తెనాలిటౌన్, న్యూస్‌లైన్: తుపానులు, తెగుళ్ల బారి నుంచి తప్పించుకున్న వరి రైతులు మార్కెట్‌లో ధాన్యానికి ధర లేకపోవడంతో దిగాలు చెందుతున్నారు. ఖరీఫ్ ధాన్యం దిగుబడులు ఆశాజనకంగా లేక రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. ఫ్రభుత్వం 75 కిలోల ధాన్యం బస్తాకు ప్రకటించిన మద్దుతు ధర రూ.1150లు కూడా దక్కేలా లేదు. ఖరీఫ్ సీజన్‌లో సంభవించిన హెలెన్ తుపాను దాటికి నేలకొరిగి, నీట మునిగిన వరి పంటను ఒబ్బిడి చేసుకున్న రైతులు యంత్రాల సాయంతో నూర్పిళ్లు చేశారు. తీరా ధాన్యం ఇంటికి చేరేసరికి ధర లేకపోవడంతో నిరుత్సాహపడుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్‌లో ధాన్యం బస్తా రూ.1275-1300 మించి ధర పలకడం లేదు. అయితే ధాన్యం తడిసిందనే సాకు చూపుతూ వ్యాపారులు రైతులతో బేరమాడుతున్నారు. రూ.900-1000కి మించి ధర చెల్లించలేమని చెబుతున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని 5.71 లక్షల ఎకరాల్లో అధిక సంఖ్యలో రైతులు బీపీటీ 5204 రకం వరి సాగు చేశారు. గుంటూరు జిల్లాలో 4.91 లక్షల ఎకరాలు, ప్రకాశం జిల్లా చీరాల సబ్ డివిజన్ పరిధిలో 80 వేల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. ఇక తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్‌లో 93,750 ఎకరాల్లో వరి సాగు చేశారు. గత ఏడాది నవంబర్ 21,22 తేదీల్లో వచ్చిన హెలెన్ తుపాను ధాటికి డివిజన్‌లో 50 వేల ఎకరాలు, జిల్లాలో లక్షకు పైగా ఎకరాల్లో వరి పంట దెబ్బతింది.
పంట దెబ్బతినడంతో తడిసిని ధాన్యం కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. నూర్పిళ్ల అనంతరం ఎకరాకు 20-25 బస్తాలకు మించి దిగుబడి రావటం లేదని రైతులు చెబుతున్నారు. కొల్లిపరలో నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేసిన రైతు చెంచాల రామిరెడ్డి ఎకరాకు కేవలం 20 బస్తాలే చేతికొచ్చాయని చెప్పారు. 20 బస్తాల చొప్పున కౌలుకు తీసుకున్న రైతు వుయ్యూరు వేమారెడ్డి తన పొలంలో వచ్చిన దిగుబడి కౌలు చెల్లించేందుకు సరిపోయిందన్నారు. చాలా మంది రైతులది ఇదే పరిస్థితి. తుపాను కారణంగా సగటున ఎకరాకు 7-8 బస్తాల ధాన్యాన్ని కోల్పోయారు.
మద్దతు ధర కరువు.. చేతికొచ్చిన ధాన్యానికి మార్కెట్లో మద్దతు ధర కరువైంది. 75 కిలోల బస్తాకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.1150 వుం డగా, తడిసి నాణ్యత తగ్గిందన్న సాకుతో రూ.900-1000 లకు వ్యాపారులు అడుగుతున్నారు. ఇంటికొచ్చిన ధాన్యాన్ని అమ్మితే కౌల ు చెల్లింపులకే సరిపోతోంది. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు అలాగే ఉండిపోతున్నాయి. సొంత భూమి కలిగిన రైతులకు వచ్చిన దిగుబడులు పెట్టుబడి ఖర్చులకు సరిపోతుందని చెబుతున్నారు. పంట తడిసిన కారణంగా వరిగడ్డి దెబ్బతిని అటు పశుగ్రాసానికీ ఇబ్బంది ఏర్పడే ఆస్కారముంది.
కౌలు కూడా రాలేదు...
మూడు ఎకరాలు కౌలుకు చేశాను. దోమ పోటు వల్ల కొంత, వర్షం వల్ల మరి కొంతపంట దెబ్బతింది. ఎకరాకు 20 బస్తాలు మాత్రమే చేతికి వచ్చాయి. 21 బస్తాలకు కౌలుకు తీసుకున్నా. - ఔతు బసివిరెడ్డి, కౌలు రైతు, కొల్లిపర
మద్ధతు ధర ఇవ్వాలి
రెండు ఎకరాలు కౌలుకు సాగు చేశాను. ఎకరానికి 25 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. గత ఏడాది ఎకరానికి 38 బస్తాలు దిగు బడులు వచ్చాయి. ఈ ఏడాది ఖర్చులు విపరీతంగా పెరిగాయి. రైతును ఆదుకోవాలంటే ప్రభుత్వం బస్తాకు రూ.1800లు మద్దతు ధర ప్రకటించాలి. - ఉప్పాల పెద్ద శివయ్య, కౌలు రైతు, కొల్లిపర
అన్నదాతకు ‘మద్దతు’ ఏదీ?
Published Wed, Jan 8 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM
Advertisement
Advertisement