సంగారెడ్డి టౌన్ పోలీస్‌స్టేషన్ వద్ద విలపిస్తున్న మృతుని బంధువులు (ఇన్‌సెట్‌లో నిరంజన్)
సాక్షి, సంగారెడ్డి: భార్య తనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా అత్తింటివారు వేధిస్తున్నారనే మనస్థాపంతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. తమకు న్యాయం చేయాలని ఆటో డ్రైవర్ బంధువులు, కుటుంబీకులు పోలీస్‌స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఆందోళనకు దిగారు. సంగారెడ్డి టౌన్ సీఐ వెంకటేశ్ తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
తాగుడుకు బానిసై..
జిల్లా కేంద్రంలోని నారాయణరెడ్డి కాలనీలో చాకలి నిరంజన్ (26) నివాసం ఉంటున్నాడు. ఇతను ఆరేళ్ల క్రితం అనురాధ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అప్పటికే పెళ్లయి ఆమెకు ఇద్దరు పిల్లలు గౌరీ, హనీలు ఉన్నారు. కొన్ని కారణాల వల్ల భర్తను వదిలేయడంతో ఆమెకు పరిచయం ఏర్పడిన నిరంజన్‌తోనే సహజీవనం చేస్తున్నది. వీరికి అమరేశ్వర్ మరో సంతానం ఉంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఆగ్రహించడంతో ఇతను సంగారెడ్డిలోనే వేరు కాపురం పెట్టి అనురాధతోనే ఆరేళ్లుగా కాపురం చేస్తున్నాడు. ఇతను ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆటో నడపడంతో వచ్చిన డబ్బులు చాలకపోవడం, సంసారంలో ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో కొంతకాలంగా తాగుడుకు బానిసయ్యాడు.
పోలీసుల కౌన్సెలింగ్..
ఇతనిపై గతంలో దొంగతనం కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే భార్య అనురాధను వేధిస్తుండడంతో విసిగి చెందిన ఆమె డయల్ యువర్ 100కు ఈనెల 18న ఫోన్‌చేసింది. పోలీసులు నిరంజన్‌ను, అనురాధను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనురాధ తల్లి పుణ్యవతి, బావమరిది చందులు తరచూ ఇబ్బందులకు గురిచేస్తుండడం కూడా నిరంజన్‌ను బాధించాయి. దీంతో పాటుగా పోలీస్‌స్టేషన్‌లో నిరంజన్‌కు ఏఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇవ్వడం మనస్థాపానికి గురిచేసింది. ఇది అవమానంగా భావించిన నిరంజన్ గురువారం రాత్రి ఇంట్లోనే ఫ్యాన్ బిగించే ఉక్కుకు (రాడ్‌కు) చున్నీతో ఉరివేసుకున్నాడు. అప్పటికే అనురాధ పిల్లలను తీసుకొని జిల్లా కేంద్రంలోనే ఉంటున్న పుట్టింటికి వెళ్లింది. ఉదయం లేవకపోవడంతో ఇరుగుపొరుగు వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెళ్లి చూసేసరికి మృతి చెంది ఉండడం గమనించారు. నిరంజన్ మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టు నిర్వహించారు.
బంధువుల ఆందోళన..
నిరంజన్ మృతి వార్త తెలుసుకున్న కుటుంబీకులు, బంధువులు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రానికి తరలివచ్చారు. నిరంజన్ మృతి అనుమానాస్పదంగా ఉందని ఆరోపిస్తూ వారు స్థానిక టౌన్ పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. మాకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు. మృతుడు నిరంజన్ సోదరి సోని, తల్లి స్వరూప, బావ శేఖర్, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు విలేకరులతో మాట్లాడుతూ..నిరంజన్ మృతి అనుమానాస్పదంగా ఉందని తెలిపారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
కౌన్సెలింగ్ ఇచ్చిన మాట వాస్తవమే..
ఈనెల 18న నిరంజన్ భార్య అనురాధ డయల్ 100కు కాల్ చేయడంతో అతన్ని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చిన మాట వాస్తవమే. ఆటో నడుపుతూ మద్యానికి బానిసయ్యాడు. గతంలో ఇతనిపై దొంగతనం కేసులు ఉన్నాయి. భార్యను వేధించడంతో ముగ్గురు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిరంజన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం.
– వెంకటేశ్, టౌన్ సీఐ
Comments
Please login to add a commentAdd a comment