పైలీన్ సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోక ముందే జిల్లా రైతాంగాన్ని హెలెన్ తుపాను భారీగా దెబ్బతీసింది.
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: పైలీన్ సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోక ముందే జిల్లా రైతాంగాన్ని హెలెన్ తుపాను భారీగా దెబ్బతీసింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు కురిసిన వర్షం పత్తి, వరి, మొక్కజొన్నతో పాటు ఉల్లి పంటలకు భారీ నష్టాన్ని కలిగించింది. సుమారు 20 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లి ఉంటుందని ప్రాథమిక అంచనా. సోమవారంలోగా పంట నష్టంపై ప్రాథమికంగా వివరాలు సేకరించేందుకు వ్యవసాయ, రెవెన్యూ విభాగాలు సన్నద్ధమవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో జిల్లాలో 2.71 సెం.మీ వర్ష పాతం నమోదైంది.
అత్యధికంగా సదాశివపేట మండలంలో 14 సెం.మీ. వర్షం కురిసింది. పొరుగునే ఉన్న కర్ణాటకతో పాటు రంగారెడ్డి జిల్లాలో అధిక వర్షం కురవడంతో సంగారెడ్డి, నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, పంటలు నీట మునిగాయి. నారాయణఖేడ్ మండలం హన్మం తరావుపేట మత్తడి వాగు పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. లింగాపూర్‌లో పెద్ద చెరువు అలుగుతో సంజీవన్‌రావుపేట, పోతన్‌పల్లి, ర్యాకల్, తుర్కపల్లి గ్రామాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి.
మనూరు మండలం కమలాపూర్ చెరువు కట్ట తెగటంతో పంట పొలాల్లోని వరి నీటి పాలైంది. కంగ్టి మండలం వాసర్ ఊరవాగు, వంగ్దల్, రాంతీర్థ్(నల్లవాగు)లు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. రేగోడ్‌లో చెరువు వాగుకట్ట తెగటంతో భారీగా పంటలు దెబ్బతిన్నాయి, రేగోడ్-చౌదరిపల్లి కల్వర్టు పైనుంచి నీరు ప్రవహించడంతో ప్రజల రాకపోకలు నిలిచిపోయా యి. కొండాపూర్ మండలం హరిదాస్‌పూర్ శివారులోని వంతెన పొంగిపొర్లడంతో చుట్టుపక్కల పొలాలలోని పంటలు దెబ్బతిన్నాయి.
వేల ఎకరాల్లో పంటల నష్టం
హెలెన్ తుపానుతో నారాయణఖేడ్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. సదాశివపేట మండలంలో సుమారు ఏడు వేల ఎకరాల్లో పత్తి, వరి, కొండాపూర్ మండలంలో సుమారు రెండు వేల ఎకరాల్లో వరి ఇతర పంటలు దెబ్బతిన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వర్షం కారణంగా మనూరు మండలంలో సుమారు ఆరు వేల ఎకరాల్లో వరి, రెండు వేల ఎకరాల్లో కంది, 250 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు అంచనా. కంగ్టిలో సుమారు 15 వేల ఎకరాలు, కల్హేర్‌లో 500 ఎకరాలు, నారాయణఖేడ్‌లో సుమారు వెయ్యి ఎకరాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు. మనూరు మండలం కమలాపూర్ వాగు తెగటంతో 250 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. రేగోడ్‌లోని చెరువుకట్ట తెగటంతో 400 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. మండలంలో వర్షం కారణంగా 400 ఎకరాల్లో వరి, 150 ఎకరాల్లో ఉల్లి పంటకు నష్టం వాటిల్లింది.