ఖమ్మం, న్యూస్‌లైన్: హెలెన్ తుపాను రూపంలో మరో ముప్పు పొంచి ఉండడంతో రైతులలో ఆందోళన నెలకొంది. నష్టాలమీద నష్టాలను చవిచూస్తున్న రైతులు ఈ గండం ఎలా గట్టెక్కుతుందో అని కలవరపడుతున్నారు. శుక్ర, శని వారాల్లో జిల్లాలో మేఘాలు కమ్ముకు రావడం, చిరుజల్లులు పడటంతో పంటల పరిస్థితిపై తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
ఎరువులు, విత్తనాల ధరలు పెరగడంతో అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్న అన్నదాతపై ప్రకృతి కూడా పగపడుతోంది. గత సంవత్సరం నీలం తుపానుతో పండిన పంటలు నీటమునిగాయి. ఇటీవల వచ్చిన పైలీన్ తుపానుతో పత్తి, వరి, మొక్కజొన్న, వేరుశన, మిర్చి పంటలు నాశనమయ్యాయి. ఆ గాయం నుంచి కొలుకునే ప్రయత్నంలో రైతులు ఉన్న పంటలను కంటికి రెప్పలా కాపాడు కున్నారు. అయితే రెండు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం జిల్లాపై కూడా పడడంతో జల్లులు కురుస్తున్నాయి. దీంతో ఉన్న కొద్దిపాటి పంటలు కూడా వర్షార్పణం అవుతాయా..అనే భయం వెంటాడుతోంది. నష్టం జరగకముందే వరి కోతలు, పత్తితీత కోసం రైతులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
చేతికొచ్చిన పంట చెయ్యిజారి పోతుందా..?
ఈ సంవత్సరం ఖరీఫ్‌లో 1.34లక్షల హెక్టార్లలో వరి, 1.68హెక్టార్లలో పత్తి, 23వేల హెక్టార్లలో మొక్కజొన్న, 19వేల హెక్టార్లలో మిర్చి పంటలతోపాటు కూరగాయలు,, ఇతర పంటలను సాగుచేశారు. అయితే ఏపుగా పెరిగిన పత్తి మొదటి విడత తీసేదశకు రాగా గత నెల మొదటి వారంలో తుపాను మూలంగా లక్షల ఎకరాల్లో పత్తి తడిసి పోయింది. తెల్లబంగారం నల్లబారి పోయింది. పింజలు మొలకెత్తాయి. కాయలు రాలిపోయాయి.
అదేవిధంగా వరి నేలవాలింది. మిర్చి పంటకు ఊటబారి పోయాయి. దీనికి తోడు తుపాను అనంతరం వైరస్, పేనుబంక, అగ్గితెగులు, వేరు కుళ్లు తుగులు మొదలైనవి ఆశించాయి. వీటి నివారణకు నానా ఇబ్బంది పడ్డారు. నీట మునుగగా ఉన్న పంటల్లో పత్తి రెండో విడత ఏరే దశకు వచ్చింది. వరి చేలు కోతలు మొదలయ్యాయి. మిర్చి కాపు దశకు వచ్చింది. నష్టం జరిగిన పంటలకు ప్రభుత్వం పరిహారం ఎప్పుడు ఇస్తుందో అర్థం కాక ఉన్న పంటలతో చేసిన అప్పులకు మిత్తీలైనా కట్టవచ్చని భావించారు. ఇటువంటి తరుణంలో మళ్లీ వర్షాల సంకేతాలు రావడం.. వాతావరణం చల్లబడి, ఆకాశంలో మబ్బులు రావడంలో అన్నదాత గుబులు చెందుతున్నాడు. పంటలు చేతికి వస్తాయో రావో.. అని భయం మొదలైంది. హుటా హుటిన పత్తిని ఏరించడం, వరి పనలను దగ్గరకు వేసేపనిలో మునిగిపోయాడు.
మరోగండం....రైతును వణికిస్తున్న ‘హెలెన్’
Published Sun, Nov 24 2013 7:11 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement