ఖమ్మం వ్యవసాయం : రైతులు పండించిన పంట ఉత్పత్తుల విక్రయంలో పారదర్శకత కోసమే ఎలక్రానిక్ బిడ్డింగ్‌ను ఏర్పాటు చేసినట్లు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎం.ఎ.జావీద్ అన్నారు. ఈ-బిడ్డింగ్‌పై స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో జిల్లా రైతు సంఘాల నేతలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జావీద్ మాట్లాడుతూ మార్కెట్ యార్డులో ఆధునిక పద్ధతుల్లో క్రయ విక్రయాలు, తూకాలు, రైతులకు తక్‌పట్టీల జారీ, మార్కెట్లకు సమాచారం అందించడం కోసం కంప్యూటరైజేషన్, ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల రైతులకు తమ సరుకు మార్కెట్ యార్డులోనికి వచ్చింది మొదలు అమ్ముకుని తక్‌పట్టీ పొందే వరకూ పారదర్శకత ఉంటుందన్నారు. ఈ విధానాన్ని రాష్ట్రంలోకెల్లా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ప్రథమంగా ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
యార్డులకు సరుకు వచ్చినప్పుడు గేటు వద్ద రైతు వివరాలు, సరుకు వివరాలు కంప్యూటర్‌లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ వివరాలతో కూడిన పత్రం (టోకెన్) మార్కెటింగ్ శాఖ రైతుకు జారీ చేస్తుందన్నారు. రైతు సెల్‌కు కమీషన్ ఏజెంట్ సెల్‌కు మెసేజ్ వస్తుందని తెలిపారు. ఈ విధానం ద్వారా సరుకు గుర్తింపు, భద్రత ఉంటుందని తెలిపారు. ఈ-బిడ్డింగ్ విధానంతో ఎక్కువ మంది ఖరీదుదారులు ధర కోట్ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ విధానంతో రైతులకు పోటీ ధర లభిస్తుందని పేర్కొన్నారు.
రైతు సరుకు బిడ్ అయిన వెంటనే రైతు సెల్‌కు మెసేజ్ వెళ్తుందని, బిడ్డింగ్‌లోని అధిక ధర, ఖరీదుదారుల పేరు, అమ్మకందారుడి పేరు, వివరాలు, పట్టికలు, ఖరీదుదారు, కమీషన్ ఏజెంట్లకు జారీ అవుతాయని తెలిపారు. ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్‌ల ద్వారా కాంటాలు వేసి, తూకం వివరాలు రైతు సమక్షంలోనే నమోదు చేస్తామని, కాంటా చిట్టా జారీ చేస్తామని వివరించారు. కంప్యూటర్ కౌంటర్ నుంచి రైతులకు తక్‌పట్టీ జారీ అవుతుందని, ఇందులో రైతుకు రావాల్సిన డబ్బు, చెల్లించాల్సిన చార్జీల వివరాలు ఉంటాయని తెలిపారు. ఈ-బిడ్డింగ్ విధానంతో రైతులు తక్కువ సమయంలో సరుకు అమ్ముకుని వెళ్లే వీలుంటుందని చెప్పారు.
మార్కెట్ రేట్ల సమాచారం ఇంటర్‌నెట్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకుడు వి.బి.భాస్కర్‌రావు మాట్లాడుతూ ఈ-బిడ్డింగ్ విధానం అమలుకు రైతులు, వ్యాపారులు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. రైతుసంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ మార్కెట్‌కు వచ్చే సరుకును నాణ్యతను బట్టి గ్రేడింగ్ చేయించి అమ్మకాలు జరిపితే తగిన రేటు రైతుకు లభిస్తుందని అభిప్రాయపడ్డారు. మార్కెట్‌లో వ్యాపారులు సిండికేట్ కాకుండా చూడాలని కోరారు.
ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ విధానం రైతులతోపాటు వ్యాపారులకు కూడా మంచిదని, పారదర్శకతతో ఈ విధానాన్ని అమలు చేయాలని కోరారు. మార్కెట్‌యార్డులోని రైతు విశ్రాంతి భవనం అధ్వానంగా ఉందని, దీనికి మరమ్మత్తులు చేయించాలని కోరారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ జిల్లా సహాయ సంచాలకుడు కేసీ రెడ్డి, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకుడు జినుగు మరియన్న, సీపీఐ (ఎంఎల్)-న్యూడెమోక్రసీ, సీపీఎం, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్ అనుబంధ రైతుసంఘాల జిల్లా నాయకులు గుర్రం అచ్చయ్య, సామినేని రమేష్, పిన్ని కోటేశ్వరరావు, ఆళ్ల వెంకటరెడ్డి, యర్వకుంట్ల గోవర్ధన్, పరుచూరి శేషగిరి, మద్దినేని రమేష్, రామకోటయ్య, లక్ష్మయ్య, మూలా నాగిరెడ్డి, కన్నేటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకత కోసమే ఈ-బిడ్డింగ్
Published Sun, Aug 10 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM
Advertisement
Advertisement