హెలెన్ పడగ
Published Fri, Nov 22 2013 4:05 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : హెలెన్ తుపాను ప్రభావంతో బుధవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. బుధవారం అర్ధరాత్రి 8 మండలాల్లో వర్షాలు పడగా గురువారం ఉదయం నుంచి 38 మండలాల్లోనూ వర్షాలు కురిశాయి. గురువారం ఉదయానికి 8 మండలాల్లో 3.3 సెంటీమీటర్ల వర్షం పడగా సాయంత్రానికి జిల్లాలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు నమోదైంది. పొలాకి, టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, శ్రీకాకుళం, భామిని, గార మండలాల్లో వర్షం ఎక్కువగా కురిసింది. శుక్రవారం కూడా వర్షాలు కొనసాగనుండటంతో వరి, అరటి, బొప్పాయి, మునగ, ఇతర పంట లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అంచనా.
మత్స్యకారులకు మళ్లీ కష్టాలు
సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించటంతో మత్స్యకారులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. గతంలో పై-లీన్ తుపాను తీవ్రతకు వలలు, పడవలు దెబ్బతినటంతో వారు పూర్తిగా నష్టపోయారు. అప్పటి నష్టానికి పరిహారం ఇప్పటికీ అందలేదు. ఇంతలోనే హెలెన్ తుపాను ముంచుకురావటంతో ఉపాధి లేక విల విల్లాడుతున్నారు.
Advertisement
Advertisement