సాక్షి, ఏలూరు : భీకర గాలులు వీచాయి. భారీ వృక్షాలను సైతం కూకటి వేళ్లతో పెకలించాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఇళ్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూలి పోయాయి. కల్లోల సాగరం ప్రజలను గజగజ వణికించింది. శుక్రవారం జిల్లాలో హెలెన్ తుపాను సృష్టిం చిన భీతావహ దృశ్యాలివి. వాయుగుండం పెను తుపానుగా మారి ‘పశ్చిమ’ వైపు దూసుకువచ్చి ప్రజాజీవనాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. తుపాను నష్టాలను చూసేందుకు కారులో బయలుదేరిన పెనుమంట్ర తహసిల్దార్ దంగేటి సత్యనారాయణ భట్లమగుటూరు వద్ద గాలుల ప్రభావానికి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు.
ఈ దుర్ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్‌కు చెందిన పోతినేని భాస్కరరావు (62)అనే రైతు పొలంలోకి వెళ్లి వస్తుండగా, చెట్టు విరిగి మీదపడటంతో మరణించాడు. నాలుగో బోట్లలో బయలుదేరిన కాకినాడ ప్రాంతానికి చెందిన 31 మంది మత్స్యకారులు దారితప్పి నరసాపురం మండలం చినమైనివానిలంక వద్ద నడిసముద్రంలో చిక్కుకుపోయారు. రాత్రివరకూ వారిని అధికారులు ఒడ్డుకు తీసుకురాలేదు.
అనూహ్య అలజడి
ఎన్నడూ లేనివిధంగా తొలిసారిగా పశ్చిమ తీరంలోని నరసాపురం సమీపంలో వాయుగుండం కేంద్రీకృతం కావడంతో తీర గ్రామాల్లో అలజడి రేగింది. శుక్రవారం వేకువజాము నుంచి మొగల్తూరు, నరసాపురం మండలాలతో పాటు భీమవరం, యలమంచిలి, కాళ్ల, ఆచంట, వీరవాసరం, పాలకొల్లు తదితర మండలాల్లో 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. 8మండలాల్లో 37 గ్రామాలు తుపాను ప్రభావానికి గురయ్యాయి. ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. ప్రధాన రహదారులపై భారీ వృక్షాలు నేలకూలడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. శుక్రవారం మధ్యాహ్నం 3-4 గంటల మధ్య మచిలీపట్నానికి 10 కిలోమీటర్ల దూరంలో తుపాను తీరం దాటిందని తెలుసుకుని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 2004లో సంభవించిన సునామి ధాటికి చినమైనవానిలంక తీరప్రాంతంలో ఆరుగురు మృతిచెందగా, అప్పట్లో తీరప్రాంత వాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తర్వాత 2011లో వచ్చిన థానే తుపాను అలజడి సృష్టించి తీరప్రాంతానికి కోత మిగిల్చింది. రెండేళ్ల తర్వాత తిరిగి హెలెన్ తుపాను తీర ప్రాంతవాసులను సునామీ స్థాయిలో వణికించింది.
అపార నష్టం
హెలెన్ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 223 ఇళ్లు దెబ్బతిన్నాయి. వాటిలో 14 ఇళ్లు పూర్తిగా కుప్పకూలాయి. మూడిళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 80 కచ్చా ఇళ్లు, 35 గుడిసెలు, మరో 80 ఆవాసాలు చెల్లాచెదురయ్యాయి. వందలాది కొబ్బరి చెట్లు, తాటిచెట్లతోపాటు 62 భారీ వృక్షాలు పూర్తిగా నేలకొరిగాయి. వేలాది చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. 2.25 లక్షల ఎకరాల్లో వరి చేలు నీట మునిగాయి. పనలు, కుప్పలపై ఉన్న 25 వేల ఎకరాల్లో పంట తడిసి ముద్దయ్యింది. 15 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 4,908 మందిని తరలించారు. 40 విపత్తు నివారణ బృందాలు రంగంలోకి దికి సహాయక చర్యలు ప్రారంభించారుు.
పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ భోజనం, 12,730వాటర్ ప్యాకెట్లతో తాగునీటి సదుపాయం కల్పించారు. 71 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి గర్భిణులకు, తుపాను బాధితులకు సేవలు అందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 250 విద్యుత్ స్తంభాలు పడిపోడవంతో 14 కిలోమీటర్ల మేర లైన్లు తెగిపోయాయి. శుక్రవారం రాత్రి నుంచి 130 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ల నుంచి సరఫరా నిలిపివేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఒక్కొక్కటిగా సరఫరా పునరుద్ధరించడం ప్రారంభించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తీర గ్రామాల్లో అంధకారం అలముకుంది. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ మధ్యాహ్నం వరకూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఏటిగట్లు కోతకు గురయ్యాయి. రోడ్లు ఛిద్రమయ్యాయి.