రూ.66.03 కోట్లు కొల్లగొట్టిన మాజీ మంత్రి ప్రత్తిపాటి కుటుంబం
టీడీపీ నేత ప్రత్తిపాటి కుటుంబ కంపెనీ అవెక్సా బాగోతం ఇదీ
విజయవాడ పోలీసులకు డీఆర్‌ఐ ఫిర్యాదు.. ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్టు
ఆయనతోపాటు మరో ఆరుగురిపై పోలీసుల కేసు..
అమరావతిలో సబ్ కాంట్రాక్టుల పేరుతో గోల్‌మాల్
బోగస్ ఇన్వాయిస్‌లు సమర్పించి రూ. కోట్ల ప్రజల సొమ్ము స్వాహా
కాంట్రాక్టు సంస్థ నుంచి సబ్ కాంట్రాక్టుకు పనులు
ఆ పనులు మరికొన్ని కంపెనీలకు అప్పజెప్పినట్లుగా బిల్లులు
ఆ కంపెనీల ద్వారా అక్రమంగా నిధుల మళ్లింపు
ఈ పనులు చేసినందుకు రూ.17.85 కోట్లు ఇన్‌పుట్ ట్యాక్స్ సబ్సిడీ
జీఎస్టీ ఇంటెలిజెన్స్, డీఆర్‌ఐ సోదాల్లో వెల్లడి
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో జరిగిన కుంభకోణాల్లో మరో భారీ అవినీతి బయటపడింది. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం రాజధానిలో మౌలిక సదుపాయాల కాంట్రాక్టుల పేరిట రూ.66.03 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు వెల్లడైంది. ప్రత్తిపాటి కుటుంబానికి చెందిన అవెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టుల పేరుతో బోగస్ ఇన్వాయిస్‌లు సమర్పించి నిధులు కొల్లగొట్టి.. షెల్‌కంపెనీల ద్వారా దారి మళ్లించినట్టు ఆధారాలతోసహా బట్టబయలైంది.
కేంద్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ), రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీ డీఆర్‌ఐ) సోదాల్లో ఈ వ్యవహారం మొత్తం బయటకొచ్చింది. ఈ కంపెనీ కేంద్ర జీఎస్టీ విభాగాన్ని బురిడీ కొట్టించడంతోపాటు రాష్ట్ర ఖజానాకు గండి కొట్టి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడినట్లు తేటతెల్లమైంది. దీంతో డీఆర్‌ఐ ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి అవెక్సా కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను గురువారం అరెస్టు చేశారు. ఆయనతోపాటు మరో ఆరుగురిపై ఐపీసీ సెక్షన్లు 420, 409, 467, 471, 477(ఎ), 120 (బి) రెడ్‌విత్ 34 కింద కేసు నమోదు చేశారు. ఆయన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.
తీగ లాగితే కదిలిన డొంక
ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబానికి చెందిన అవెక్సా కార్పొరేషన్‌కు హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం, నెల్లూరు, విజయనగరం జిల్లా మానాపురంలలో బ్రాంచి కార్యాలయాలున్నాయి. ప్రత్తిపాటి పుల్లారావు భార్య తేనే వెంకాయమ్మ డైరెక్టర్‌గా, ఆయన కుమారుడు ప్రత్తిపాటి శరత్ అదనపు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ కంపెనీకి టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టింది. వాటి పనులు చేయకపోయినప్పటికీ, చేసినట్లు గా బోగస్ ఇన్వాయిస్‌లు సమర్పించిన అవెక్సా కంపెనీ బిల్లులు డ్రా చేసుకోవడంతోపాటు జీఎస్టీ విభాగం నుంచి అడ్డగోలుగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని కూడా పొందింది.
దేశవ్యాప్తంగా అక్రమంగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందిన కంపెనీలపై డీజీజీఐ విచారణ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అవెక్సా కంపెనీ అక్రమంగా ఐటీసీ పొందిందని వెల్లడి కావడంతో ఆ కంపెనీకి డీజీజీఐ రూ.16 కోట్ల జరిమానా విధిస్తూ షోకాజ్ కమ్ డిమాండ్ నోటీసు జారీ చేయాలని ప్రతిపాదించింది. అసలు అవెక్సా కార్పొరేషన్ వ్యవహారాలు, కాంట్రాక్టులు, బిల్లుల చెల్లింపులపై డీజీజీఐ, ఏపీ డీఆర్‌ఐ దృష్టిసారించాయి. ఆ కంపెనీ కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించడంతో మొత్తం బాగోతం బట్టబయలైంది.
షెల్ కంపెనీలను సబ్ కాంట్రాక్టర్లుగా చూపించి రూ.21.93 కోట్లు
అవెక్సా కార్పొరేషన్ ముసుగులో ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం ప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందీ అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది. 2017 నుంచి అవెక్సా కార్పొరేషన్ పేరుతో ప్రత్తిపాటి కుటుంబం అమరావతిలో కాంట్రాక్డు సంస్థలను బెదిరించి సబ్ కాంట్రాక్టులు తీసుకుంది. పనులు చేయకుండానే అక్రమంగా నిధులు కొల్లగొట్టింది. జాక్సన్ ఎమినెన్స్ (ప్రస్తుత పేరు జైశ్నవి ఎమినెన్స్) అనే కంపెనీ అమరావతిలో మౌలిక సదుపాయాల కాంట్రాక్టును పొందింది. ఆ కంపెనీ నుంచి రూ.37.39 కోట్ల విలువైన పనులను అవెక్సా కార్పొరేషన్ సబ్ కాంట్రాక్టుకు తీసుకుంది.
సీఆర్‌డీయే పరిధిలో రోడ్లు, వరదనీటి కాలువలు, కల్వర్టులు, సివరేజ్ పనులు, వాకింగ్ ట్రాక్‌లు, పచ్చదనం తదితర పనులు అవెక్సా కార్పొరేషన్ చేయాల్సి ఉంది. అయితే, ఈ సంస్థ తానిషా ఇన్‌ఫ్రా, రాలాన్ ప్రోజెక్ట్స్, అనయి ఇన్ఫ్రా అల్వేజ్ టౌన్ ప్లానర్స్ అనే నాలుగు కంపెనీలకు రూ.21.93 కోట్లకు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చినట్టు చూపించింది. ఆ సబ్ కాంట్రాక్టుల ముసుగులోనే అవెక్సా కంపెనీ ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు డీఆర్‌ఐ సోదాల్లో వెల్లడైంది. సబ్ కాంట్రాక్టుకు ఇచ్చామని చెప్పిన నాలుగు కంపెనీల నుంచి బోగస్ ఇన్వాయిస్‌లు, బిల్లులు పొంది ఆ మేరకు పనులు చేసినట్టుగా కనికట్టు చేసింది.
ప్రభుత్వ ఖజానా నుంచి బిల్లుల సొమ్ము పొందింది. కేంద్ర జీఎస్టీ నుంచి అక్రమంగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను కూడా తీసుకుంది. వాస్తవానికి సబ్ కాంట్రాక్టు సంస్థల నుంచి అవెక్సా కంపెనీ ఎలాంటి సేవలూ పొందలేదు. అవి ఏ పనులూ చేయలేదు. ఆ నాలుగు కంపెనీలూ షెల్ కంపెనీలే. వాటి పేరుతో మొత్తం రూ.21,93,08,317 నిధులను ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం అక్రమంగా తరలించింది.
రహదారి కాంట్రాక్టుల ముసుగులో రూ.26.25 కోట్లు దోపిడీ
అంతటితో అవెక్సా కంపెనీ అక్రమాలు ఆగలేదు. అమరావతిలోని ఉద్దండరాయపురం నుంచి నిడమర్రు వరకు ఎన్ 9 రోడ్డు నిర్మాణ కాంట్రాక్టును బీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా ఇండియా లిమిటెడ్ కంపెనీ నుంచి సబ్ కాంట్రాక్టుకు తీసుకుంది. కానీ ఎలాంటి రోడ్డు పనులు చేయకుండానే అక్రమంగా బిల్లులు సమర్పించి ప్రజాధనాన్ని సొంత ఖాతాలోకి మళ్లించుకుంది.
రహదారి నిర్మాణం కోసం మెటీరియల్ కొనుగోలు చేసినట్టు, వివిధ వృత్తి నిపుణుల సేవలు పొందినట్టు బీఎస్‌ఆర్ కంపెనీ పేరిట బోగస్ బిల్లులు సమర్పించి కనికట్టు చేసింది. అందుకోసం క్వాహిష్ మార్కెటింగ్ లిమిటెడ్, నోయిడా ఎస్‌పాత్ లిమిటెడ్, ప్రశాంత్ ఇండస్ట్రీస్, గోల్డ్ ఫినెక్స్ ఐరన్ – స్టీల్ కంపెనీల నుంచి మెటీరియల్ కొనుగోలు చేసినట్టు బోగస్ బిల్లులు సమర్పించింది. ఆ విధంగా ఏ పనీ చేయకుండానే వివిధ దశల్లో రూ.26,25,19,393 దోపిడీ చేసింది.
గృహ నిర్మాణ ప్రాజెక్టుల పేరిట అక్రమంగా రూ.17.85 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్
పేదల గృహ నిర్మాణ ప్రాజెక్టులోనూ అవెక్సా కంపెనీ అడ్డగోలుగా నిధులు కొల్లగొట్టింది. ఏపీ టిడ్కో కింద జి+3 గృహ నిర్మాణ ప్రాజెక్టు, విశాఖపట్నంలో హుద్‌హుద్ తుపాను బాధితులకు 800 గృహాల నిర్మాణ ప్రాజెక్టు, మిడ్ పెన్నార్ ప్రాజెక్టు ఆధునీకరణ సబ్ కాంట్రాక్టులు పొందింది. ఆ ప్రాజెక్టుల బిల్లుల కింద బోగస్ ఇన్వాయిస్‌లు సమర్పించి ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము పొందింది.
ఈమేరకు ఆధ్యా ఎంటర్‌ప్రైజస్, మెస్సెర్స్ సంజయ్ కుమార్ భాటియా, తనిష్క్ స్టీల్ లిమిటెడ్, మౌంట్ బిజినెస్ బిల్డ్ లిమిటెడ్ కంపెనీల నుంచి మెటీరియల్ కొన్నట్లు బోగస్ ఇన్వాయిస్‌లు, బిల్లులు సమర్పించింది. ఆ పేరుతో ఏకంగా రూ.17,85,61,864 ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందింది. ఈ విధంగా అవెక్సా కార్పొరేషన్ కంపెనీ ద్వారా ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం మొత్తం రూ.66,03,89,574 ప్రజాధనాన్ని కొల్లగొట్టింది.
అవును ...భోగస్ బిల్లులతో నిధులు కొల్లగొట్టాం – అవెక్సా కంపెనీ డైరెక్టర్ కుర్ర జగదీశ్వరరావు
ఈ వ్యవహారంపై డీజీజీఐ, ఏపీ డీఆర్‌ఐ విచారణలో మొత్తం లోగుట్టు బట్టబయలైంది. అవెక్సా కంపెనీ డైరెక్టర్‌గా ఉన్న కుర్ర జగదీశ్ తాము బోగస్ ఇన్వాయిస్‌లు సమర్పించి అక్రమంగా బిల్లులు డ్రా చేసుకున్నామని అంగీకరించారు. ఈ కుంభకోణానికి ఎలా పాల్పడిందీ ఆయన సవివరంగా వెల్లడించారు. దాంతో అవెక్సా కంపెనీ ముసుగులో ప్రత్తిపాటి కుటుంబం అవినీతి బాగోతం ఆధారాలతోసహా బట్టబయలైంది.
తనయుడి కోసం తండ్రి పుల్లారావు చక్కర్లు
విజయవాడ స్పోర్ట్స్/గుణదల (విజయవాడ తూర్పు): అమరావతి పనుల కుంభకోణంలో దొరికిపోయిన ప్రత్తిపాటి శరత్ కోసం అతని తండ్రి, టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి పత్త్రిపాటి పుల్లారావు విజయవాడలో చక్కర్లు కొట్టారు. డీఆర్‌ఐ ఫిర్యాదుపై శరత్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ పోలీసులు అత్యంత గోప్యంగా విచారణ చేపట్టారు. దీంతో శరత్ జాడ కోసం అతని తండ్రి పుల్లారావు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, ఇతర టీడీపీ నాయకులను వెంటేసుకుని పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షణలు చేశారు.
ముందుగా గురునానక్ కాలనీలోని ఏసీపీ కార్యాలయానికి, అక్కడ లేకపోవడంతో మాచవరం పోలీస్ స్టేషన్‌కు, ఆ తర్వాత టాస్‌్కఫోర్స్ కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం తన అనుచరులను నగరం నలుదిక్కులకు పంపారు. ఆ తరువాత సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో విచారణ జరుగుతోందని తెలుసుకుని అక్కడకు చేరుకున్నారు. అక్కడా లేకపోవడంతో టీడీపీ కార్యాలయానికి వచ్చారు.
రాత్రి 8.30 గంటల సమయంలో పుల్లారావు, పట్టాభి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితరులతో కలిసి పోలీసు కమిషనరేట్‌కు చేరుకొని తన కొడుకును చూపించాలంటూ ఆందోళనకు దిగారు. కొద్ది సేపటి తరువాత రూరల్ డీసీపీ కె.శ్రీనివాసరావు వచ్చి ఓ గంటలో న్యాయమూర్తి వద్ద నిందితుడు శరత్‌ను ప్రవేశపెడతామని చెప్పడంతో ఆందోళన విరమించి మాచవరంలోని జడ్జి క్వార్టర్స్‌కు వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment