=హెలెన్ తుపానుపై ముందస్తు చర్యలు
=కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
=తీర మండలాల్లోనే ఉండాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం
=పోర్టులో 2వ నంబర్ ప్రమాద సూచిక
విశాఖ రూరల్: హెలెన్ ముప్పుతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గత అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలకు సమాయత్తమవుతోంది. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి నుంచి టోల్‌ఫ్రీ నంబర్ 1800-4250-0002ను అందుబాటులో ఉంచారు. వాస్తవానికి ఈ తుపాను గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయానికి ఒంగోలు సమీపంలో తీరం దాటుతుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ ఇటీవల వచ్చిన అల్పపీడనం మాదిరిగానే దీని గమనం కూడా అంచనాలకు అందడం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
దీని ప్రభావం వల్ల కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. దీంతో ఓడరేవులో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ వెంటనే మండల ప్రత్యేకాధికారులకు, తహశీల్దార్లకు బుధవారం సాయంత్రం ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంతంలోని పది మండలాల్లో ప్రత్యేకాధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తహశీల్దార్లు కూడా అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత గ్రామాల్లో పరిస్థితులను గమనించాలన్నారు. రాత్రి నుంచే అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
మత్స్యకారులు వేటకు వెళ్లరాదు
తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని కలెక్టర్ సూచించా రు. అలలు ఎగసిపడతాయని, తీరంలో 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని తెలిపారు. వేటకు వెళ్లిన వారు కూడా వెనక్కి తిరిగి రావాలన్నారు. బోట్లను, వలలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని, ఎటువంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అప్రమత్తం
Published Thu, Nov 21 2013 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM
Advertisement