సాక్షి ప్రతినిధి, కాకినాడ : హెలెన్ తుపాను విలయ తాండవానికి జిల్లా తల్లడిల్లింది. పచ్చని కోనసీమ కకావికలమైంది. ఎటుచూసినా హృదయ విదారకమైన దృశ్యాలే. కన్నకొడుకుల్లా పెంచుకున్న వేలాది కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. సిరులు కురిపించే బంగారుపంట నేలనంటింది. నిలువనీడనిచ్చే గూడు సుడిగాలికి ఎగిరిపోయింది. రైతులు, మత్స్యకారులు, నేతన్నలు, కూలీలు ఇలా ప్రతి ఒక్కరూ ప్రకృతి ప్రకోపానికి గురై గుండెలవిసేలా రోదిస్తున్నారు. జిల్లావాసులకు ఏ చిన్న కష్టమొచ్చినా ‘నేనున్నా’నంటూ అందరికంటే ముందుగా స్పందించే జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టెడు కష్టాల్లో ఉన్న బాధితులకు అండగా నిలిచి, ధైర్యం చెప్పేందుకు మంగళవారం జిల్లాకు వస్తున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి మధురపూడి చేరుకుని, రావులపాలెం మీదుగా వెళ్లి కోనసీమలో పర్యటించనున్నారు.
ఇదే రీతిలో గతంలో కూడా జిల్లా రైతులు, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందరికంటే ముందే స్పందించేవారు. మూడేళ్ల క్రితం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీవర్షాలతో చేతికొచ్చిన పంటలు కోల్పోయిన మెట్టరైతులకు అండగా నిలిచేందుకు జిల్లాలో పర్యటించారు. ఆ తర్వాత సాగుసమ్మె సమయంలోనూ వచ్చి అన్నదాతల్లో మనోధైర్యం నింపారు. వారి కోసం ఢిల్లీ వరకు పోరు సల్పారు. పోలవరం సాధన కోసం హరితయాత్ర ఈ జిల్లా నుంచే ప్రారంభించారు. ఆ తర్వాత భారీ అగ్నిప్రమాదంలో సర్వస్వం బుగ్గిపాలై కట్టుబట్టలతో మిగిలిన పల్లం గ్రామవాసులను కూడా ఇదే రీతిలో
పరామర్శించి అండగా నిలిచారు. పార్టీ తరపున ఆర్థికంగా ఆదుకున్నారు. కుట్రలు, కుతంత్రాలతో జననేత జైలుపాలైన సమయంలో జిల్లావాసులు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ జగన్ తరఫున జిల్లాలో పర్యటించి ప్రజలకు అండగా నిలిచారు. సొంతజిల్లా కడప తర్వాత మహానేత వైఎస్ మాదిరిగానే తూర్పు గోదావరి వాసులపై జగన్ ప్రత్యేకాభిమానం చూపిస్తున్నారు. ఈ కారణంగానే జిల్లా ప్రజలు ఆది నుంచి వైఎస్ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.
రూట్ పరిశీలించిన జిల్లా నేతలు
అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు, కొత్తపేట నియోజక వర్గాల్లో జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్న ప్రాంతాలను పార్టీ ముఖ్య నేతలు పరిశీలించారు. జగన్ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, పార్టీ వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ కర్రి పాపారాయుడు, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు తదితరులు పాల్గొన్నారు.
నేడు జననేత జగన్ రాక
Published Tue, Nov 26 2013 12:33 AM | Last Updated on Mon, Aug 27 2018 8:57 PM
Advertisement
Advertisement