సాక్షి ప్రతినిధి సంగారెడ్డి/చేగుంట: విచక్షణ కోల్పోయిన ఓ పోలీసు అధికారి రైతులను చావబాదాడు. రక్తం క ళ్లచూశాడు. కరెంటు లేక పంటలు ఎండి పోతున్నాయని నిరసన తెలుపుతున్న అన్నదాతలపై లాఠీ ఝుళిపించాడు. చివరకు అదే రైతుల చేతిలో చావు దెబ్బలు తిని పోలీసు శాఖ పరువు తీశాడు. విద్యుత్ కోతలను నిరసిస్తూ సోమవారం రైతులు చేగుంట మండలంలోని నార్సింగి వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉదయం 8 గంటల నుంచే రాస్తారోకో నిర్వహించారు. దాదాపు మధ్యాహ్నం 12 గంటల వరకు రాస్తారోకో కొనసాగింది.
ఈ క్రమంలో కొందరు రైతులు వాహనాలు వెళ్లనిచ్చేది లేదని రోడ్డుపై బైఠాయించారు. టైర్లు కాల్చి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి, విద్యుత్తు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి పర్యవేక్షించారు. స్నేహపూర్వక వాతావరణంలోనే రైతుల దీక్ష విరమింపచేయడానికి డీఎస్పీ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సుమారు నాలుగు గంటల పాటు కొనసాగిన ఈ ఆందోళన అనంతరం కొంతమంది రైతులు తమ తమ ఊళ్లకు వెళ్లిపోయారు.
ఇదే సమయంలో అక్కడికి వచ్చిన రామాయంపేట సీఐ గంగాధర్ రైతులను దూషిస్తూ వారిని బలవంతంగా నెట్టివేసే ప్రయత్నం చేశారు. ఆయన ప్రయత్నాన్ని రైతులంతా మూకుమ్మడిగా అడ్డుకున్నారు. పరిస్థితి అంచనా వేసినా డీఎస్పీ ‘వద్దు..వద్దు’ అంటూ సీఐని ఆదేశించినా ఆయన వినిపించుకోలేదని, సీఐ గంగాధర్, ఆయన వెంట వచ్చిన ప్రత్యేక పోలీసులు రైతులను తరిమి తరిమి కొట్టారని ప్రత్యక్ష సాక్షుల కథనం. సీఐ గంగాధర్ రైతులపై లాఠీచార్జి చేస్తూ గుంపును చెదరగొట్టారు. లాఠీ దెబ్బలకు తాళలేక రైతులు చెల్లాచెదురై పరుగులు పెట్టారు.
పరిగెత్తుతున్న రైతులపై ప్రత్యేక పోలీసు బలగాలు రాళ్లు విసురుతుంటే సీఐ గంగాధర్ రైతుల వెంటపడి దాడి చేసి కొట్టారు. దాదాపు అర కిలో మీటర్ వరకు రైతులను ఉరికించాడు. దెబ్బలకు తాళ లేక కొందరు రైతులు చేతులెత్తి మొక్కినా కనికరం చూపకుండా చావబాదాడు. ఫలితంగా ఓ రైతు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. అయినా గంగాధర్ లాఠీచార్జీ ఆపకపోవటంతో రైతులు ఎదురుతిరిగారు. దీంతో సీఐ పరుగు లంకించుకున్నాడు. ఆయన వెంటబడి మరీ రైతులు తరిమికొట్టారు.. సీఐ కనిపించిన వాహనాల్లో ఎక్కేందుకు ప్రయత్నించినా రైతులు ఆయనను వదల్లేదు. అటు వైపుగా వచ్చిన జీపులో వెళ్లి కూర్చోగా జీపు అద్దాలను ధ్వంసం చేశారు.
చివరకు ఓ ప్రయాణికుడి సమయస్ఫూర్తితో సీఐ ప్రాణాలతో బయటపడ్డారు. ఏ డీఎస్పీ అయితే వద్దని వారించినా వినకుండా రైతుల మీద దాడికి దిగాడో... చివరకు కిలో మీటర్ దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి అదే డీఎస్పీ శరణుజొచ్చాడు. కానీ అప్పటికే రైతుల ఆగ్రహాన్ని గంగాధర్ చవిచూశాడు. ఇదిలా ఉండగా.. పలు ప్రజా సంఘాలతోపాటు యువజన సంఘాలు, రైతు సంఘాల నాయకులు సీఐ దాడిచేసిన తీరును ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై లాఠీచార్జి చేసిన సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
చేగుంటలో ఖాకీ ఓవర్‌యాక్షన్
Published Mon, Aug 4 2014 11:56 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement