సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ఎవుసం జేసి ఫాయిద లేదే.. అప్పులోళ్లు వచ్చి ఇంటి ముందరగూసునే.. ఇజ్జత్ ఖరాబైపోయిందే.. పాణం పోయినా బాధలేదు, మానంబోయే కాడికొచ్చే’ ఆత్మహత్యకు ముందు మైలారం గ్రామ రైతు రాచబోయిన బాలాగౌడ్ తన భార్యతో వ్యక్తం చేసిన ఆవేదన ఇది.. జిల్లాలో రైతులందరి దుస్థితి సుమారు ఇలాగే ఉంది.
బువ్వపెట్టే మెతుకు దుర్గం.. శవాల దిబ్బ అవుతోంది. మట్టినే నమ్ముకున్న అన్నదాతకు, భూమి తల్లికి మధ్య రుణం తీరిపోతోంది. 60 ఏళ్ల కల తీరినా కర్షకునిలో కలవరమే.. పంట పోయి, పరువుపోయి బతకలేక రైతులు బలవన్మరణం పొందుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు.. తర్వాత కూడా జిల్లాలో రైతు మరణాల రేటు ఒకే రకంగా సాగుతోంది. సగటున మూడు రోజులకు ఒక రైతు బలిపీఠం ఎక్కుతున్నారు. గత ఏడాది 113 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈ మూడు నెలల్లో 21 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కేసీఆర్ సర్కారు రైతుల రుణమాఫీ రద్దు చేసినా... రైతన్నను అంతకంటే బలమైన సమస్య ఏదో మానసికంగా వేధిస్తోంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లోనే ఏడు మంది బలవన్మరణం పొందారు. తాజాగా అదే నియోజకవర్గం వర్గల్ మండలం అవుసులోనుపల్లిలో మోచె ఆంజనేయులు(44) అనే రైతు మంగళవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ముఖ్యమంత్రి ముందుకొచ్చినా...
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల రుణమాఫీ చేయడానికి ముందుకొచ్చినా.. ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే
ఉంది. ఐదేళ్ల నుంచి వరుసగా కరువు.. రైతును వెంటాడుతోంది. పంటల పెట్టుబడి కోసం దొరికిన చోటల్లా అప్పులు చేశారు.. పైరు పెరిగి పంట ఇంటికి చేరలేదు కానీ వడ్డీలు పెరిగి అప్పులోళ్లు ఇంటికొచ్చి కూర్చుంటున్నారు. అటు పంటపోయి, ఇటు మాట పోయి నలుగురిలో తలెత్తుకుని తిరగలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు శూన్యమనే చెప్పాలి. సర్కారు దానిపై దృష్టి సారించాలని రైతు సంఘాలు అంటున్నాయి. రైతన్నలను మానసికంగా బలోపేతం చేసి పంటను ఆదుకునే ప్రయత్నం జరగాలని వారు చెబుతున్నారు. ప్రయివేటు అప్పులపై కూడా పాలకులే భరోసా ఇవ్వాలంటున్నారు.
గజ్వేల్ గొల్లుమంటోంది...
గజ్వేల్ నియోజకవర్గంలోనూ ఆత్మహత్యల తీరు ఆందోళన కలిగిస్తోంది. జూలై 13న కొండపాక మండలం మంగోల్ గ్రామంలో చిట్యాల రామలింగారెడ్డి(69), 4న కొడకండ్లలో కొడిశెల రవి(35), అదే గ్రామంలో జూన్ 24న ఫిరంగి ఎల్లయ్య(50), జూన్ 14న ముట్రాజ్‌పల్లిలో చీర్ల యాదయ్య(50), 17న జగదేవ్‌పూర్ మండలం రాయవరంలో ముత్యాలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు, ఆగస్టు 20న వర్గల్ మండలం మైలారం గ్రామంలో రాబోయిన బాలాగౌడ్, తాజాగా మంగళవారం రాత్రి అదే మండలం అవుసులోనుపల్లిలో మోచె ఆంజనేయులు(44) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారు.
గడియ గడియకు గండమే...
ఆకాశాన్నంటిన ఎరువులు, విత్తనాలు, రసాయన మందుల ధరలతో పెట్టుబడి వ్యయం ఎన్నో రెట్లు పెరిగింది. చిన్న సన్నకారు, కౌలు రైతులు అప్పులు చేస్తే కాని వ్యవసాయం చేయలేని దుస్థితి నెలకొంది. ప్రభుత్వరంగ బ్యాంకులు మొండి చెయ్యి చూపిస్తుండడంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రెక్కలు ముక్కలు చేసి పంటలు వేస్తే తీరా వర్షాభావం, కరువు కాటకాలు, అకాల వర్షాలు, చీడ పీడల దాడులు, కరెంట్ కోతలు, నకిలీ విత్తనాలు చావుదెబ్బ కొడుతున్నాయి.
వడ్డీలు, చక్రవడ్డీల సుడిగుండ్రంలో చిక్కుకుని, వడ్డీ వ్యాపారుల వేధింపులను తట్టుకోలేక, మరోవైపు కుటుంబాన్ని పోషించలేని నిస్సహాయ స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతులందరూ 25 నుంచి 45 ఏళ్ల వయస్సు కలిగినవారే కావడంతో వారిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 2004 జూన్ 1న జీవో 421 జారీ చేసింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.లక్ష పరిహారంతో పాటు వన్ టైమ్ సెటిల్మెంట్ కింద అప్పులు తీర్చడానికి రూ.50 వేలను ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ఈ జీవో కింద చెల్లించాల్సి ఉంది.
ఆర్డీఓ/సబ్ కలెక్టర్ చైర్మన్‌గా, డీఎస్పీ, ఏడీఏలు సభ్యులుగా ఉండే కమిటీ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపి నిర్ధారించిన తర్వాత ఈ పరిహారం మంజూరుచేయాలి. మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉండగా, ఏళ్లు గడుస్తున్నా విచారణలు మాత్రం కొలిక్కి రావడం లేదు. ఈలోగా ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే రైతన్న అకస్మాత్తుగా తనువు చాలిస్తే కుటుంబ భారాన్ని మోయలేక ఆ ఇంటి ఇల్లాలు, వృద్ధ తల్లిదండ్రులు అష్టకష్టాలు పడుతున్నారు.
రైతన్నను వీడని కష్టాలు
Published Wed, Sep 3 2014 11:29 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement