

షెల్‌ కంపెనీల ప్రతినిధులు కూడా అప్రూవర్‌గా మారి అదే విషయాన్ని చెప్పారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో కన్సల్టెన్సీ కంపెనీ, స్కిల్‌ స్కామ్‌కు సంబంధించి సీమెన్స్‌ కంపెనీ కూడా 164 సీఆర్‌సీపీ కింద వాంగ్మూలాలు నమోదు చేశాయి. ఈ విధంగా అన్ని కుంభకోణాల్లో చంద్రబాబు ప్రధాన కుట్రదారు, ప్రధాన లబ్దిదారు అనే­దానికి అటు డాక్యుమెంటరీ ఆధారాలు, ఇటు కీలక సాక్షుల వాంగ్మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కేసుల నుంచి చంద్రబాబు తప్పించుకోవడం ఇక అసా«­ద్యమని న్యాయ నిపుణులు తేల్చి చెబుతు­న్నా­రు.  

చంద్రబాబును రిమాండ్‌కు పంపడమే తార్కాణం 
ఒక్క మెతుకు చూస్తే చాలు అన్నం ఉడికిందో లేదో చెప్పొచ్చు. అలానే చంద్రబాబు పాల్పడ్డ ఇన్ని కుంభకోణాలలో ఒక్క స్కిల్‌ స్కామ్‌ను పరిశీలిస్తే చాలు.. ఆయన అవినీతి బాగోతం తెలిసిపోతోంది. సీఐడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చంద్రబాబును అరెస్ట్‌ చేసిన అనంతరం విజయవాడ ఏసీబీ న్యాయ స్థానంలో హాజరు పరిచింది.

ఆ సందర్భంగా దాదాపు 10 గంటలపాటు ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత ఆయనకు జ్యుడిషి యల్‌ రిమాండ్‌ విధించాలని న్యాయమూర్తి ఆదేశించారు. సీఐడీ నమోదు చేసిన అభియోగాలు, అందులో పేర్కొన్న సెక్షన్లతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ ఈ నిర్ణయం ప్రక­టించారు. దాంతోనే చంద్రబాబు 52 రోజుల­పాటు రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. అనంతరం అనా­రోగ్య కారణాలతోనే ఆయనకు బెయిల్‌ మంజూరు చేశారు. ఇక సెక్షన్‌ 17–ఏను వక్రీకరిస్తూ కేసుల నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలించ లేదు.   

ముందస్తు బెయిల్‌పై ఎల్లో మీడియా వక్రీకరణ 
ఇన్నర్‌ రింగ్‌ రోడ్, మద్యం, ఇసుక కుంభకోణాల కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. కానీ ఆ సందర్భంగా కూడా ఆయన అవినీతికి ఆధారాలు లేవని న్యాయస్థానం చెప్ప లేదు. కేసు పూర్వాపరాల్లోకి ఇంకా తాము వెళ్లడం లేదని కూడా స్పష్టం చేసింది. కేవలం షరతులతోనే ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. విచారణకు చంద్రబాబు సహకరించాలని.. విచారణకు పిలిస్తే వెళ్లాలని కూడా చెప్పింది.

కానీ హైకోర్టు తీర్పుకు వక్రభాష్యం చెబుతూ చంద్రబాబుకు క్లీన్‌ చిట్‌ లభించినట్టుగా ఈనాడు, ఇతర ఎల్లో మీడియా హడావుడి చేయడం విస్మయ పరుస్తోంది. సీఐడీ సేకరించిన ఆధారా­లతో నేరం రుజువు కావడం ఖాయమని న్యాయ నిపు­ణులు స్పష్టం చేస్తున్నారు. నేరం నిరూపితమైన తర్వాత ఒక్కో కేసులో చంద్రబాబుకు యావజ్జీవ జైలు శిక్ష పడుతుందని కూడా తేల్చి చెబుతున్నారు. ఆయనపై సీఐడీ నమోదు చేసిన వివిధ సెక్షన్ల తీవ్రత, కేసుల విచారణ ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తున్న నిపుణులు ఈ విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నిందితులు వీరే  
♦ నారా చంద్రబాబునాయుడు 
♦  నారా లోకేశ్, పొంగూరు నారాయణ 
♦  కింజరాపు అచ్చెన్నాయుడు 
♦  దేవినేని ఉమామహేశ్వరరావు 
♦ కొల్లు రవీంద్ర, పీతల సుజాత 
♦  చింతమనేని ప్రభాకర్‌

తవ్వేకొద్దీ అవినీతే
♦  స్కిల్‌ స్కామ్‌లో రూ.241 కోట్లు చంద్రబాబు నివాసానికి చేరాయని సీఐడీ ఆధారాలతోసహా వెలుగులోకి తెచ్చింది.  

♦ ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్ట్‌ను నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు తన బినామీ అయిన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌ కంపెనీకి కట్టబెట్టేశారు. ఆ కంపెనీని బ్లాక్‌ లిస్ట్‌ నుంచి తొలగించి మరీ టెండరు అప్పగించారు. నాసిరకం పనులు చేసినాసరే పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా రూ.244 కోట్లు చెల్లించగా అందులో రూ.144 కోట్లు చంద్రబాబు నివాసానికే చేరాయి.  

♦  అమరావతిలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ పేరిట చంద్రబాబు, లోకేశ్, నారాయణ భారీ భూ బాగోతానికి పాల్పడ్డారు. తమ బినామీ అయిన లింగమనేని కుటుంబానికి చెందిన భూములను ఆనుకుని నిర్మించేలా ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ ఖరారులో క్విడ్‌ ప్రో కోకు పాల్పడ్డారు. కృష్ణా నదికి ఇటూ అటూ కూడా లింగమనేని కుటుంబం, హెరిటేజ్‌ ఫుడ్స్, నారాయణ విద్యా సంస్థలకు చెందిన 355 ఎకరాల సమీపం నుంచి నిర్మించేలా రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. అందుకోసం కన్సల్టెన్సీ ఎంపిక కోసం టెండర్లు పిలవకుండా నామినేషన్‌పై కట్టబెట్టారు.

అనంతరం అదే అలైన్‌మెంట్‌ను అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో చేర్చేలా ముందుగానే షరతు విధించి మరీ రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ డెవలపర్‌ను నిర్ణయించారు. దాంతో అప్పటి వరకు చంద్రబాబు, లింగమనేని, నారాయణ భూముల మార్కెట్‌ విలువ మొత్తం రూ.177.50 కోట్లు ఉండగా.. అలైన్‌మెంట్‌ ఖారారుతో ఏకంగా రూ.887.50 కోట్లకు పెరిగింది. అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చెప్పిన దాని ప్రకారమే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిరి్మంచిన తర్వాత అమాంతంగా రూ.2,130 కోట్లకు పెరుగుతుందని స్పష్టమైంది. అంటే అలైన్‌మెంట్‌ ఖరారులో అక్రమాలకు పాల్పడి దాదాపు రూ.2 వేల కోట్ల అక్రమ లబ్ధికి పచ్చముఠా కుట్ర పన్నింది.  

♦ చంద్రబాబు కనుసన్నల్లో సాగిన అమరావతిలోని అసైన్డ్‌ భూముల దందా దేశ చరిత్రలోనే అతి పెద్ద భూ దోపిడీగా రికార్డు సృష్టించింది. సీఎం పదవిని అడ్డుపెట్టుకుని ఏకంగా కేంద్ర అసైన్డ్‌ భూముల చట్టాన్ని ఉల్లంఘించి ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల అసైన్డ్‌ భూములు కొల్లగొట్టారు. అందుకోసం  అమరావతి పరిధిలో అసలు 1954 తర్వాత అసైన్డ్‌ భూములే ఇవ్వలేదంటూ భూ రికార్డులు తారుమారు చేశారు. అసైన్డ్‌ భూములను జిరాయితీ భూములుగా రికార్డుల్లో కనికట్టు చేశారు. పరిహారం ఇవ్వకుండా అసైన్డ్‌ భూములను రాజధాని కోసం ప్రభుత్వం తీసుకుంటుందని రైతులను భయపెట్టారు.

అందుకోసం మొదట జీవో నంబర్‌–1 జారీ చేశారు. ఆ జీవోను బూచిగా చూపిస్తూ తమ ఏజంట్ల ద్వారా 617.70 ఎకరాల అసైన్డ్‌ భూములను నిబంధనలకు విరుద్ధంగా హస్తగతం చేసుకున్నారు. అనంతరం అసైన్డ్‌ భూములకు కూడా భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో నంబర్‌–41 జారీ చేశారు. తద్వారా భూ సమీకరణ ప్యాకేజీ కింద రూ.3,737.30 కోట్ల విలువైన స్థలాలు కొల్లగొట్టారు. ప్రభుత్వ భూములను కూడా తమ బినామీల భూములుగా చూపిస్తూ ఏకంగా 328 ఎకరాలను కొల్లగొట్టారు. భూ సమీకరణ ప్యాకేజీ కింద రూ.760.25 కోట్లు విలువైన స్థలాలు పొందారు.  

♦ పేరుకు ఉచిత ఇసుక అని చెప్పి.. చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులు మాత్రమే ఉచితంగా ఇసుక కొల్లగొట్టి బహిరంగ మార్కెట్‌లో అత్యధిక ధరలకు విక్రయించేలా చక్రం తిప్పారు. తద్వారా ఐదేళ్లలో రూ.10 వేల కోట్ల విలువైన ఇసుక దోపిడీకి పాల్పడ్డారు.  

♦ తమ అస్మదీయ, బినామీ కంపెనీలకు మద్యం కొనుగోళ్ల కాంట్రాక్టులు కట్టబెడుతూ చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారు. 2012 నుంచి అమలులో ఉన్న మద్యం దుకాణాలు, బార్లపై ఉన్న ప్రివిలేజ్‌ ట్యాక్స్‌.. జీఎస్టీని తొలగిస్తూ చీకటి జీవోలు జారీ చేశారు. మద్యం డిస్టిలరీలు, మద్యం దుకాణాలు, బార్ల యజమానుల నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల మేర గండి కొట్టారు.

ఆరు కేసుల్లోనూ శిక్ష తప్పదు 
చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఎ), 409, 201, 109 రెడ్‌విత్‌ 34, 37­లతోపాటు అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్‌విత్‌ 13(1), (సి), (డి) కింద అభియో­గా­లు నమోదు చేయడం ప్రాధాన్యత సంతరి­ంచుకుంది. వీటిలో అత్యంత కీలకమైనది సెక్షన్‌ 409. ఆ సెక్షన్‌ కింద నేరం నిరూ­పితమైతే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్‌విత్‌ 13(1), (సి), (డి) కింద నేరం నిరూపితమైతే గరి­ష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఒక్కో కేసులో గరిష్టంగా పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నా­యి. ఇక ఇతర సెక్షన్లు సరేసరి. ఈ ఆరు కేసుల్లో తీర్పులు వేర్వేరుగా వస్తాయి.

నేరం నిరూపితమై శిక్షలు పడితే చంద్రబాబు వేర్వే­రుగా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఇప్ప­టికే బాబుకు 73 ఏళ్లు నిండుతున్నా­యి. ఈ నేపథ్యంలో ఓసారి నేరం నిరూపితమై ఒక్కో కేసులో ఐపీసీ 409 సెక్షన్‌ కింద యావజ్జీవ కారాగార శిక్ష, అవినీతి నిరోధక చట్టం 13(2) కింద గరిష్టంగా పదేళ్ల కారాగార శిక్ష పడితే తదు­పరి పరిణామాలు ఎలా ఉంటాయో ఊహి­ంచుకోవచ్చు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్, అసైన్డ్‌ భూముల కేసుల్లో లోకేశ్‌ కూడా నిందితుడిగా ఉన్నారు. నారాయణతో­పాటు టీడీపీ ప్రభు­త్వ­ంలో మంత్రులుగా పని చేసిన వారు కూ­డా ఉన్నారు. వారంతా శిక్ష అనుభవించాల్సిందే­నని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

సీఎంగా ఉంటూ అవినీతికి పాల్పడిన కేసు­ల్లో హరియాణా మాజీ సీఎం ఓమ్‌ ప్రకా­శ్‌ చౌతాలకు 16 ఏళ్ల తర్వాత జైలు శిక్ష పడిన ఉదంతాన్ని ఉదాహరిస్తున్నా­రు. తాజాగా తమి­ళనాడులో మంత్రిగా చేసిన సెంథిల్‌ బాలా­జీ, మద్యం కేసుల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా­కు ఇప్పటికీ బెయిల్‌ రాకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు.

బాబుపై నమోదైన ఐపీసీ సెక్షన్లు ఇవే.. 

     120 (బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఎ), 409, 201, 109 రెడ్‌విత్‌ 34, 37, అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్‌విత్‌ 13(1), (సి), (డి) 
     409 సెక్షన్‌ కింద నేరం నిరూపితమైతే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు.  
     13 (2) రెడ్‌విత్‌ 13(1), (సి), (డి) కింద నేరం నిరూపితమైతే పదేళ్ల వరకు శిక్ష పడుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement