కలెక్టరేట్, న్యూస్‌లైన్: హెలెన్ తుపాను జిల్లా రైతులను హడలెత్తించి వెళ్లిపోయినప్పటికీ.. మళ్లీ వర్షసూచనలు, కమ్ముకున్న మబ్బులు అన్నదాతలను వెంటాడుతున్నాయి. శనివారం జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురవడంతో మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలు, కల్లాల వద్ద ఉన్న ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి రైతులు నానాతంటాలు పడుతున్నారు. శనివారం నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలో 5.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.
ఆదివారం హెలెన్ ప్రభావం లేదని తెలుసుకుని ఊరట చెందిన రైతులు త్వరలో మరో తుపాను పొంచివుందనే వాతావరణ శాఖ హెచ్చరికలతో కలవరపడుతున్నారు. ఆకాశంలో మబ్బులు కమ్ముకునే ఉండడంతో రైతులు భయపడుతున్నారు. వాతావారణంలో మార్పుల నేపథ్యంలో మార్కెట్ యార్డులకు సెలవు ప్రకటించడంతో కొనుగోళ్లకు ఆటంకం ఏర్పడింది. జిల్లాలో ఆలస్యంగా నాటుకున్న వరిపంట 55 శాతం కోతలు కాలేదు. వర్ష సూచన నేపథ్యంలో రైతులు హడావుడిగా వరికోతలకు సిద్ధమవుతున్నారు. పొలాలు తడిగా ఉండడంతో హార్వెస్టర్లు తిరిగే పరిస్థితి లేదు. చైన్ హార్వెస్టర్లే వరికోతలకు అనువుగా ఉన్నా.. వాటికి కొరత ఏర్పడింది. కొందరు రైతులు కోసిన వరిని కల్లాల వద్దనే ఆరబెట్టుకుంటున్నారు. మరికొందరు మళ్లీ వర్షం పడితే చేతికొచ్చిన పంట దెబ్బతింటుందని నేరుగా మార్కెట్ యార్డులకు, కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ధాన్యంలో తేమ ఎక్కువగా ఉందంటూ వ్యాపారులు దగా చేస్తున్నారు. మొన్నటి వర్షాలతోనే నష్టాలు చవిచూసిన పత్తిరైతుకు మళ్లీ కష్టాలే మిగలనున్నాయి, పత్తి ఏరే క్రమంలో వర్షాలకు దెబ్బతింటే భారీ నష్టం వాటిల్లే ప్రమాదముంది.
39 మండలాల్లో వర్షం
శనివారం జిల్లావ్యాప్తంగా 39 మండలాల్లో వర్షం కురిసింది. ఆదివారం ఉదయం 8.30 గంటల సగటున 5.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మెట్‌పల్లి మండలంలో 22.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కరీంనగర్ మండలంలో 10.6, తిమ్మాపూర్ 9.8, బెజ్జంకి 10.6, కోహెడ 10.4, జగిత్యాల 15.4, మల్యాల 12.2, చందుర్తి 18.2, కొడిమ్యాల 10, మేడిపల్లి 10.4, కథలాపూర్ 10.4, గంభీరావుపేట 12, ముస్తాబాద్ 11, బోయినిపల్లి 12.6, సుల్తానాబాద్ 13.2, జూలపల్లి 12.2, ఎలిగేడు 15.6 మిల్లీమీటర్ల వర్షం కురసింది. మిగతా మండలంలో ఓ మోస్తరు జల్లులుపడ్డాయి. 18 మండలాల్లో వర్షం లేదు.
హడలెత్తించిన హెలెన్
Published Mon, Nov 25 2013 3:57 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM
Advertisement
Advertisement