ముంబై: ఆర్థిక సంక్షోభంలో ఉన్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌లో వాటా కొనుగోలు చేసే ప్రతిపాదనపై టాటా సన్స్ అంతర్గతంగా సమాలోచనలు జరుపుతోంది. ఇందుకు సంబంధించి సంస్థ బోర్డు శుక్రవారం సమావేశమయ్యే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. ‘జెట్ ఎయిర్‌వేస్ కోసం బిడ్ చేసే ప్రతిపాదనపై చర్చించేందుకు టాటా సన్స్ బోర్డు శుక్రవారం సమావేశమవుతుంది‘ అని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, టాటా సన్స్, జెట్ ఎయిర్‌వేస్ ప్రతినిధులు దీనిపై స్పందించడానికి నిరాకరించారు. ఊహాగానాలపై తాము స్పందించబోమని టాటా సన్స్ ప్రతినిధి పేర్కొన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ తమ సిబ్బందికి జీతాలివ్వడంలోనూ, లీజుకు తీసుకున్న విమానాల అద్దెలు చెల్లించడంలోనూ విఫలమవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 1,261 కోట్ల మేర నికర నష్టాన్ని ప్రకటించింది. నిధుల సమీకరణలో భాగంగా 6 బోయింగ్ 777 విమానాలను విక్రయానికి ఉంచింది కూడా.
విలీనానికి అంగీకరిస్తేనే?
ఇప్పటికే విమానయాన సేవల వెంచర్స్ ఉన్న టాటా సన్స్.. తాజా పరిస్థితుల నేపథ్యంలో జెట్ ఎయిర్‌వేస్‌ను టేకోవర్ చేసే ప్రయత్నాలపై దృష్టి సారించింది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి టాటా గ్రూప్ విస్తార పేరిట ఒక వెంచర్‌ను, మలేషియాకి చెందిన ఎయిర్‌ఏషియాతో కలిసి ఎయిర్ ఏషియా ఇండియా పేరిట మరో విమానయాన వెంచర్‌ను నిర్వహిస్తోంది. ఈ వెంచర్స్‌కి ఉపయోగపడేలా ఉంటే జెట్ ఎయిర్‌వేస్‌లో వాటాలు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. వీటి ప్రకారం జెట్ ఎయిర్‌వేస్‌ను పూర్తిగా విలీనం చేసుకుంటే శ్రేయస్కరమని విస్తార మాతృసంస్థ టాటా–సింగపూర్ ఎయిర్‌లైన్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయొచ్చు. దీనిలో జెట్ వైస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ కుటుంబం, జెట్‌లో వాటాలు ఉన్న ఎతిహాద్ ఎయిర్‌వేస్, టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వాములుగా ఉంటారు.
షేరు జూమ్..
టాటా సన్స్ టేకోవర్ వార్తల నేపథ్యంలో జెట్ ఎయిర్‌వేస్ షేరు గురువారం దాదాపు 26 శాతం దాకా ఎగిసింది. బీఎస్‌ఈలో 24.5 శాతం పెరిగి రూ.320.95 వద్ద క్లోజయింది. అటు ఎన్‌ఎస్‌ఈలో 26.41 శాతం ఎగిసి రూ. 326 వద్ద ముగిసింది.
జెట్‌పై నేడు టాటా సన్స్ భేటీ..
Published Fri, Nov 16 2018 12:59 AM | Last Updated on Fri, Nov 16 2018 12:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment