dial 100
-
మొన్న పూజిత.. నేడు అమీక్ష
సాక్షి, హైదరాబాద్: అన్నంలో పురుగులు వస్తున్నాయని ఇటీవల 4వ తరగతి విద్యార్థిని పూజిత నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేయగా.. తాజాగా 2వ తరగతి చదువుతున్న మరో చిన్నారి ఇంటి పక్కన గొడవ జరుగుతుంది, వచ్చి ఆపాలని రాత్రి 11 గంటలకు డయల్ 100కు కాల్ చేసిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. ప్రశాంతిహిల్స్ రోడ్ నం–6కు చెందిన అమీక్ష (7) టీచర్స్‌కాలనీలోని భారతి స్కూల్లో 2వ తరగతి చదువుతోంది. ఆదివారం రాత్రి ఇంటి పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద ఇద్దరి కూలీలు గొడవ పడుతున్నారు. గొడవ జరుగుతున్నట్లు గ్రహించిన చిన్నారి అమీక్ష రాత్రి 11 గంటలకు తండ్రి సెల్‌ఫోన్ తీసుకొని డయల్ 100కు కాల్ చేసి ఇక్కడ గొడవ జరుగుతుంది.. వెంటనే వచ్చి గొడవను ఆపాల్సిందిగా కోరింది. బాలిక ఫిర్యాదు చేయడంతో మీర్‌పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గొడవ పడుతున్న ఇద్దరు కూలీలకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు. తొందరగా స్పందించినందుకు థ్యాంక్యూ అంకుల్ అని చిన్నారి చెప్పినట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. అమీక్షను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ ఏ గొడవ జరిగినా, ఆపద వచ్చినా డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు. -
భద్రతకు గట్టి భరోసా
సాక్షి, అమరావతి: ఆపదలో ఆపన్న హస్తం అందించే ‘డయల్ 100’ వ్యవస్థను పోలీసు శాఖ మరింత బలోపేతం చేసి ప్రజల భద్రతకు గట్టి భరోసానిస్తోంది. అత్యవసర సేవలు అందించే ఈ వ్యవస్థను సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించి మెరుగ్గా తీర్చిదిద్దింది. అందుకోసం డయల్ 100, డయల్ 112 వ్యవస్థను సమ్మిళితం చేస్తోంది. రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి మరిన్ని అత్యవసర సేవలను డయల్ 100 పరిధిలోకి తెచ్చేలా కసరత్తు చేస్తోంది. 20 జిల్లాల్లో ఇప్పటికే ఏకీకృత వ్యవస్థ అత్యవసర సర్వీసుల కోసం కేంద్ర ప్రభుత్వం డయల్ 112 వ్యవస్థను తెచ్చింది. చాలా రాష్ట్రాలు చాలా ఏళ్లుగా సొంతంగా నిర్వహిస్తున్న అత్యవసర సేవల వ్యవస్థలను దాదాపుగా తొలగించాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అత్యవసర సేవలు మరింత సమర్థంగా అందించేందుకు ఈ రెండు వ్యవస్థలను అందుబాటులో ఉంచింది. అయితే డయల్ 100, డయల్ 112 కోసం రెండు వేర్వేరు కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు కాకుండా ఏకీకృత వ్యవస్థను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఈ రెండు వ్యవస్థలను సమ్మిళితం చేశారు. వైఎస్సార్, అన్నమయ్య, పల్నాడు, బాపట్ల, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వీటిని ఇంకా అనుసంధానించాల్సి ఉంది. సత్ఫలితాలనిస్తున్న సమ్మిళితం డయల్ 100, డయల్ 112ను అనుసంధానించడం సత్ఫలితాలనిస్తోంది. డయల్ 112 కాల్ సెంటర్‌కు 2020లో 7.55 లక్షల కాల్స్ రాగా వాటిలో చర్యలు తీసుకోదగ్గవి 6,162 ఉన్నాయి. వీటిపై పోలీసులు దర్యాప్తు జరిపి 196 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక 2021లో 9.67 లక్షల కాల్స్ రాగా చర్యలు తీసుకోదగ్గవి 10,292 ఉన్నాయి. వాటి ఆధారంగా 242 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. డయల్ 100కి సగటున రోజుకు ఐదు వేల కాల్స్ వచ్చాయి. 2022లో డయల్ 100, డయల్ 112 సమ్మిళిత ప్రక్రియ ప్రారంభమయ్యాక అత్యవసర సేవలు గణనీయంగా మెరుగయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 17.82 లక్షల కాల్స్ రాగా వాటిలో చర్యలు తీసుకోదగ్గ కాల్స్ 85,143 ఉన్నాయి. వీటిని బట్టి ఇప్పటివరకు 2,518 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం విశేషం. ప్రజల అత్యవసర కాల్స్‌పై పోలీసు శాఖ సత్వరం స్పందిస్తూ వేగంగా చర్యలు తీసుకుంటోందనడానికి ఈ గణాంకాలే తార్కాణం. రాష్ట్ర కమాండ్ కంట్రోల్ నుంచే పర్యవేక్షణ తాజాగా డయల్ 100ను రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానించారు. దీనికి వచ్చే కాల్ నేరుగా జిల్లా కేంద్రంలోని కార్యాలయంతోపాటు రాష్ట్ర కమాండ్ కంట్రోల్‌కు చేరుతుంది. కాల్స్‌పై సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని సిబ్బంది ఎంత త్వరగా స్పందించారో రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తారు. దీంతో పోలీసు వ్యవస్థలో మరింత జవాబుదారీతనం పెరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందనున్నాయి. లొకేషన్ ట్రాకింగ్ వ్యవస్థ.. డయల్ 100లో కొత్తగా లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్‌ను పోలీసు శాఖ ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు ఎవరైనా అత్యవసర సర్వీసుకు కాల్ చేస్తే తాము ఎక్కడ ఉన్నారో చెప్పాల్సి వస్తోంది. గుర్తు తెలియని ప్రదేశాల్లో ఆపదలో చిక్కుకున్న వారికి ఇది సమస్యాత్మకంగా మారింది. పూర్తి వివరాలు వెల్లడించేందకు తగినంత సమయం లేని సందర్భాల్లో పోలీసులు అక్కడకు చేరుకోవడం సవాల్‌గా పరిణమించింది. దీనికి పరిష్కారంగా కాలర్ లొకేషన్ ఆటోమేటిక్‌గా డయల్ 100 కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు తెలిసేలా సమాచార వ్యవస్థను ఆధునీకరించారు. దీంతో డయల్ 100కు కాల్ వచ్చిన కచ్చితమైన ప్రదేశానికి పోలీసులు సత్వరం చేరుకుని తగిన చర్యలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది. డయల్ 100 పరిధిలోకి మరిన్ని సేవలు డయల్ 100 వ్యవస్థను దశలవారీగా విస్తరించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. కేవలం పోలీసు సేవలే కాకుండా మరిన్ని సేవలను ఈ పరిధిలోకి తెస్తున్నారు. డయల్ 100కు కాల్ చేసి అగ్నిమాపక సేవలు, అంబులెన్స్ లాంటి వైద్య సేవలు, రాష్ట్ర విపత్తు స్పందన బలగాలు (ఎస్డీఆర్ఎఫ్) మొదలైన సేవలను కూడా పొందే సౌలభ్యాన్ని త్వరలో కల్పించనున్నారు. దశలవారీగా దాదాపు 20 సేవలను డయల్ 100 పరిధిలోకి తెచ్చేందుకు పోలీసుశాఖ సన్నద్ధమవుతోంది. -
జీ5లో అలరించే ఈ పోలీస్ సినిమాలు, సిరీస్‌లు చూశారా !
Top 6 Police Oriented Movies And Web Series In Zee5: తాము ఆరాధించే హీరోలను వివిధ గెటప్పుల్లో, విభిన్నమైన పాత్రల్లో చూడాలనుకుంటారు అభిమానులు. ఫ్యాన్స్‌కు కోరికలకు అనుగుణంగానే డిఫరెంట్ పాత్రల్లో నటించి మెప్పిస్తారు కథానాయకులు. ఫ్యాక్షనిస్టులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రభుత్వ అధికారులుగా, పోలీసులుగా నటించి మంచి ఆదరణ పొందారు. కథానాయకులు పోలీసులుగా నటించిన అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం సరికొత్త కాన్సెప్ట్స్, జోనర్స్‌తో ఎంటర్టైన్ చేసేందుకు రెడీగా ఉంటున్నాయి ఓటీటీలు. వాటిలో జీ5 ఒకటి. ఇటీవలే 80+ సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందిస్తున్నట్లుగా ప్రకటించింది. తాజాగా జీ5 ఓటీటీలో అందుబాటులో ఉన్న పోలీస్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లను ప్రేక్షకుల కోసం ప్రకటించింది. మరీ ఆ కాప్ సిరీస్‌లు, సినిమాలు ఏంటో చూద్దామా ! which cop makes your heart pop? 😍 pic.twitter.com/XE2OKhUvHJ — ZEE5 (@ZEE5India) May 24, 2022 చదవండి: సూపర్ థ్రిల్ ఇచ్చే 'జీ5' థ్రిల్లర్ మూవీస్ ఇవే.. -
సార్.. రెండు బీర్లు కావాలి
దౌల్తాబాద్: అర్ధరాత్రి ఓ ఆకతాయి చేసిన పనికి పోలీసులు అవాక్కయ్యారు. గురువారం రాత్రి 2 గంటల సమయంలో ఓ యువకుడు ‘డయల్ 100’కు కాల్ చేసి ‘సార్.. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, మీరు రావాలి’అని కోరాడు. దీంతో డ్యూటీలో ఉన్న బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు వెంటనే అతని వద్దకు బయలుదేరారు. తీరా అక్కడికి వెళితే ‘సార్.. నాకు రెండు బీర్లు కావాలి’అని ఆ యువకుడు అనడంతో పోలీసులు విస్తుపోయారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం గోకఫసల్వాద్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు ఆ గ్రామానికి వెళ్లేసరికి ‘డయల్ 100’కు ఫోన్ చేసిన జనిగెల మధు అనే యువకుడు మద్యం మత్తులో తూగుతున్నాడు. పైగా బీర్లు కావాలంటూ పోలీసులను ఆటపట్టించడానికి యత్నించాడు. దీంతో మధును పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. 100కు ఫోన్ చేసి తమ సమయం వృథా చేసిన మధుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. -
హోలీ పండుగకు భార్య మటన్ వండలేదని 100కు కాల్..
నల్గొండ (కనగల్) : భార్య మటన్ వండలేదని ఓ వ్యక్తి 100కు కాల్ చేసి కేసుల పాలయ్యాడు. ఎస్ఐ యు. నగేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి .. నల్లగొండ జిల్లా కనగల్ మండలం చర్ల గౌరారం గ్రామానికి చెందిన ఓర్సు నవీన్ తన భార్య మటన్ వండలేదని డయల్ 100కు ఆరు సార్లు కాల్ చేశాడు. మద్యం మత్తులో ఉన్న అతడు అనవసరంగా కాల్ చేసి ఇలా పోలీసుల సమయాన్ని వృథా చేయడంతో కేసు నమోదు చేశారు. ఆపద, అత్యవసర సేవలకోసం మాత్రమే డయల్ 100కు పోన్ చేయాలని ఎస్ఐ సూచించారు. -
ప్రేమపేరుతో ట్రాప్.. లాడ్జికి తీసుకెళ్లి.. మద్యం తాగించి
మంగళగిరి(గుంటూరు జిల్లా): ప్రేమ పేరుతో మైనర్(16)ను ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దించబోయారు. బాలిక చాకచక్యంగా తప్పించుకుని డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సత్వరమే స్పందించి విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను మంగళగిరి డీఎస్పీ రాంబాబు మంగళవారం విలేకరులకు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్టకు చెందిన కంసాని రాజేష్ వివాహం చేసుకుని గుంటూరు జిల్లా మంగళగిరిలోని కొత్తపేటలో నివాసముంటున్నాడు. కొద్ది రోజులుగా రాజేష్ మంగళగిరిలోని పార్కు రోడ్డులో ఓ బాలికకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి పరిచయం.. స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి గత నెల 22న రాత్రి రాజేష్ తన బంధువులు అవినాష్, వినోద్ సహాయంతో బాలికను కారులో యాదగిరిగుట్ట తీసుకువెళ్లి ఓ లాడ్జిలో ఉంచాడు. అక్కడ మద్యం తాగించి బాలికను అవినాష్ లోబర్చుకున్నాడు. రాజేష్ బంధువు సిరి వ్యభిచారం నిర్వహిస్తుండగా బాలికను ఆ కూపంలోకి దించాలని చూశారు. దీన్ని గ్రహించిన బాలిక తప్పించుకుని డయల్ 100కు ఫోన్ చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు బృందాలుగా ఏర్పడి రాజేష్, అవినాష్, వినోద్, సిరిని అరెస్ట్ చేసి బాలికను రక్షించారు. బాలిక కనిపించకుండా పోయిన రోజునే ఆమె తల్లిదండ్రులు మంగళగిరిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందికి అర్బన్ ఎస్పీ రివార్డు ప్రకటించారు. సమావేశంలో సీఐ భూషణం, ఎస్ఐలు నారాయణ, మహేంద్ర పాల్గొన్నారు. -
అనంతపురం: ఒక్క ఫోన్ కాల్.. నలుగురి ప్రాణాలు కాపాడింది
అనంతపురం: ఒక్క ఫోన్ కాల్ అధికారులను అప్రమత్తం చేసింది. నలుగురి ప్రాణాలను కాపాడింది. శనివారం తెల్లవారుజామున కదిరి పట్టణంలోని చైర్మన్ వీధిలో నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల భవనం కుప్పకూలి..శిథిలాలు పక్కనే ఉన్న మరో రెండిళ్లపై పడటంతో ఆరుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు సైదున్నీసా(2), ఫారున్నీసా(8 నెలలు), యాషికా(3)తో పాటు మరో ముగ్గురు మహిళలు ఫైరోజా(65), భాను(30), ఫాతిమాబీ(65) ఉన్నారు. అయితే..ఇదే ఘటన నుంచి నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఫోన్‌కాల్ వల్ల వారి ప్రాణాలు నిలిచాయి. 8 గంటలు శిథిలాల కిందే ఉన్నా.. కదిరి మండలం చిగురుమాను తండాకు చెందిన డిప్లొమా విద్యార్థి తరుణ్ నాయక్ శుక్రవారం రాత్రి వరద ఉధృతి కారణంగా స్వగ్రామానికి వెళ్లలేకపోయాడు. కదిరిలో తనకు తెలిసిన చైర్మన్ వీధిలో నివాసముంటున్న క్యాటరింగ్ వంట మాస్టర్ రాజు ఇంట్లో ఉండిపోయాడు. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం రావడంతో ఉలిక్కిపడి లేచాడు. తాము ఉంటున్న ఇల్లు కూలిపోయిందని గ్రహించాడు. వెంటనే తనతో పాటు నిద్రిస్తున్న రాజు, మీటేనాయక్ తండాకు చెందిన ఐటీఐ విద్యార్థి గౌతమ్‌నాయక్, రామదాస్ తండాకు చెందిన ఉదయ్ నాయక్‌లను అప్రమత్తం చేసి.. గోడ వైపు సురక్షిత ప్రదేశానికి మెల్లిగా జరిగారు. వెంటనే తరుణ్ తన మొబైల్ నుంచి డయల్ 100కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ప్రసాద్, డీఎస్పీ భవ్య కిశోర్, ఆర్డీఓ వెంకటరెడ్డి, సీఐలు మధు, సత్యబాబు, ఫైర్, 108 సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు. తరుణ్‌తో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ... అందుకు అనుగుణంగా సహాయక చర్యలు కొనసాగించి ఎనిమిది గంటల తర్వాత నలుగురినీ బయటకు తీశారు. కాకపోతే వీరు ఉంటున్న ఇంట్లో గ్యాస్ లీక్ కావడంతో వీరందరికీ గాయాలయ్యాయి. కదిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వంట మాస్టర్ రాజు పరిస్థితి విషమంగా ఉండటంతో మేజిస్ట్రేట్ వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం అతన్ని మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ముగ్గురు మహిళలు... ముగ్గురు చిన్నారుల దుర్మరణం నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో అందులో నిద్రిస్తున్న ఫైరోజా(65) శిథిలాల కింద చిక్కుకుని మృతిచెందారు. ఈ భవనం శిథిలాలు పడటంతో పక్కింటి పైఅంతస్తులో ఉంటున్న జర్నలిస్టు సోమశేఖర్ భార్య భాను(30), వీరి మూడేళ్ల కూతురు యాషికా, అత్త ఫాతిమాబీ(65) నిద్రలోనే కన్నుమూశారు. ఆ పక్కింటిలో ఉంటున్న హబీబుల్లా, కలీమున్నీసా, కరీముల్లా, హబీబున్నీసా, హిదయతుల్లా భవనం కూలిన శబ్దానికి నిద్రలేచి బయటకు పరుగులు తీశారు. అయితే కరీముల్లా దంపతుల ఎనిమిది నెలల చిన్నారి ఫారున్నీసాతో పాటు రెండేళ్ల చిన్నారి సైదున్నీసాలను మాత్రం కాపాడుకోలేకపోయారు. వారు శిథిలాల కిందే మృత్యు ఒడికి చేరారు. భార్యతో పాటు అత్త, కుమార్తెను కోల్పోయిన పాత్రికేయుడు సోము, తమ ఇద్దరు బిడ్డలను కాపాడుకోలేక పోయిన కరీముల్లా దంపతులు విలపిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది. ఎమ్మెల్యేతో సహా అందరికీ హ్యాట్సాఫ్ సహాయక చర్యల్లో ముమ్మరంగా పాలుపంచుకున్న పోలీస్, రెవెన్యూ, ఫైర్, మున్సిపల్, 108, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు దగ్గరుండి పర్యవేక్షించిన ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డికి పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నుంచి తిరిగొచ్చిన ఎమ్మెల్యే శనివారం ఉదయం 8 గంటలకే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎంపీ గోరంట్ల మాధవ్ సైతం కదిరికి చేరుకుని మృతుల కుటుంబాలను ఓదార్చారు. -
సార్.. నా భార్య పుట్టింటి నుంచి రావడం లేదు!
హైదరాబాద్: లాక్డౌన్ పోలీసులకు చుక్కలు చూపిస్తుంది. ఒకవైపు విధుల్లో పాల్గొంటూనే ఇంకోవైపు 100కు వచ్చే డయల్స్‌కు అటెండ్ చేస్తున్నారు. డయల్ 100కు వస్తున్న ఫోన్‌కాల్స్ డిఫరెంట్‌గా ఉంటుండటంతో పోలీసులు నవ్వాలో.. ఏడ్వాలో.. అర్థ కాని పరిస్థితి తలెత్తుతుంది. ఒకవేళ ఆ ఫోన్‌కాల్‌కు స్పందించకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతాయన్న భయంతో అవి చిత్రవిచిత్రమైన (టైంపాస్) కాల్స్ అయినప్పటికీ అటెండ్ చేస్తున్నారు. డయల్ 100కు ప్రతిరోజు వెస్ట్‌జోన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల నుంచి ఇలాంటి చిత్రవిచిత్రమైన కాల్స్ 40 నుంచి 50 వరకు వస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతిరోజు 10 నుంచి 15 కాల్స్ ఇలాంటివి వస్తుండటంతో పోలీసులు తలపట్టుకుంటున్నారు. కుక్కపిల్ల తప్పిపోయిందని..బాయ్‌ఫ్రెండ్ మాట్లాడటం లేదని.. టైంపాస్ కావడం లేదని.. నీళ్లు రాకున్నా.. కరెంటు పోయినా.. చెత్త ఊడ్చకపోయినా.. ఇలా రకరకాల కారణాలతో ఫోన్లు చేస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉంటే పిచ్చెక్కిపోతున్నదంటూ... ఇంట్లో భర్త కొట్టాడంటూ.. మరికొందరకు 100కు కాల్ చేసి చెప్పుకొస్తున్నారు. పోలీసులు మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా తప్పనిసరిగా ఆయా ప్రాంతాలకు వెళ్లి బాధితులు చెప్పింది వింటున్నారు. ఒకవైపు చెక్‌పోస్ట్‌ల వద్ద ట్రాఫిక్ నియంత్రణ చేస్తూనే ఇంకోవైపు ఈ కాల్స్‌ను కూడా అటెండ్ చేస్తున్నారు. మిస్సింగ్లతోనూ సతమతం... ఒకవైపు లాక్డౌన్ అమలవుతుండగా ప్రేమ జంటలు మిస్సింగ్ అవుతుండటంతో యువతుల తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నెలరోజుల వ్యవధిలో ప్రేమ పేరుతో ఆరు మంది యువతులు మిస్సయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నెల రోజుల వ్యవధిలో ఇద్దరు వివాహిత మహిళలు, నలుగురు యువతులు అదృశ్యమయ్యారు. పోలీసులకు ఈ మిస్సింగ్ కేసులు కత్తిమీద సాములా మారుతున్నాయి. ఇలాంటి కేసులను చేధించే క్రమంలో పోలీసులకు ఎదురవుతున్న అనుభవాలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. పుట్టింటి నుంచి భార్య రావడంలేదంటూ.. సార్.. నేను మెకానిక్‌ను.. సయ్యద్‌నగర్‌లో ఉంటాను.. నా భార్య వారం రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. రమ్మంటే రావడం లేదు.. నేనింకో పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను.. నా భార్యతో విడాకులు ఇప్పించి.. ఆ కాగితం ఇస్తే రెండో పెళ్లి చేసుకుంటాను అని గత గురువారం రాత్రి 100కు వెంకటేష్ అనే మెకానిక్ డయల్ చేశాడు. వెంటనే ఆ సమాచారాన్ని బంజారాహిల్స్ పోలీసులకు కనెక్ట్ చేశారు. వెంకటేష్ అడ్రస్ పట్టుకొని అక్కడికి వెళ్లిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి సర్దిచెప్పారు. బాయ్‌ఫ్రెండ్ కోసం... సార్.. లాక్డౌన్ వల్ల నేను నా బాయ్‌ఫ్రెండ్‌ను కలవలేకపోతున్నాను.. మూడు రోజులుగా నా బాయ్‌ఫ్రెండ్ ఫోన్ చేయడం లేదు.. ఆయన ఫోన్ చేయకపోతే నేను చచ్చిపోయేలా ఉన్నాను.. దయచేసి నా బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడించండి.. మూడు రోజుల క్రితం బంజారాహిల్స్ రోడ్ నెంబర్.12కు చెందిన ఓ యువతి 100కు డయల్ చేసి ఏడ్చింది. వెంటనే ఆ సమాచారాన్ని బంజారాహిల్స్ పోలీసులకు కనెక్ట్ చేశారు. ఆ యువతితో మాట్లాడిన పోలీసులు బాయ్‌ఫ్రెండ్ ఫోన్‌నెంబర్ తీసుకొని ఆయనతో మాట్లాడి వెంటనే నీ ప్రియురాలితో మాట్లాడని చెప్పారు. అరగంట తర్వాత ఆ యువతి పోలీసులకు ఫోన్ చేసి నా బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడించినందుకు థ్యాంక్స్ అంటూ ఫోన్ పెట్టేసింది. కుక్కపిల్ల కోసం.. కూతుళ్లు రాకపోవడంతో... సార్.. నా ఇద్దరు కూతుళ్లు వ్యాక్సిన్ వేసుకోవడానికి మాదాపూర్ వెళ్లారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో తిరిగి వస్తుండగా నోవాటెల్ హోటల్ వద్ద ఓ కుక్కపిల్ల ప్రమాదానికి గురై విలవిల్లాడుతుండటంతో నా కూతుళ్లు ఇద్దరూ చలించిపోయారు. ఆ కుక్కపిల్లను కాపాడేదాకా మేం ఇక్కడి నుంచి రామంటూ ఏడవడంతో ఆ మహిళ శుక్రవారం రాత్రి 100కు డయల్ చేసింది. తనకు పోలీస్ ఎస్కార్ట్ ఇస్తే నోవాటెల్ వద్దకు వెళ్లి ఆ కుక్కను కాపాడి నా ఇద్దరు కూతుళ్లను తీసుకొని వస్తానని చెప్పింది. ఆ సమాచారాన్ని బంజారాహిల్స్ పోలీసులకు కనెక్ట్ చేయగా ఆ మహిళతో మాట్లాడి లాక్డౌన్ సమయంలో అలా కుదరదని చెప్పారు. నా ఇద్దరు కూతుళ్లు రాకపోతే ఎవరు బాధ్యులని ఆమె ప్రశ్నించడంతో తప్పేది లేక పోలీసులు మాదాపూర్ పోలీసులతో మాట్లాడి ఆ కుక్కపిల్లను ఆస్పత్రికి పంపించి ఇద్దరు బాలికలను బంజారాహిల్స్‌కు తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. టైంపాస్ కావడం లేదంటూ... సార్.. లాక్డౌన్ వల్ల నాకు టైంపాస్ కావడం లేదు.. స్నేహితులతో మద్యం తాగితే టైంపాస్ అయ్యేది.. ఇప్పుడు కష్టంగా ఉందంటూ నాలుగు రోజుల క్రితం ఓ వ్యక్తి 100కు రాత్రంతా 20 సార్లు ఫోన్ చేసి విసిగించాడు. అయి నా సరే పోలీసులు ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని బంజారాహిల్స్ పోలీసులకు కనెక్ట్ చేస్తూ వచ్చారు. ఇక్కడి పోలీసులు ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి ఇది పద్ధతి కాదని కౌన్సెలింగ్ ఇచ్చారు. వాళ్లు వెళ్లిన ఐదు నిమిషాల్లోనే మళ్లీ 100కు ఆ వ్యక్తి డయల్ చేశాడు. అలా రాత్రంతా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఇదేమిటంటే మ ద్యం తాగుతున్నప్పుడు పిచ్చాపాటి మాట్లాడుకోవడం నాకు అలవాటని చెప్పుకొచ్చాడు. -
షార్... మాకు 90 ఎంఎల్ కావాలి.. డయల్ 100కు మందుబాబుల కాల్స్!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న ఈ కష్టకాలంలో కరోనా బాధితులు మందుల కోసం ఆరాటపడుతుంటే.. మద్యంప్రియులేమో మందు కోసం సతాయిస్తున్నారు. లాక్డౌన్ వేళ.. ‘డయల్ 100’కు ఫోన్‌కాల్స్ పోటెత్తుతున్నాయి. ఇందులో లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కాల్స్ అధికంగా ఉంటున్నాయి. మరోవైపు మందుబాబుల కాల్స్ కూడా పెద్దసంఖ్యలో ఉంటున్నాయి. ఎక్కడ మందు దొరుకుతుందో చెప్పాలంటూ ‘డయల్ 100’ సిబ్బందిని విసిగిస్తున్నారు. ఈ నెల 12 నుంచి లాక్డౌన్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఉదయం 6– 10 గంటల మధ్య రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులు తెరిచే ఉంటున్నాయి. అయినా, పనీపాటాలేని కొందరు, తాగిన మద్యం సరిపోక మరికొందరు ‘డయల్ 100’కు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. ‘షార్... మాకు 90 ఎంఎల్ కావాలి. మందు ఎక్కడ దొరుకుతుంది? డబుల్ రేటైనా ఫర్లేదు’అని కొందరు, కనీసం బెల్ట్‌షాపుల అడ్రస్లైనా చెప్పాలంటూ మరికొందరు వేధిస్తున్నారు. ఇలాంటి కాల్స్‌తో తమ విలువైన సమయం వృథా అవుతోందని ‘డయల్ 100’ఆపరేటర్లు వాపోతున్నారు. ఇలాంటి ఒక్కో కాల్ వల్ల దాదాపు 45 సెకండ్ల సమయం వృథా అవుతోందని, ఆలోపు ఆపదలో ఉన్నవారికి లైన్ దొరకకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అకారణంగా ఫోన్లు చేస్తే కేసులు పెడతామని సిబ్బంది హెచ్చరించారు. మొత్తం 54 వేల ఫిర్యాదులు ఈ నెల 12 నుంచి 24 వరకు డయల్ 100 సిబ్బందికి మొత్తం 54 వేల ఫోన్ కాల్స్ రాగా... అందులో 6,431 కోవిడ్‌కు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జనం గుమిగూడుతున్నారని 3,121, ఉదయం 10 గంటలు దాటినా షాపులు తెరిచే ఉన్నాయని 1,947, కోవిడ్ అనుమానితులపై 633, మాస్కు ధరించలేదని 308, కరోనా అనుమానిత మరణాలపై 144 కాల్స్ వచ్చాయి. ఆసుపత్రిలో బెడ్లు లేవని, అంబులెన్సులు కావాలని, ఆక్సిజన్ వెంటిలేటర్లు లేవని, చికిత్సకు ఆసుపత్రులవారు అధిక మొత్తం డిమాండ్ చేస్తున్నారని, ప్లాస్మా కావాలని పలు ఫోన్లు వచ్చాయి. -
శభాష్ పోలీస్.. నిముషాల్లో స్పాట్‌కు..
నల్గొండ: అత్యాధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసులు ప్రజలకు వేగంగా సేవలు అందిస్తున్నారు. తాజాగా ఆత్మహత్య చేసుకోబోతున్న ఓ వ్యక్తిని నిమిషాల వ్యవధిలో కాపాడి శభాశ్ పోలీస్ అనిపించుకున్నారు. ఈ సంఘటన నల్గొండలో జరిగింది. ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారని స్పీడ్ డయల్ 100కు ఫోన్ రావడంతో వెంటనే పోలీసులు స్పందించారు. అయితే సమాచారం అందించిన వ్యక్తి మునుగోడు రోడ్డు అని మాత్రమే చెప్పారు. అయినా కూడా పోలీసులు అప్రమత్తమై గాలించి బలవన్మరణ యత్నం చేయాలనుకున్న వ్యక్తిని ప్రాణాలతో కాపాడారు. విధి నిర్వహణలో భాగంగా సాగర్ రోడ్డులో ఉండగా మంగళవారం రాత్రి 9.44 నిమిషాలకి శంకర్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకోబోతున్నాడని 100కు సమాచారం వచ్చింది. వెంటనే స్పందించిన సిబ్బంది అతడి సమాచారం అడగ్గా తన లొకేషన్ మునుగోడు రోడ్డు అని మాత్రమే తెలిపాడు. ఆ తర్వాత తిరిగి ఆయనకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. అతడి గురించి సమాచారం తెలుసుకుని 4 నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకుని ఉరి వేసుకున్న శంకర్‌ను కాపాడారు. అయితే అప్పటికే ఉరి వేసుకోవడంతో స్తృహ తప్పాడు. వెంటనే ప్రథమ చికిత్స చేసి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. విధి నిర్వహణలో చురుగ్గా వ్యవహరించి వ్యక్తి ప్రాణాలను కాపాడిన డయల్ 100 సిబ్బంది సీహెచ్ సత్యనారాయణ, పీసీలు సురేశ్‌లను ఉన్నతాధికారులు అభినందించారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల పనితీరు మెరుగ్గా ఉండడంతో ప్రజలు అభినందిస్తున్నారు. -
డయల్ 100కు బదులుగా 112
సాక్షి, ముంబై: అత్యవసర సమయంలో పోలీసుల సాయం కోసం డయల్ చేయడానికి ఇదివరకు అందుబాటులో ఉన్న ఒకటి సున్నా సున్నా (100) అనే హెల్ప్‌లైన్ నంబరు త్వరలో 112 గా మారనుంది. గ్లోబల్ పొజీషనింగ్ సిస్టం (జీపీఎస్) ద్వారా పనిచేసే ఈ 112 నంబరు త్వరలో వినియోగంలోకి రానుంది. కొత్త నంబరు పని చేయడం ప్రారంభించగానే 100 నంబరును నిలిపివేయనున్నట్లు అదనపు పోలీసు కమిషనర్ జాలిందర్ సుపేకర్ వెల్లడించారు. ఈ కొత్త నంబరును జీపీఎస్‌తో అనుసంధానించడం వల్ల సాయం కోసం ఫోన్ చేసిన బాధితుడి లొకేషన్ గుర్తించి, కొద్ది నిమిషాల్లోనే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుంటారని కమిషనర్ తెలియజేశారు. అంతేగాకుండా తప్పుడు కాల్, తప్పుడు సమాచారం అందించే వారి ప్రాంతాన్ని గుర్తించడం వల్ల పోలీసులు చర్యలు తీసుకునేందుకు ఈ ఆ«ధునిక ఎంతో దొహదపడనుంది. ఫేక్ కాల్స్‌కు చెక్! గత అనేక దశాబ్దాలుగా ఎంతో ప్రాచుర్యం పొందిన, అందరికి గుర్తుండే 100 నంబరు త్వరలో కనుమరుగుకానుంది. చోరీలు, హత్యలు, ఈవ్‌టీజింగ్, అస్యభకరంగా ప్రవర్తించడం ఇలా అనేక రకాల ఫిర్యాదులు ఈ నంబరుపై చేయాల్సి ఉంటుంది. వృద్దులు, పిల్లలు, మహిళలకు ఎలాంటి సాయం అవసరమైన త్వరలో అందుబాటులోకి రానున్న ఈ ఆధునిక హెల్ప్‌లైన్ నంబరును సంప్రదించాల్సి ఉంటుంది. ఎవరైన బాధితులు సాయం కోసం ఈ నంబరును సంప్రదిస్తే తొలుత ముంబై లేదా నాగ్‌పూర్‌లోని కాల్ సెంటర్‌కు వెళుతుంది. అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది బహుభాషీయులు కావడంతో ఫిర్యాదుదారుడికి భాషాపరమైన ఇబ్బందులు తలెత్తబోవని అదనపు పోలీసు కమిషనర్ జాలిందర్ సుపేకర్ అన్నారు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ ఆధునిక హెల్ప్‌లైన్ నంబరును ఎలా రిసీవ్ చేసుకోవాలో పోలీసులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇదివరకు 100 నంబరుపై పోలీసులను ఆటపట్టించేందుకు లేదా ఫలాన రైలులో లేదా విమానంలో బాంబు ఉందని ఇలా అనేక తప్పుడు ఫోన్లు వచ్చేవి. దీంతో కాల్స్ నిజమా...? అబద్దమా...? తెలుసుకునేందుకు, ఆకతాయిలను అరెస్టు చేయడానికి పోలీసుల విలువైన సమయం చాలా వృథా అయ్యేది. కానీ, ఈ ఆ««ధునిక 112 నంబరును సంప్రదించిన వ్యక్తి ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాడో లోకేషన్ గురించి వెంటనే తెలిసిపోతుంది. ఒకవేళ అది తప్పుడు కాల్ అయితే పోలీసులు కొద్ది నిమిషాల్లోనే అక్కడి చేరుకుని దర్యాప్తు చేపడతారని కమిషనర్ స్పష్టం చేశారు. -
ఆరేళ్లలో డయల్ 100కు ఎన్ని కాల్స్ తెలుసా!
సాక్షి, హైదరాబాద్ : అత్యవసర సమయంలో ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది డయల్–100. ఆపదలో ఉన్న వారికి క్షణాల్లో పోలీసులు మేమున్నామని భరోసా కల్పిస్తున్నారు. సహాయం కోసం కాల్ వచ్చిన 90 సెకన్లలోనే బాధితులకు అందుబాటులోకి వచ్చి వారిని ఆదుకుంటున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి గత నవంబరు చివరి నాటికి డయల్–100కు మొత్తం 55,62,389 అత్యవసర ఫోన్లు వచ్చాయి. వాటిలో భౌతిక దాడులకు సంబంధించి 12,02,923, రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 9,96,032, న్యూసెన్స్ 8,58,871, మహిళలపై దాడులు 6,49,109, ఆత్మహత్యలు 2,10,936, ఎన్నికలకు సంబంధించినవి 29,113, ఫోన్లు ఉన్నాయి. ఈ కాల్స్‌పై పోలీసులు సత్వరం స్పందించడమే కాకుండా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ అవసరమైన మార్పులు చేపడుతున్నారు. -
100కు ఫోన్ చేసి ప్రధానికి బెదిరింపు
నోయిడా : 'మేము ఆపదలో ఉన్నామంటూ.. ఇక్కడ ప్రమాదం జరిగిందంటూ..' డయల్ 100కు ఫోన్ చేసి విసిగించే ఆకతాయిలు చాలా మందే ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి హాని తలపెడతానంటూ డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులను బెదిరించాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్.. నోయిడాలో సోమవారం చోటుచేసుకుంది. హర్యానాకు చెందిన హర్భజన్ సింగ్ నోయిడాలోని సెక్టార్ 66లో నివసిస్తున్నాడు. సోమవారం ఆకస్మాత్తుగా డయల్ 100కు ఫోన్ చేసి ప్రధానికి హాని తలపెడాతనంటూ బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హర్భజన్‌ను ట్రేస్ చేస్తుండగా ఫేస్-3 పోలీసులకు మమూరా వద్ద పట్టుబడ్డాడు. హర్భజన్ సింగ్ మత్తు పదార్థాలకు బానిసైనట్లు విచారణలో తేలిందని పోలీసులు స్పష్టం చేశారు. కాగా వైద్యపరీక్షల కోసం హర్భజన్‌ను ఆసుపత్రికి పంపించినట్లు నోయిడా అదనపు డీసీపీ అంకూర్ అగర్వాల్ చెప్పారు. -
ఈ లెక్క ఏమిటో తెలుసా..?
రోజుకు 65,131.. గంటకు 2,713.. నిమిషానికి 45.. ఈ లెక్క ఏమిటో తెలుసా..? లాక్డౌన్ మొదలైన నాటి నుంచి శనివారం వరకు డయల్–100కు వచ్చిన ఫోన్‌కాల్స్ సరాసరి. వీటిలో 81.92 శాతం కేవలం టెక్నికల్ కాల్స్ అంటే ఆశ్చర్యం కలగక మానదు. లాక్డౌన్ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లు పిల్లల చేతికి చేరడం, కొత్తగా అందుబాటులోకి వచ్చిన సేవ్అవర్ సోల్ (ఎస్ఓఎస్) సదుపాయంతో కూడిన యాప్స్ కారణంగా వచ్చిన పరిస్థితి ఇది. గత నెల 23 నుంచి ఈ నెల 25 వరకు డయల్–100కు మొత్తం 22,79,618 ఫోన్ కాల్స్ వచ్చాయి. వీటిలో 18,67,536అనుకోకుండా వచ్చివే కావడం గమనార్హం. ఈ పరిస్థితికి కారణం ఏమిటంటే.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైననిర్ణయంతో పాటు కొన్ని రకాలైన యాప్స్ కారణంగా డయల్–100కు వచ్చే కాల్స్ సంఖ్య భారీగా ఉంటోంది. సాక్షి, సిటీబ్యూరో: డయల్–100 పోలీస్‌కు సంబంధించినది కాగా.. 112 పోలీస్, ఫైర్, అంబులెన్స్ సర్వీసులకు కలిపి దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన నంబర్. తెలంగాణలో 112ను సైతం 100కు అనుసంధానించారు. స్మార్ట్ ఫోన్లో పవర్ బటన్‌ను మూడుసార్లు నొక్కితే అది 100 లేదా 112కు కాల్ వెళ్లేలా ఏర్పాటు చేయడం కచ్చితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ పవర్ బటన్ ప్రెస్ చేయడంతో పాటు కొన్ని రకాలైన ఎమర్జెన్సీ యాప్స్, అలెర్ట్ సిస్టమ్స్‌తో కూడిన యాప్స్ కారణంగా వీటి సంఖ్య పెరిగింది. ఈ తరహా యాప్స్ ఉన్న ఫోన్లకు భారీ కుదుపు వచ్చినా, గాల్లో నిర్ణీత విధానంలో తిప్పినా ఆ కాల్ డయల్–100కు వెళ్లిపోతోంది. చిన్నారులు వీడియో గేమ్స్ ఆడుతూ పవర్ బటన్‌ను అనేకసార్లు నొక్కడం చేస్తున్నారు. ఆ సమయంలో ఫోన్‌ను ఇష్టానుసారంగా వాడటంతో కాల్ 100కు వెళ్లిపోతోంది. ఇలా గణనీయంగా కాల్స్ పెరిగిపోతున్నాయి. ‘ప్రెస్–1’ విధానం అమల్లోకి.. అసంకల్పితంగా వచ్చే కాల్స్ వల్ల 100 కంట్రోల్ రూమ్‌లో ఉండే సిబ్బందిపై తీవ్ర పనిఒత్తిడి ఉంటోంది. దీన్ని అడ్డుకోవడానికి పోలీసు విభాగం ‘ప్రెస్–1’ విధానం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఎవరైనా డయల్–100కు కాల్ చేస్తే తొలుత ఆన్సర్ చేసే ఐవీఆర్ఎస్ (ఇంటర్యాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) ఒకటి బటన్ నొక్కమని చెప్తుంది. అలా చేసిన తర్వాతే ఆ కాల్ కంటిన్యూ అయ్యి అక్కడి సిబ్బందికి కనెక్ట్ అవుతుంది. అలా ప్రెస్ చేయకపోతే కొన్ని సెకన్లలోనే ఆ కాల్ కట్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే లాక్డౌన్ మొదలైన తర్వాత ‘100’కు వచ్చిన మొత్తం 22,79,618 కాల్స్‌లో ‘ఒకటి నొక్కి’ సిబ్బందికి చేరిన వాటి సంఖ్య కేవలం 4,12,082గా ఉంది. ఇలా కనెక్ట్ అయిన వాటిలోనే అసంకల్పితంగా వచ్చిన కాల్స్ సంఖ్య వేలల్లో ఉంటోంది. ఈ నిర్ణీత కాలంలో ప్రెస్–1 తర్వాత డయల్–100 సిబ్బందికి కాల్ కలిసిన తర్వాత సైతం అనుకోకుండా ఫోన్ వచ్చింది అని పెట్టేసిన వారి సంఖ్య 8,262గా ఉంది. దీని ప్రకారం మొత్తం 22.9 లక్షల కాల్స్‌లో వాస్తవ కాల్స్ కేవలం 41,12,082 మాత్రమే అని డయల్–100 గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తగ్గిన ‘బెదిరింపు’ కాల్స్.. డయల్–100కు ఒకప్పుడు బాంబు బెదిరింపు కాల్స్ బెడద ఎక్కువగా ఉండేది. ఆకతాయిలతో పాటు రైళ్లు, బస్సులు, విమానాలు వాటి నిర్ధేశిత సమయంలో బయలుదేరకుండా ఉండేందుకు, రద్దయ్యేందుకు ఈ కాల్స్ చేస్తుండేవాళ్లు.. వరుస సెలవులు, బంద్‌ల సమయంలో ఈ హోక్స్ కాల్స్ బెడద ఎక్కువగా ఉండేది. అయితే కాయిన్ బాక్సులతో పాటు ఈ కాల్స్ కూడా కనుమరుగయ్యాయి. నగరంలో ఒకప్పుడు ఎక్కడపడితే అక్కడ ఫోన్లు చేసుకోవడానికి ఉపకరించే కాయిన్ బాక్సులు ఉండేవి. దీంతో ఆకతాయిలు వాటి నుంచి ఫోన్లు చేసేవారు. ఈ కాయిన్ బాక్సుల మాదిరిగానే ఆ తరహా కాల్స్ సైతం ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయాయి. పిల్లల చేతికి చేరడంతోనే.. డయల్–100కు అనవసర కాల్స్ పెరిగిపోవడానికి ప్రధాన కారణం చిన్నారుల చేతికి స్మార్ట్ ఫోన్లు చేరడమే. లాక్డౌన్ కారణంగా తల్లిదండ్రులు, పిల్లలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఫోన్లు పిల్లల చేతుల్లోకి వెళ్లిపోయాయి. గేమ్స్‌లో ముగినిపోయిన పిల్లలు ఈ ఎమర్జెన్సీ సర్వీసుకు కాల్ చేసేస్తున్నారు. కొందరు కాల్ వెళ్తున్న.. వెళ్లిన విషయం గమనించి వెంటనే కట్ చేస్తున్నారు. మరికొందరు ప్రెస్–1 నొక్కకపోవడంతో కాల్ కట్ అవుతోంది. తక్కువ సంఖ్యలో మాత్రం కాల్ కంట్రోల్ రూమ్ సిబ్బందికి చేరిన తర్వాత వాళ్లు ఏ సహాయం కావాలని అడుగుతుంటే మిన్నకుండిపోతున్నారు. ఈ కాల్స్‌ను డయల్–100 సిబ్బందే కట్ చేస్తున్నారు. – పోలీసు ఉన్నతాధికారి -
న్యూసెన్సే!
సాక్షి, సిటీబ్యూరో: కొవిడ్ అనుమానిత కేసు కనిపించింది... ఎక్కడైనా ఎక్కువ మంది గుమిగూడి ఉన్నారు...ఏదైనా దుకాణంలో అధిక ధరలకు విక్రయిస్తున్నారు...అనారోగ్యానికి గురికావడంతో సహాయం అవసరమైంది... ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటివి ఎదురైనప్పుడు అందరికీ గుర్తుకువచ్చే సంఖ్య ‘100’. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తామో..అదే స్థాయిలో స్పందన ఉండాలని ఆశిస్తాం. అలాంటి విలువైన ‘డయల్–100’కు ప్రస్తుత తరుణంలోనూ ఆకతాయిల బెడద తప్పట్లేదు. అభ్యంతరకరంగా మాట్లాడుతున్న కాలర్లూ ఎక్కువగానే ఉంటున్నారు. సహాయం కోసం కాకుండా కేవలం ‘సమాచారం’ తెలుసుకోవడానికీ అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. సోమ, మంగళ వారాల్లో డయల్–100కు 21 వేలకు పైగా ఫోన్ కాల్స్ రాగా... వాటిలో 20.7 శాతం న్యూసెన్స్ కాల్స్ కావడం గమనార్హం. ‘డయల్–100’కు రాష్ట్రం నలుమూలల నుంచి సోమ, మంగళవారాల్లో 21,524 కాల్స్ వచ్చాయి. ఇలా వచ్చిన ఫోన్లలో బ్లాంక్ కాల్స్, న్యూసెన్స్ కాల్స్, అనవసరవిషయాలను ప్రస్తావించే ఫోన్ల సంఖ్య 4464గా నమోదైంది. సోషల్‌మీడియా, పోలీసు అధికారిక వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చినా... ఇప్పటికీ ఫలానా అధికారి ఫోన్ నెంబర్ కావాలనో, ఫలానా పోస్టులో ఏ అధికారి ఉన్నారనో తెలుసుకోవడానికి ‘100’ ఫోన్లు చేస్తున్న వారు భారీ సంఖ్యలోనే ఉంటున్నారని అధికారులు చెబుతున్నారు. సోమ, మంగళవారాల్లోనే ఈ తరహా కాల్స్ సంఖ్య 4991గా నమోదైంది. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న విద్యాధికులు సైతం ఈ తరహాలో ఫోన్లు చేస్తుంటడం సిబ్బందికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. చిత్ర విచిత్ర ‘వేధింపులూ’ ఎక్కువే... ఈ కంట్రోల్ రూమ్‌లో పని చేసే సిబ్బందికి ప్రస్తుత తరుణంలోనూ ‘వేధింపులు’ తప్పట్లేదు. కొందరు ఫోన్లు చేసి పోలీసు విభాగం, సంబంధిత అంశాలతో సంబంధంలేనివి అడుగుతున్నారు. అలాంటి వారికి సిబ్బంది నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తే దూషణలకు దిగుతున్నారు. అసభ్యపదజాలం కాకపోయినా... అభ్యంతరకరంగా, ఎదుటి వారి మనస్సుకు బాధ కలిగేలా మాట్లాడుతుంటారు. కొందరు ఆకతాయిలైతే పదేపదే ఫోన్లు చేయడంతో పాటు ఏమీ మాట్లాడకుండా ఉండటమో, వెంటనే కట్ చేసేయడమో చేస్తుంటారు. వీటిని అధికారికంగా బ్లాంక్ కాల్స్‌గా పరిగణిస్తున్న సిబ్బంది పక్కన పెట్టేస్తున్నారు. అలాంటి నెంబర్లను బ్లాక్ చేసే అవకాశం ఉన్నప్పటికీ... భవిష్యత్తులో వారికే ఏదైనా ఇబ్బంది ఎదురైనా, అత్యవసరం అయినప్పుడు ఆ వ్యవహారం ‘నాన్న పులి’ కథ మాదిరిగా మారుతుందనే ఉద్దేశంతో ‘డయల్–100’ సిబ్బంది ఉపేక్షిస్తున్నారు. కొవిడ్, లాక్డౌన్ కాల్సూ పెద్ద సంఖ్యలోనే... ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, లాక్డౌన్ నేపథ్యంలో డయల్–100 సిబ్బంది నిర్విరామంగా, అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తమకు ఫోన్ చేసిన వారు పూర్తి స్థాయిలో వివరాలు అందించకున్నా, అందించలేకున్నా వీలున్నంత వరకు సహాయసహకారాలు అందిచడానికే ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా ‘100’కు ఫోన్ చేయమంటూ ప్రభుత్వం ప్రకటించడంతో కొవిడ్ సంబంధిత, లాక్‌డౌన్‌కు సంబంధించిన కాల్స్ కూడా పెద్ద సంఖ్యలోనే వస్తున్నాయి. సోమ, మంగళవారాల్లోనే వీటికి సంబ«ంధించి 3916 ఫోన్లు వచ్చాయి. వీటిలో 265 కోవిడ్ అనుమానితులకు సంబంధించినవి కాగా... 3651 లాక్డౌన్ సంబంధితమైవి. వీటిపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్న డయల్–100 అధికారులు ఆ కాల్స్‌ను సంబంధిత విభాగాలు, పోలీసుస్టేషన్లు, కార్యాలయాలకు బదిలీ చేస్తున్నారు. అత్యవసరంగా స్పందించాల్సిన, తీవ్రమైన ఉల్లంఘనలకు సంబంధించిన ఫోన్ల సమాచారాన్ని టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ వంటి ప్రత్యేక విభాగాలకు అందిస్తున్నారు. తాజా పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులకు పోటీగా డయల్–100 సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఆదేశాలను ఉల్లంఘిచిన వ్యవహారాల పైనా ఫోన్లు వస్తున్నాయి. హాస్టల్ ఖాళీ చేయమని నిర్వాహకులు వేధిస్తున్నారని, ఇంటి అద్దె కోసం యజమానాలు డిమాండ్ చేస్తున్నారనీ బాధితులు డయల్–100ను ఆశ్రయిస్తున్నారు. లాక్డౌన్ సంబంధిత కాల్స్ వివరాలివి... జనం గుమిగూడటంపై సమాచారం :1712 రవాణా ఇబ్బందులకు సంబంధించి :316 ఆహారం దొరకట్లేదని :441 నిర్ణీత సమయం మించి దుకాణాలు తెరవడంపై : 183 అధిక ధరకు నిత్యావసరాలు విక్రయంపై :82 హాస్టల్ నుంచి ఖాళీ చేయిస్తున్నారంటూ :6 నిత్యావసర రవాణా వాహనాలు ఆపారంటూ :19 అత్యవసర విధులు సిబ్బందిని ఆపారంటూ :6 రేషన్ సరఫరాలో ఇబ్బందులపై :775 యజమానులు అద్దె డిమాండ్ చేస్తున్నారంటూ :111 (సోమ, మంగళవారాల డేటా ఆధారంగా...) -
డయల్ 100కు ఏడేళ్లు!
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి ఆపద వచ్చినా.. అందరికీ గుర్తుకు వచ్చే నంబరు డయల్ 100. ఈ డయల్ 100 కంట్రోల్ రూముకు శనివారంతో ఏడేళ్లు పూర్తయ్యాయి. 2013 ఏప్రిల్ 11న ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ కంట్రోల్ రూమును ఏర్పాటు చేశారు. అనంతరం రాష్ట్ర విభజన తర్వాత దీన్ని కూడా విభజించారు. కేవలం నేరాలకు సంబంధించిన కాల్స్ మాత్రమే కాదు.. రోడ్డు ప్రమాదాలు, తగాదాలు, చోరీలు, కొట్లాటలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అగ్ని ప్రమాదాలు ఇలా సమస్య ఏదైనా ముందు ఫోన్ వెళ్లేది ‘100’కే. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌లో అత్యంత కీలకమైనది డయల్ 100. అందుకే, ఇక్కడ పనిచేసే సిబ్బంది నిత్యం చాలా అప్రమత్తంగా ఉంటారు. ప్రతి కాల్ని వెంటనే రిసీవ్ చేసుకుంటారు. అందులో కొన్ని అనవసరమైనవి, బ్లాంక్ కాల్స్, ఫేక్ కాల్స్, చిన్నపిల్లలు, ఆకతాయిలు చేసే కాల్స్ అలా అనేక రకమైన కాల్స్ వస్తుంటాయి. 2017లో అత్యధికంగా 4.5 కోట్ల కాల్స్.. ఈ ఏడేళ్లలో కంట్రోల్ రూము సిబ్బంది 15.9 కోట్లు, అంటే దాదాపుగా 16 కోట్ల ఫోన్ కాల్స్ స్వీకరించారు. ఈ లెక్కన రోజుకు దాదాపు 62 వేల కాల్స్, గంటకు 2,597, నిమిషానికి 43 కాల్స్ చొప్పున కంట్రోల్ రూముకు కాల్స్ వెళ్తున్నాయి. 2017లో అత్యధికంగా 4.5 కోట్ల కాల్స్ వచ్చాయి. అంటే రోజుకు 1.25 లక్షల కాల్స్ ఆన్సర్ చేశారన్నమాట. మూడు షిఫ్టుల్లో పని చేసే ఈ సిబ్బందికి ఆ ఏడాది మొత్తం నిమిషానికి 86 కాల్స్‌కు పైగానే సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఈ కాల్స్‌కు స్పందించిన సిబ్బంది వెంటనే బాధితులు ఎక్కడున్నారో కనుక్కుని వారికి తక్షణ సాయం అందజేశారు. ఈ క్రమంలో వందలాది మంది ప్రాణాలు కాపాడారు. ఈ ఫోన్ కాల్స్‌ని విశ్లేషిస్తే.. 2018 నుంచి తగ్గాయి. కానీ, అత్యవసర కాల్స్ పెరగడం గమనార్హం. పోలీసులకు సమాచారం అందించేందుకు ఫోన్లు, హాక్ ఐ, సోషల్ మీడియా మాధ్యమాలు పెరగడం ఇందుకు కారణం. ఏడేళ్లలో డయల్ 100కు వచ్చిన కాల్స్ వివరాలు -
100కి డయల్ కరోనా!
సాక్షి, హైదరాబాద్: విపత్తులు, ఆపదల సమయంలో వెంటనే స్పందించే డయల్ 100 ఇప్పుడు మరో బాధ్యతను భుజాలకెత్తుకుంది. ఫైర్, రోడ్డు, అగ్నిప్రమాద ఘటనలతోపాటు ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు తమ వంతుగా ముందు కొచ్చింది. రాష్ట్ర ప్రజల్లో కోవిడ్ వైరస్ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే తమ ఎమర్జెన్సీ నంబరు డయల్ 100 ద్వారా గానీ, హాక్ఐ ద్వారా గానీ తమకు సమాచారం అందజేయవచ్చని సూచించారు. అలాంటి కాల్స్‌ను రిసీవ్ చేసుకున్న డయల్ 100 కంట్రోల్ రూం వారు వెంటనే ఆ సమాచారాన్ని వైద్యారోగ్యశాఖకు బదిలీ చేస్తారని, వారు వచ్చి వెంటనే వైద్యసాయం అందజేస్తారని భరోసా ఇస్తోంది. పోలీసుల వద్ద విదేశీయుల జాబితా కోవిడ్ కేసు వెలుగుచూసిన దరిమిలా.. రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్టులో థర్మల్ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి అనుమానితులను ఐసోలేషన్ వార్డులకు తరలిస్తోంది. చైనా, హాంకాంగ్, సింగపూర్, ఇరాన్, థాయ్‌లాండ్, సౌత్ కొరియా, జపాన్, ఇండోనేసియా, మలేసియా, నేపాల్, వియత్నాం, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాల నుంచి ఇంతవరకూ తెలంగాణకు 750 మంది రాష్ట్ర పౌరులు వచ్చారు. వీరందరి చిరునామాలు పోలీసుల వద్ద ఉన్నాయి. వీటిని ఇటీవల వైద్యారోగ్యశాఖకు అందజేసింది. వారు ఏయే పోలీసుస్టేషన్ పరిధిలోకి వస్తారో కూడా అందులో పేర్కొంది. ఈ వివరాల ఆధారంగా వైద్యారోగ్యశాఖ విదేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు వారిని సంప్రదించే యత్నాల్లో ఉంది. వదంతులపై చర్యలు.. అవగాహన షురూ! కోవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ కూడా విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా సోషల్‌మీడియా ద్వారా వదంతులు వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని డీజీపీ కార్యాలయ అధికారులు హెచ్చ రించారు. అలాంటి వదంతులు పుట్టించే వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కూడా హోంశాఖను ఆదేశించిన సంగతి తెలిసిందే. సైబరాబాద్, వరంగల్ కమిషనరేట్, కరోనాపై అవగాహన కార్యక్రమాలు ప్రారంభించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పబ్లిక్ అనౌన్స్ మెంట్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తే కేసులు: సజ్జనార్ శంషాబాద్: కోవిడ్ వైరస్‌పై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద కేసు నమోదు చేస్తామని సైబరా బాద్ సీపీ సజ్జనార్ స్పష్టంచేశారు. కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ప్రజలు దుష్ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని కోవిడ్ థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఏవిధంగా థర్మల్ స్క్రీనింగ్ చేపడుతున్నారు తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
చిత్ర విచిత్ర వేధింపులూ ఎక్కువే...
సాక్షి, సిటీబ్యూరో: ఇంట్లో చోరీనో,మరో నేరమో చోటు చేసుకుంది... హఠాత్తుగా దుండగులు హంగామా చేస్తూ దాడికి యత్నించారు... రహదారిపై మీ వాహనాన్నే ఢీ కొట్టిన వ్యక్తి మీతోనే గొడవకు దిగాడు. కళాశాలలో, ఉద్యోగానికో వెళ్తున్న అతివల్ని ఆకతాయిలు మితిమీరి వేధిస్తున్నారు.......ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అందరికీ గుర్తుకువచ్చే సంఖ్య ‘100’. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తామో..అదే స్థాయిలో స్పందన ఉండాలని ఆశిస్తాం. అలాంటి విలువైన ‘డయల్–100’కు ఆకతాయిల బెడదా తక్కువేం కాదు. అభ్యంతరకరంగా మాట్లాడుతున్న కాలర్లూ ఎక్కువగానే ఉంటున్నారు. నేరాలపై సమాచారం ఇవ్వడానికే కాకుండా కేవలం ‘సమాచారం’ తెలుసుకోవడానికీ అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. ప్రజల కోసం నిత్యం పని చేసేలా... సర్వకాల సర్వావస్థల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పోలీసు విభాగం కొన్నేళ్ల క్రితమే ‘100’ నెంబర్‌తో కంట్రోల్ రూమ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ విధానానికి మరింత సాంకేతిక పరిజ్ఞానం, పాదర్శకత, జవాబుదారీతనం జోడిస్తూ నాలుగేళ్ల క్రితం ‘డయల్–100’ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఫోన్‌కాల్‌ను రికార్డు చేసే ఇక్కడి సిబ్బంది ఆ సమస్య పరిష్కారమయ్యాకే దాన్ని క్లోజ్ చేస్తారు. ఈ విధానంపై అనునిత్యం ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుంది. ఏటా లక్షల్లోనే ఫోన్‌కాల్స్... ‘డయల్–100’కు నగరం నలుమూలల నుంచి రోజుకు గరిష్టంగా 700 నుంచి 800 కాల్స్ వస్తుంటాయి. ఇలా వస్తున్న ఫోన్లలో బ్లాంక్ కాల్స్, న్యూసెన్స్ కాల్స్, అనవసర విషయాలను ప్రస్తావించే ఫోన్లూ వేల సంఖ్యలోనే ఉంటున్నాయి. సోషల్ మీడియా, పోలీసు అధికారిక వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చినా..ఇప్పటికీ ఫలానా అధికారి ఫోన్ నెంబర్ కావాలనో, ఫలానా పోస్టులో ఏ అధికారి ఉన్నారనో తెలుసుకోవడానికి ‘100’ ఫోన్లు చేస్తున్న వారు వందల సంఖ్యలోనే ఉంటున్నారని అధికారులు చెప్తున్నారు. కొందరైతే సిటీ బస్సుల సమాచారం, చిరునామాలు కోరుతూ కాల్స్ చేస్తున్న వారూ ఉంటున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారో, అక్కడ నుంచి వచ్చిన వారో ఇలాంటి కాల్స్ చేస్తే ఫర్వాలేదు. నగరంలో నివసిస్తున్న విద్యాధికులు సైతం ఈ తరహాలో ఫోన్లు చేస్తుంటడం సిబ్బందికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. చిత్ర విచిత్ర వేధింపులూ ఎక్కువే... ఈ కంట్రోల్ రూమ్‌లో పనిచేసే సిబ్బందికి కొన్ని సందర్భాల్లో వేధింపులూ తప్పట్లేదు. కొందరు ఫోన్లు చేసి పోలీసు విభాగంతో సంబంధంలేని అంశాలు అడుగుతుంటారు. సిబ్బంది నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తే దూషణలకు దిగుతుంటారు. అసభ్యపదజాలం కాకపోయినా..అభ్యంతరకరంగా మాట్లాడుతుంటారు. కొందరు ఆకతాయిలైతే పదేపదే ఫోన్లు చేయడంతో పాటు ఏమీ మాట్లాడకుండా ఉండటమో, వెంటనే కట్ చేసేయడమో చేస్తుంటారు. వీటిని అధికారికంగా బ్లాంక్ కాల్స్‌గా పరిగణిస్తున్న సిబ్బంది పక్కన పెట్టేస్తున్నారు. అలాంటి నెంబర్లను బ్లాక్ చేసే అవకాశం ఉన్నప్పటికీ..భవిష్యత్తులో వారికే ఏదైనా ఇబ్బంది ఎదురైతే వ్యవహారం ‘నాన్న పులి’ కథ మాదిరిగా మారుతుందనే ఉద్దేశంతో ‘డయల్–100’ సిబ్బంది ఉపేక్షిస్తున్నారు. ‘బాక్సు’లతో పాటే తగ్గిన ‘బెదిరింపులు’... నగరంలో ఒకప్పుడు ఎక్కడపడితే అక్కడ కాయిన్ బాక్సులు ఉండేవి. దుకాణాల్లో ఉంచి నిర్వహించేవి కొన్నైతే..బహిరంగ ప్రదేశాల్లో ఉంచేసేవి మరికొన్ని ఉండేవి. వీటిని వినియోగించి ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఎక్కడకు ఫోన్లు చేస్తున్నారు? అనే అంశాలపై సరైన పర్యవేక్షణ ఉండేది కాదు. దీంతో వీటిని వినియోగించే ఆకతాయిలు ఫలానా చోట బాంబు ఉందనో, మరోటి జరుగుతోందనో చెప్తూ పోలీసుల్ని పరుగులు పెట్టించేవారు. ఈ కాయిన్ బాక్సుల మాదిరిగానే ఆ తరహా కాల్స్ సైతం పూర్తిగా తగ్గిపోయాయి. సెల్‌ఫోన్, ల్యాండ్లైన్ల నుంచి ఇలాంటి కాల్స్ చేస్తే బాధ్యుల్ని తేలిగ్గా గుర్తించి చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుంది. దీంతో ఈ తరహా ఆకతాయిలు వెనుకడుగు వేస్తున్నారు. నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు కావడంతో ఉన్న కొన్ని కాయిన్ బాక్సుల్నీ ఈ తరహాలో వినియోగించడానికి ఆకతాయిలు ధైర్యం చేయట్లేదు. గతేడాది కాల్స్ ఇలా... ⇔ బాడీలీ అఫెన్సెస్–59,000 (21.99 శాతం) ⇔ న్యూసెన్స్–55,000 (20.5 శాతం) ⇔ మహిళలపై నేరాలు–34,000 (12.67 శాతం) ⇔ యాక్సిడెంట్స్– 26,000 (9.6 శాతం) ⇔ సొత్తు సంబంధ నేరాలు–12,000 (4.47 శాతం) ⇔ ఆత్మహత్యలు– 2,200 (0.82 శాతం) ⇔ ఇతర నేరాలు, ఎంక్వైరీలు–80,000 (29.82 శాతం) మొత్తం– 2,68,200 ⇔ ఒకే అంశంపై ఒకటి కంటే ఎక్కువ ఫోన్లు కూడా వస్తుంటాయి. అందుకే నగరంలో నేరాలు, ప్రమాదాల, ఆత్మహత్యల సంఖ్య కంటే వాటికి సంబంధించిన ఫోన్‌కాల్స్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. జోన్ల వారీగా కాల్స్ ఇలా... ⇔ వెస్ట్ జోన్– 91,150 (33.98 శాతం) ⇔ నార్త్ జోన్– 46,786 (17.44 శాతం) ⇔ ఈస్ట్ జోన్– 44,598 (16.62 శాతం) ⇔ సౌత్ జోన్– 43,914 (16.37 శాతం) ⇔ సెంట్రల్ జోన్– 41,752 (15.56 శాతం) -
కనిపిస్తే చెప్పండి..!
ఆపరేషన్ స్మైల్–6లో భాగంగా అనాథలు, వీధిబాలలు, రెస్టారెంట్లు, హోటళ్లు, పరిశ్రమల్లో పనిచేసే బాలకార్మికుల సమాచారాన్ని తమకు అందజేయాలని విమెన్‌సేఫ్టీ వింగ్ చీఫ్, ఐజీ స్వాతిలక్రా విజ్ఞప్తి చేశారు. అలాంటి చిన్నారులు ఎక్కడ కనిపించినా.. డయల్ 100, ఫేస్బుక్, హాక్ఐ, వాట్సాప్, 1098లకు సమాచారం అందించాలని కోరడంతోపాటుగా సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీనిచ్చారు. వివిధ కారణాల వల్ల ఏటా వందలాది మంది చిన్నారులు వెట్టిచాకిరీలో బందీలుగా మారుతున్నారని, ఈ తరహా బాధిత చిన్నారులు కనిపించిన పోలీసులకు సమాచారం అందించాలన్నారు. జనవరి 1 నుంచి 31 వరకు జరగనున్న ఆపరేష న్ స్మైల్‌లో ప్రత్యేక బృందాలు రద్దీ ప్రాంతాల్లో చిన్నారులను కాపా డేందుకు రంగంలోకి దిగాయి. ఇప్పటి దాకా దాదాపు 900 మందికిపైగా చిన్నారులను కాపాడారు. వారిలో ముగ్గురిని దర్పణ్ యాప్ ద్వారా గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. సాక్షి, హైదరాబాద్ : వెట్టిచాకిరీలో మగ్గిపోతున్న చిట్టిచేతులను కాపాడాలని, వారి ముఖంలో చిరునవ్వును తిరిగి తేవాలన్న సంకల్పంతో 2015లో చేపట్టిన ఆపరేషన్ స్మైల్– ముస్కాన్‌లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పటిదాకా తెలంగాణ పోలీసులు దాదాపు 32 వేలకుపైగా చిన్నారులను కాపాడారు. 15 వేలమందిని తిరిగివారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. 16 వేలమందిని వివిధ హోమ్స్‌కు తరలించారు. ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ పేరుతో చేప డుతున్న కార్యక్రమం రెండు నెలలపాటే జరుగుతుంది. ఏడాది మొత్తం సాధ్యమేనా? బాలకార్మికులు, వీధిబాలల రక్షణకు ఈ స్పెషల్ డ్రైవ్ ఏడాది మొత్తం చేపట్టాలని పోలీసుశాఖకు శిశు సంక్షేమ, లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి పలువురు నిపుణులు సూచనలు చేశారు. దీనికి డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఇదే సమయంలో జనవరి, జూలై రాగానే..పనులు చేయించుకునేవారంతా ఆ పిల్లలు దొరక్కుండా జాగ్రత్తపడుతున్నారు. అందుకే, ఏడాదిమొత్తం చేయాలని పలువురు కోరుతున్నారు. అయితే, మానవ వనరుల కొరత, ఇతర కారణాల వల్ల సాధ్యం కాకపోయినా..ఈసారి ఏడాది మొత్తం వెట్టిచాకిరీ, పిల్లల అక్రమ రవాణాపై నిఘా ఉంచాలని పోలీసులకు డీజీపీ సూచించారు. ఈ నేపథ్యంలో పిల్లలను తరలించే స్మగ్లర్లు, ఏజెంట్లు, యజమానులపై ఈసారి పీడీ యాక్టులు పెట్టాలన్న ఒత్తిడి సర్వత్రా వ్యక్తమవుతోంది. వేధిస్తోన్న సదుపాయాల లేమి..! స్మైల్ సందర్భంగా చేపట్టే ఆపరేషన్‌లో పోలీసులు వేలాదిమంది చిన్నారులను కాపాడుతుంటారు. వారందరికీ వివిధ హోమ్స్‌లలో ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇక్కడ చాలామందికి ఒకే చోట ఆశ్రయం కల్పించడం వల్ల సదుపాయాల సమస్య ఎదురవుతోంది. ఈసారి ప్రతీ పిల్లాడికి ఇచ్చే నగదును పెంచుతామని మహిళా శిశు సంక్షేమ శాఖ హామీనిచ్చింది. మరోవైపు ఇతర రాష్ట్రాల పిల్లలను కాపాడాక వారి సమస్యలు తెలుసుకునేందుకు భాష సమస్యగా మారుతోంది. దుబాసీలు లేకపోవడం వల్ల బిహార్, గుజరాత్, ఒడిశా, అస్సాం నుంచి వస్తోన్న బాలల వివరాలు, చిరునామా కనుక్కోవడం చాలా క్లిష్టంగా మారుతోంది. పదేపదే పోలీసులకు దొరుకుతున్న బాలల్లో మార్పుకోసం సైకాలజిస్టును నియమించాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఈసారి భాష అనువాదానికి దుబాసీ, పిల్లల మానసికస్థితిని అంచనా వేసేందుకు సైకాలజిస్టుల నియామకం జరుగుతుందా లేదా అన్నది చూడాలి. ఏటేటా పట్టుబడుతున్న పిల్లల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. -
కాల్ చేస్తే లొకేషన్ తెలిసిపోద్ది!
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ వ్యక్తి డయల్ 100కి కాల్ చేశాడు. కానీ అవతలివారు కాల్ లిఫ్ట్ చేసేలోపే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతడిది బేసిక్ ఫోన్ కావడంతో ఆ వ్యక్తి ఎక్కడున్నాడో కనుక్కునే సరికి చాలా ఆలస్యమైంది. పోలీసులు, అంబులెన్సు చేరుకునే సరికి అతడు మరణించాడు. మరో ఘటనలో రైలు నుంచి కిందపడ్డ ఓ వ్యక్తి కాళ్లు విరిగినా డయల్ 100కి కాల్ చేశాడు. తాను మాట్లాడగలిగాడు. కానీ చీకట్లో తానెక్కడ ఉన్నాడో చెప్పలేకపోయాడు. ఫలితంగా అతడిని వెతికేసరికి నాలుగైదు గంటలు పట్టింది. సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో డయల్ 100కి కాల్ చేసే బాధితులకు ఇలాంటి కష్టాలు ఉండవు. గతంలో డయల్ 100కి ఫోన్ చేసినవారు తామెక్కడ ఉన్నది చెప్పాల్సి వచ్చేది. పైగా ఏ ఏరియాలో ఉన్నారో తెలిసేది కాదు. ఇకపై ఆ సమస్యలన్నీ తొలగిపోనున్నాయి. దీనికోసం తెలంగాణ పోలీసులు డయల్ 100 విషయంలో మరో అదనపు సదుపాయం చేర్చారు. బాధితులు ఫోన్ చేయగానే ముందు వారెక్కడ ఉన్నారో ఇట్టే తెలిసిపోతుంది. గస్తీ పోలీసులకు బాధితుల లొకేషన్ గాడ్జెట్లపై ప్రత్యక్షమవుతుంది. దాంతో అవతలివారు ఫోన్ మాట్లాడినా, మాట్లాడకపోయినా.. శివారు, మారుమూల, నిర్మానుష్య, అటవీ, రోడ్డు, రైలు ఇలా మార్గమేదైనా.. ఏ మూలన ఉన్నా.. పోలీసులు గస్తీ వాహనాల్లో క్షణాల్లో అక్కడకు చేరుకుంటారు. సరికొత్త సాఫ్ట్వేర్ రూపకల్పన.. డయల్ 100 విషయంలో బాధితుల లొకేషన్ తెలుసుకోవడం కష్టంగా మారుతున్న విషయంపై తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. చాలాకాలం క్రితమే ఈ సమస్యలపై పలు సాఫ్ట్వేర్ నిపుణులతో చర్చించారు. బాధితుల లొకేషన్‌ను క్షణాల్లో గుర్తించడమే దీనికి పరిష్కారమని సూచించారు. ఈ మేరకు ఓ సాఫ్ట్వేర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని, ప్రత్యేకంగా ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయించుకున్నారు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ను విజయవంతంగా పరీక్షించారు. కొత్త సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పోలీసులందరికీ అందుబాటులో తీసుకువచ్చేందుకు ప్రతీ పోలీసు గాడ్జెట్లలోనూ ఈ సాఫ్ట్‌వేర్‌ను త్వరలో ఇన్స్టాల్ చేస్తారు. నేరాలు, ప్రాణనష్టం నివారణ.. హైవేలపై జరిగే రోడ్డు ప్రమాదాల్లో చాలామటుకు ల్యాండ్‌మార్క్ చెప్పడం చాలాకష్టం. రైలు ప్రమాదాల్లోనూ అంతే. ఇక కొత్తగా మారుమూల, పట్టణాలకు వచి్చన వారి పరిస్థితి అంతే. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే.. రోడ్డు ప్రమాద బాధితులను త్వరితగతిన ఆస్పత్రికి తరలించవచ్చని, తద్వారా ప్రాణ నష్టం తగ్గుతుందని పోలీసులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన (గోల్డె¯Œ అవర్)లో చికిత్స అందితే బాధితులను 90 శాతం కాపాడే అవకాశాలు మరింత పెరుగుతాయి. అంతేకాకుండా కిడ్నాపులు, ఇతర నేరాలు జరిగినప్పుడు ఘటనాస్థలం కనిపెట్టడం ఇకపై క్షణాల్లో పని అని అంటున్నారు పోలీసులు. -
100కి ఫోన్ చేసినందుకు... కానిస్టేబుల్ వీరంగం
సాక్షి, హైదరాబాద్: అల్లరిమూక గొడవపై డయల్ 100కి ఫోన్ చేసిన ఓ యువకుడిపై సైబరాబాద్ కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై బాధిత యువకుడి కుటుంబసభ్యులు డీజీపీ, సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. సంబంధిత కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వారికి హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. జీడిమెట్ల హెచ్ఏఎల్ కాలనీలో అల్లరిమూక గొడవపై సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఓ వ్యక్తి డయల్ 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో జీడిమెట్ల కానిస్టేబుల్ కాటేశ్వరరావు కాలనీకి వచ్చి అల్లరిమూకను చెదరగొట్టాడు. ఆ తర్వాత డయల్ 100కి ఫిర్యాదు చేసిన అతడిని ఫోన్ చేసి ఇంటి నుంచి బయటకు పిలిచిన కానిస్టేబుల్ .. ‘అర్థరాత్రి పూట నా నిద్ర ఎందుకు చెడగొట్టావురా? ఎవరు కొట్టుకుని చస్తే నీకెందుకురా?’ అంటూ బూతు పురాణం అందుకున్నాడు. అంతకాకుండా రెండు చెంపలు వాయించి, తిడుతూ జీపులో జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. కుటుంబసభ్యులతో మాట్లాడనివ్వకుండా యువకుడి ఫోన్‌ను కాసిస్టేబుల్ లాక్కున్నాడు. మరోవైపు యువకుడు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనతో అరగంటపాటు కాలనీ అంతా గాలించారు. అయితే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాక ఆ యువకుడు మీడియా సంస్థ ఉద్యోగి అని తెలుసుకున్న కానిస్టేబుల్ తిరిగి ఇంటి వద్ద దిగబెట్టాడు. ఈ సంఘటనపై కుటుంసభ్యులు డీజీపీతో పాటు సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. డయల్ 100కి ఫోన్ చేస్తే.. ఇంటి నుంచి తీసుకెళ్లి మరీ ఎలా కొడతారంటూ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ వారికి హామీ ఇచ్చారు. -
డయల్ 100 112
సాక్షి, అమరావతి: ఆపదలో ఉన్న మహిళలను తక్షణమే రక్షించడానికి ఏర్పాటు చేసిన డయల్ 100, డయల్ 112 టోల్ ఫ్రీ నంబర్లను ఒకే గొడుగు కిందకు తేవాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈ రెండు నంబర్లకు ఇప్పటివరకు వేర్వేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఉన్నాయి. ఆపదలో ఉన్న మహిళలు ఈ రెండు నంబర్లకు ఒకేసారి ఫోన్ చేస్తే.. రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్ల పరిధిలో ఉన్న పోలీసులు అప్రమత్తమై రక్షిస్తున్నారు. అయితే.. వేర్వేరుగా ఉండటం వల్ల రెండు సెంటర్ల మధ్య సమన్వయలోపం తలెత్తుతోంది. అలా కాకుండా ఈ రెండు టోల్ ఫ్రీ నంబర్లకు కలిపి ఒకే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటే సమయం కలిసి రావడంతోపాటు సమన్వయలోపాన్ని నివారించవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం చొరవతో పోలీస్ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఈ విషయంపై మూడు రోజుల కిందట మంగళగిరిలో అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టత ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 100, 112కు ఎవరు ఫోన్ చేసినా ఒకే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వచ్చేలా చేయడంతోపాటు అందుకు అనుగుణమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించాలని ఆదేశించారు. కాగా, దిశ ఘటన జరిగాక ఈ రెండు నంబర్లకు ఫోన్ కాల్స్ బాగా పెరిగాయి. డయల్ 100 రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డయల్ 100కు నేరుగా ఫోన్ (వాయిస్ కాల్) చేసి సమస్యను వివరించాల్సి ఉంటుంది. ఈ నెంబర్‌కు రోజుకు 18 వేల నుంచి 20 వేల కాల్స్ వస్తున్నాయి. వీటిని స్వీకరించే కమాండ్ కంట్రోల్ సిబ్బంది ఆయా జిల్లాల ఎస్పీలకు సమాచారం అందిస్తారు. బాధితులకు తక్షణ సాయం అందించేలా చర్యలు చేపడతారు. డయల్ 112 కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో దేశమంతా నిర్వహిస్తున్న డయల్ 112కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు మహిళలు ఉన్న చోటు, ఫోన్ నెంబర్, చిరునామా అన్నీ నమోదవుతాయి. ఈ వివరాల ఆధారంగా కమాండ్ కంట్రోల్ సిబ్బంది తిరిగి ఫోన్ చేసి సమస్య అడిగి సమీపంలోని పోలీసులను అప్రమత్తం చేస్తారు. దీనికి రోజూ 3.50 లక్షల కాల్స్ వస్తున్నాయి. రాష్ట్రంలో శనివారం నాటికి 56,142 మంది ‘డయల్ 112 ఇండియా’ మొబైల్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్నారు. వీరిలో 32 వేల మంది మహిళలే ఉండటం విశేషం. ఫోన్లో నేరుగా 112కు సందేశం పంపడంతోపాటు యాప్ ద్వారా కూడా డయల్ చేయొచ్చు. ఈ రెండూ కలిపి.. ప్రస్తుతం వాయిస్, మిస్డ్ కాల్‌తోపాటు ఐడియా నెట్వర్క్ నుంచి మాత్రమే మెసేజ్ వెళ్లే వెసులుబాటు ఉంది. రానున్న రోజుల్లో ఆపదలో ఉన్నవారు అన్ని మొబైల్ నెట్‌వర్క్‌ల నుంచి మెసేజ్ ఇచ్చే అవకాశం కల్పించనున్నారు. అలాగే మిస్డ్‌కాల్ ఇస్తే చాలు ఆటోమేటిగ్గా జీపీఆర్ఎస్ అనుసంధానంతో ట్రాకింగ్ చేసేందుకు వీలుగా వారిని త్వరగా చేరుకునే ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా టోల్ ఫ్రీ నంబర్లకు వచ్చే ఫోన్ నుంచి మొబైల్ వీడియో ఆప్షన్ ఆన్ అయ్యి సుమారు 10 సెకండ్ల వీడియో చిత్రీకరణ జరిగేలా కూడా సాంకేతికంగా అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనివల్ల బాధితులకు తక్షణ సాయం అందించడంతోపాటు నేర స్థలంలో సాక్ష్యాలు, నేరస్తులను గుర్తుపట్టేందుకు వీలుంటుందని పోలీస్ శాఖ భావిస్తోంది. అన్ని సేవలకు ఒకే నంబర్ – డీజీపీ గౌతమ్ సవాంగ్ డయల్ 100, డయల్ 112 టోల్ ఫ్రీ నంబర్లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జీపీఎస్ సిస్టమ్ అమర్చిన 1500 పోలీస్ వాహనాలు బాధితులకు తక్షణ సాయం అందిస్తున్నాయి. రెండు టోల్ ఫ్రీ నంబర్లను ఒకే గొడుగు కిందకు తెస్తే మరింత బాగా సేవలు అందించవచ్చని గుర్తించాం. 100, 112లలో దేనికి ఫోన్ చేసినా ఒకే చోటకు కాల్ వచ్చేలా చేయడంతోపాటు వాటిని సాంకేతికంగా మరింత అభివృద్ది చేస్తాం. రానున్న రోజుల్లో అన్ని సేవలకు ఒకే నంబర్ ఉండేలా దశలవారీగా చర్యలు తీసుకుంటాం. -
సూసైడ్ నోట్ రాసి.. ఆటో డ్రైవర్ ఆత్మహత్య
సాక్షి, సంగారెడ్డి: భార్య తనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా అత్తింటివారు వేధిస్తున్నారనే మనస్థాపంతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. తమకు న్యాయం చేయాలని ఆటో డ్రైవర్ బంధువులు, కుటుంబీకులు పోలీస్‌స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఆందోళనకు దిగారు. సంగారెడ్డి టౌన్ సీఐ వెంకటేశ్ తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తాగుడుకు బానిసై.. జిల్లా కేంద్రంలోని నారాయణరెడ్డి కాలనీలో చాకలి నిరంజన్ (26) నివాసం ఉంటున్నాడు. ఇతను ఆరేళ్ల క్రితం అనురాధ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అప్పటికే పెళ్లయి ఆమెకు ఇద్దరు పిల్లలు గౌరీ, హనీలు ఉన్నారు. కొన్ని కారణాల వల్ల భర్తను వదిలేయడంతో ఆమెకు పరిచయం ఏర్పడిన నిరంజన్తోనే సహజీవనం చేస్తున్నది. వీరికి అమరేశ్వర్ మరో సంతానం ఉంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఆగ్రహించడంతో ఇతను సంగారెడ్డిలోనే వేరు కాపురం పెట్టి అనురాధతోనే ఆరేళ్లుగా కాపురం చేస్తున్నాడు. ఇతను ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆటో నడపడంతో వచ్చిన డబ్బులు చాలకపోవడం, సంసారంలో ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో కొంతకాలంగా తాగుడుకు బానిసయ్యాడు. పోలీసుల కౌన్సెలింగ్.. ఇతనిపై గతంలో దొంగతనం కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే భార్య అనురాధను వేధిస్తుండడంతో విసిగి చెందిన ఆమె డయల్ యువర్ 100కు ఈనెల 18న ఫోన్‌చేసింది. పోలీసులు నిరంజన్ను, అనురాధను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనురాధ తల్లి పుణ్యవతి, బావమరిది చందులు తరచూ ఇబ్బందులకు గురిచేస్తుండడం కూడా నిరంజన్ను బాధించాయి. దీంతో పాటుగా పోలీస్‌స్టేషన్‌లో నిరంజన్‌కు ఏఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇవ్వడం మనస్థాపానికి గురిచేసింది. ఇది అవమానంగా భావించిన నిరంజన్ గురువారం రాత్రి ఇంట్లోనే ఫ్యాన్ బిగించే ఉక్కుకు (రాడ్‌కు) చున్నీతో ఉరివేసుకున్నాడు. అప్పటికే అనురాధ పిల్లలను తీసుకొని జిల్లా కేంద్రంలోనే ఉంటున్న పుట్టింటికి వెళ్లింది. ఉదయం లేవకపోవడంతో ఇరుగుపొరుగు వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెళ్లి చూసేసరికి మృతి చెంది ఉండడం గమనించారు. నిరంజన్ మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టు నిర్వహించారు. బంధువుల ఆందోళన.. నిరంజన్ మృతి వార్త తెలుసుకున్న కుటుంబీకులు, బంధువులు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రానికి తరలివచ్చారు. నిరంజన్ మృతి అనుమానాస్పదంగా ఉందని ఆరోపిస్తూ వారు స్థానిక టౌన్ పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. మాకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు. మృతుడు నిరంజన్ సోదరి సోని, తల్లి స్వరూప, బావ శేఖర్, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు విలేకరులతో మాట్లాడుతూ..నిరంజన్ మృతి అనుమానాస్పదంగా ఉందని తెలిపారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు. కౌన్సెలింగ్ ఇచ్చిన మాట వాస్తవమే.. ఈనెల 18న నిరంజన్ భార్య అనురాధ డయల్ 100కు కాల్ చేయడంతో అతన్ని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చిన మాట వాస్తవమే. ఆటో నడుపుతూ మద్యానికి బానిసయ్యాడు. గతంలో ఇతనిపై దొంగతనం కేసులు ఉన్నాయి. భార్యను వేధించడంతో ముగ్గురు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిరంజన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. – వెంకటేశ్, టౌన్ సీఐ -
ప్రాణాలు కాపాడిన ‘డయల్ 100’
సాక్షి, ఖమ్మం : డయల్–100కు వచ్చిన ఫోన్ కాల్‌కు స్పందించి ఓ వ్యక్తి ప్రాణాలను త్రీటౌన్ బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ పాషా కాపాడి..శెభాష్ అనిపించుకున్నారు. మంగళవారం త్రీటౌన్ పరిధిలోని బొక్కల గడ్డ ప్రాంతానికి చెందిన కొత్తపల్లి మల్లయ్య తన భార్యతో గొడవపడి మనస్తాపానికి గురై ఇంటినుంచి వెళ్లిపోయాడు. తర్వాత రైలు కింద పడి ఆత్మహత్యచేసుకోబుతున్నానని భార్యకు ఫోన్ చేసి..వెంటనే కట్ చేశాడు. దీంతో అప్రమత్తమైన ఆమె.. డయల్–100కు ఫోన్ చేసి ఈ విషయాలన్నీ వివరించింది. త్రీటౌన్ సీఐ శ్రీధర్ సత్వరమే స్పందించి.. ఆ వ్యక్తి ఉన్న లోకేషన్ ఆధారంగా సారధినగర్ రైల్వేట్రాక్ సమీపంలో ఉన్నట్లు గుర్తించి..బ్లూకోల్ట్స్ బృందాన్ని అప్రమత్తం చేశారు. కానిస్టేబుల్ పాషా లొకేషన్ మ్యాప్ ద్వారా కిలోమీటర్ దూరంలో ఉన్న ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే..మల్లయ్య రైల్వేట్రాక్‌పై పడుకునేందుకు ప్రయత్నిస్తుండగా..అడ్డుకున్నారు. ఆ సమయంలో రైలు రాకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా..మల్లయ్య ఆత్మహత్య చేసుకునేవాడని..పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా మల్లయ్య కుటుంబసభ్యులు త్రీటౌన్ సీఐ శ్రీధర్, బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ పాషాకు కృతజ్ఞతలు తెలిపారు. డయల్ 100 కాల్‌కు స్పందించి మనిషి ప్రాణాలు కాపడిన త్రీటౌన్ సీఐ, బ్లూకోల్ట్స్ టీమ్‌ను సీపీ తఫ్సీర్ ఇక్బాల్, అడిషనల్ డీసీపీ మురళీధర్, ఏసీపీ గణేష్ అభినందించారు. -
హయత్‌నగర్‌లో యువతి పట్ల అసభ్య ప్రవర్తన!
సాక్షి, హైదరాబాద్ : దిశ ఘటన ప్రకంపనలు కొనసాగుతున్న నేపథ్యంలోనే నగరంలోని హయత్‌నగర్‌లో ఓ అనుచిత ఘటన చోటుచేసుకుంది. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ కాలనీలో ఓ యువతి పట్ల యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. రాజేశ్ అనే యువకుడు వేధింపులకు పాల్పడుతూ.. అసభ్యంగా ప్రవర్తించడంతో బాధిత యువతి చురుగ్గా వ్యవహరించి.. డయల్ 100కు కాల్ చేసింది. పోలీసులు కూడా ఆమె కాల్‌కు తక్షణమే స్పందించారు. ఆమె పల్ల అసభ్యంగా ప్రవర్తించిన రాజేశ్‌ను అరెస్టు చేసి.. పోలీసు స్టేషన్‌కు తరలించారు. షాద్‌నగర్ శివార్లలో జరిగిన దిశ అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో మహిళలపై నేరాలు అరికట్టడంలో పోలీసుల వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దిశ ఘటనలోని నిందితులు ఎన్కౌంటర్ కావడంతో పోలీసులపై ఒకవైపు ప్రశంసల జల్లు, మరోవైపు విమర్శలు వస్తున్నాయి. మరోవైపు మహిళలపై నేరాలు జరగకుండా పోలీసులు ఇకముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ప్రశ్నలు సోషల్ మీడియా నుంచి, ప్రజల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆపద సమయంలో డయల్ 100కు కానీ, 112కు కానీ కాల్ చేయాలని, ప్రతి ఒక్కరూ హాక్-ఐ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని.. అనుకోని పరిస్థితులు ఎదురైతే పోలీసుల సహాయం తీసుకోవాలని పోలీసు శాఖ కోరుతోంది. -
శభాష్ పోలీస్.. ఏడు నిమిషాల్లోనే..
చిలకలగూడ : డయల్ 100కు సమాచారం అందిన ఏడు నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుకున్న పోలీసులు ఉరికి వేలాడుతున్న వ్యక్తిని సురక్షితంగా కాపాడిన సంఘటన చిలకలగూడ పరిధిలో చోటు చేసుకుంది. డీఐ సంజయ్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చిలకలగూడలో అక్బర్‌ఖాన్ (45) వహిదాబేగం దంపతులు నివాసం ఉంటున్నారు. అక్బర్‌ఖాన్ కార్పెంటర్‌గా పని చేసే వాడు. ఆర్థిక సమస్యల నేపథ్యంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం కూడా వారి మధ్య మరోమారు ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో ఉన్న అక్బర్ ఖాన్ వహీదా బేగంపై దాడి చేయడంతో ఆమె డయల్ 100కు సమాచారం అందించింది. దీంతో మనస్తాపానికిలోనైన అక్బర్‌ఖాన్ గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే అప్పటికే సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు క్షణాల్లో స్పందించారు. పెట్రోకార్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కిరణ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. తలుపులు కొట్టినా స్పందన లేకపోవడంతో కిటికీలో నుంచి చూడగా అక్బర్‌ఖాన్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో అప్రమత్తమైన కిరణ్‌కుమార్ గట్టిగా తన్నడంతో తలుపులు తెరుచుకున్నాయి. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అక్బర్‌ఖాన్‌ను కిందికి దించి ప్రాథమిక చికిత్స అందించాడు. అనంతరం అతడిని 108లో గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించడంతో కోలుకున్నాడు. ఓ వ్యక్తిప్రాణా లు కాపాడిన కానిస్టేబుల్ కిరణ్‌కుమార్‌తోపాటు తక్షణ మే స్పందించిన చిలకలగూడ డీఐ సంజయ్‌కుమార్‌ను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. ఏడు నిమిషాల్లోనే.. అక్బర్‌ఖాన్ తనపై దాడి చేస్తున్నాడని అతడి భార్య వహీదాబేగం గురువారం ఉదయం 12 గంటల 38 నిమిషాల 37 సెకెన్లకు డయల్ 100కు ఫిర్యాదు చేసింది. 1.14 నిమిషాల్లో కాల్‌ను యాక్సెప్ట్ చేసిన సిబ్బంది చిలకలగూడ పోలీసులకు సమాచారం అందించారు. 12 గంటల 45 నిమిషాల 26 సెకెన్లకు అంటే ఫిర్యాదు చేసిన ఏడు నిమిషాల్లోనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అత్మహత్యాయత్నానికి పాల్పడిన అక్బర్‌ఖాన్‌ను కాపాడారు. చిలకలగూడ డీఐ సంజయ్‌కుమార్, ఎస్ఐలు రాజశేఖర్, విజయేందర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కోలుకున్న అనంతరం అక్బర్ఖాన్తోపాటు అతని కుటుంబసభ్యులు, బంధువులకు అడ్మిట్ఎస్ఐ రవికుమార్ కౌన్సెలింగ్ ఇచ్చారు. -
నెట్ లేకున్నా ఎస్ఓఎస్..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర పోలీసు విభాగం హాక్–ఐలో కీలక మార్పు చేసింది. మొబైల్ డేటా అందుబాటులో లేని/ఆన్‌లో లేని సందర్భాల్లో ఎస్ఓఎస్ను సమర్థంగా వినియోగించుకునేలా డయల్–100కు అనుసంధానం చేసింది. ఈ అప్డేటెడ్ ఆండ్రాయిడ్ వెర్షన్ బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చిందని పోలీసు విభాగం పేర్కొంది. హాక్–ఐ యాప్ వినియోగాన్ని గణనీయంగా పెంచేందుకు పోలీసులు సోషల్ మీడియా, ఎస్ఎంఎస్లు, పలు క్యాబ్‌లపై ఉంటున్న ప్రకటన బోర్డుల్నీ వాడుతున్నారు. ఫలితంగా దీన్ని ప్రజలు భారీ సంఖ్యలో డౌన్లోడ్ చేసుకున్నారు. ఆఫ్‌లైన్‌లో ఇలా... బుధవారం నుంచి అందుబాటులోకొచ్చిన ఈ వెర్షన్ ప్రకారం.. మొబైల్ డేటా లేనప్పు డు బాధితులు ఎస్ఓఎస్ బటన్ నొక్కితే అది ఫోన్ కాల్‌గా మారి ‘డయల్–100’కు చేరుతుంది. అక్కడి సిబ్బంది సదరు బాధితురాలు/బాధితుడు ఉన్న ప్రాంతాన్ని తెలుసుకుంటారు. ప్రతి గస్తీ వాహనానికీ జీపీఎస్ ఉండటంతో ‘100’ సిబ్బందికి ఏ వాహనం ఏ ప్రాంతంలో ఉందో కంప్యూటర్ తెరపై కచ్చితంగా తెలుస్తుంది. దీంతో బాధితుడు ఉన్న ప్రాంతానికి సమీపంలో ఉన్న వాహనానికే నేరుగా ఆ ఫోన్‌కాల్‌ను డైవర్ట్ చేస్తారు. ఈ వ్యవహారం మొత్తం కొన్ని సెకన్ల వ్యవధిలో పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. -
7నిమిషాల్లో.. మీ ముందుంటాం
సాక్షి, హైదరాబాద్ : మూడు నిమిషాలు టైమిస్తే పని ముగించేస్తానంటూ పోలీసాఫీసర్ పాత్రలో ఓ హీరో చెప్పిన పాపులర్ డైలాగ్.. దీన్ని రాష్ట్ర పోలీసులు ఏడే ఏడు నిమిషాలు అంటున్నారు. పోలీసు సాయం అవసరమైన వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డయల్ 100కు ఎవరైనా ఫోన్ చేస్తే 7 నిమిషాల్లో చేరుకుంటున్నామంటున్నారు. బాధితులెవరైనా 100కు డయల్ చేస్తే మూడు నిమిషాల్లోనే వారికి తిరిగి కాల్ చేసి రెండే రెండు నిమిషాల్లో పోలీసులు చేరుకుంటున్నట్లు ఉన్నతాధికారులు చెప్పారు. శంషాబాద్‌లో దిశ హత్య ఘటన తర్వాత డయల్ 100కు కాల్స్ పెరిగాయి. సాధారణంగా రోజు వచ్చే కాల్స్ కంటే 2 నుంచి మూడువేల కాల్స్ అదనంగా వస్తున్నాయని పోలీసు అధికారులు వెల్లడించారు. పోలీ సులు ఘటనాస్థలానికి వచ్చే సమయంపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం స్పందించారు. డయల్ 100కు కాల్ వచ్చిన వెంటనే తాము స్పందిస్తున్నామని, దగ్గరలోని గస్తీ (పెట్రోలింగ్) వాహనాన్ని అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. కాల్ చేసిన వారి వద్దకు చేరుకునే మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఉంటే కాస్త ఆలస్యమవుతోందని చెప్పారు. ఇక జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ సమయం 10 నిమిషాలుగా ఉందని వెల్లడించారు. వాస్తవానికి నగరాల్లో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుంటున్న సమయం 7 నుంచి 10 నిమిషాలు ఉంటుండగా.. గ్రామాల్లో ఇది 10 నుంచి 12 నిమిషాలు ఉంటుంది. ఎక్కువ ఫోన్‌కాల్స్ వాటివే.. సాధారణంగా డయల్ 100 కంట్రోల్ రూమ్‌కు వచ్చే ఫోన్‌కాల్స్‌లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు సంబంధించినవేనని ఆ తర్వాతి స్థానంలో గొడవలు, అగ్నిప్రమాదాలు, ఈవ్‌టీజింగ్ ఇతర నేరాలు ఉంటున్నాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. జిల్లాలో ఈ సగటు 300 నుంచి 500 వరకు ఉండగా..నగరం, పట్టణాల్లో 900 నుంచి 3000 వరకు ఉందని వెల్లడించారు. ఒక రోజుకు వచ్చే మొత్తం కాల్స్‌లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల నుంచే దాదాపుగా సగభాగం ఉంటున్నట్లు తెలిపారు. జనవరి నుంచి ఇప్పటివరకు డయల్ 100కు 75లక్షలు పైగా కాల్స్ వచ్చినట్లు వెల్లడించారు. ధైర్యం కోల్పోవద్దు ఆపద ఎదురైనపుడు ఆడపిల్లలు, మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దని విమెన్‌సేఫ్టీ వింగ్ చీఫ్, ఐజీ స్వాతి లక్రా విజ్ఞప్తి చేశారు. ఎవరు వేధించినా, బెదిరించినా..వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని ఆమె సూచించారు. ఏదైనా ఉపద్రవం ముంచుకు వస్తుందని అనుమానం వచ్చినా, ఎవరైనా వెంటాడినా సరే వెంటనే హాక్ ఐ యాప్‌లోని ఎమర్జెన్సీ బటన్ని వినియోగించుకోవచ్చ న్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఎస్ఎమ్ఎస్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులతోపాటు, షీటీమ్స్ సిబ్బంది కూడా నిమిషాల్లో మీకు రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. – స్వాతి లక్రా, ఐజీ విమెన్‌సేఫ్టీ వింగ్ -
ఒక్క ఫోన్ కాల్.. నిమిషాలలో మీ వద్దకు..
సాక్షి, హైదరాబాద్ : ఎవరైనా ఆపదలో ఉన్నామని భావిస్తే, వెంటనే పోలీసుల సాయం తీసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసిన ఆయన.. ఏ క్షణంలో అయినా అభద్రతా భావం కలిగితే డయల్ 100ను సంప్రదించాలని కోరారు. పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ సమాచారం అందుకున్న 6 నుంచి 8 నిమిషాల్లోనే మీ ముందుకు వస్తుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో 122 పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతూ ఉంటాయని తెలిపారు. వెంటనే సాయం చేసేందుకు మీ ముందుకు వస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటారని ఆయన తెలిపారు. Dial 100 the moment you feel and threat or scare anytime anywhere. Police patrol car will reach you in 6 to 8 minutes, Hyderabad city police has 122 patrol cars for your immediate help. We are with you always. pic.twitter.com/xmJTHt1w5u — Anjani Kumar, IPS (@CPHydCity) November 29, 2019 -
‘డయల్ 100’ అదుర్స్!
సాక్షి,సిటీబ్యూరో: కంటి ముందు ప్రమాదం జరిగితే ఒకప్పుడు పోలీసులకు ఫోన్ చేయడానికి ఆలోచించే పరిస్థితి ఉండేది. వారు ఎప్పుడు వస్తారో? ఎలా ప్రవర్తిస్తారో? ఏం ప్రశ్నలు వేసి వేధిస్తారో? అనే భావన ప్రజల్లో ఉండేది. ఫ్రెండ్లీ పోలీసింగ్, జవాబుదారీతనం తదితర విధానాల తర్వాత పోలీసుల తీరు, స్పందనలో వచ్చిన మార్పుతో ప్రజల నుంచి సహకారం కూడా పెరుగుతోంది. గడిచిన రెండున్నర ఏళ్లుగా ‘డయల్–100’కు వస్తున్న ఫోన్‌కాల్సే ఇందుకు నిదర్శనమని అధికారులు చెబుతున్నారు. 2017లో ఈ వ్యవస్థకు మొత్తం 5.3 లక్షల ఫోన్లు కాగా.. ఈ ఏడాది ఆగస్టు నాటికే ఆ సంఖ్య 8.6 లక్షలకు చేరింది. అయితే నిత్యం ‘100’ వస్తున్న న్యూసెన్స్ కాల్స్ సంఖ్య 15 శాతం, ఎంక్వయిరీ కాల్స్ మరో 15 శాతం వరకు ఉంటున్నాయి. ప్రజల కోసం పనిచేసేలా.. పోలీసులు సర్వకాల సర్వావస్థల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి తీరు జనం మెచ్చేలా ఉండాలనే ఉద్దేశంతో పోలీసు విభాగం కొన్ని వ్యవస్థల్ని ఏర్పాటు చేసింది. అందులో ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’తో పాటు ‘100’ నెంబర్‌తో కంట్రోల్ రూమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘100’ విధానానికి మరింత సాంకేతిక పరిజ్ఞానం, పాదర్శకత, జవాబుదారీతనం జోడిస్తూ ఆరేళ్ళ క్రితం ‘డయల్–100’ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఫోన్‌కాల్‌ను రికార్డు చేసే ఇక్కడి సిబ్బంది ఆ సమస్య పరిష్కారమయ్యాకే దాన్ని క్లోజ్ చేస్తారు. ఈ విధానంపై అనునిత్యం ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంది. 2017లో హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ విధానం మరుసటి ఏడాది రాష్ట్రం మొత్తం విస్తరించింది. కంట్రోల్ రూమ్‌కు వచ్చే కాల్స్‌ను పోలీసు అధికారిక యాప్ ‘టీఎస్ కాప్’కు అనుసంధానించారు. ఫలితంగా ఓ కాల్ వచ్చిన తర్వాత ఎంత సేపటికి పోలీసులు స్పందించారు? ఆ సమస్యను ఎలా పరిష్కరించారు? తదితర అంశాలన్నీ పాదర్శకంగా అన్ని స్థాయిల అధికారులకు అందుబాటులో ఉండేలా చేశారు. ఫలితంగా పోలీసుల్లో జవాబుదారీతనం పెరిగి ప్రతి ‘డయల్–100’ కాల్‌ను సీరియస్‌గా తీసుకోవడం, పక్కాగా స్పందించడం మొదలెట్టారు. దీంతో ఈ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగి తమ దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్నీ పోలీసులకు తెలపడానికి ‘డయల్–100’ను వాడుకుంటున్నారు. 30 శాతం ఆ కోవకు చెందినవే.. ‘డయల్–100’కు రాష్ట్రం నలుమూలల నుంచి రోజూ వేల కాల్స్ వస్తుంటాయి. వీటిలో ఫోన్లలో బ్లాంక్ కాల్స్, న్యూసెన్స్ కాల్స్, అనవసర విషయాలతో ఇబ్బంది పెట్టే ఫోన్లూ అధికంగానే ఉంటున్నాయి. మొత్తం ఫోన్లలో 15 శాతం ఈ కోవకు చెందినవేనని పోలీసు అధికారులు చెబుతున్నారు. వేళకాని వేళల్లో మద్యం మత్తులో కొందరు చేసే ఫోన్లు కంట్రోల్ రూమ్‌లో ఉన్న సిబ్బంది సహనాన్ని పరీక్షిస్తుంటాయి. అయినప్పటికీ ఏ దశలోనూ సహనం కోల్పోకుండా వింటున్న పోలీసులు వారు చెప్పే వాటిలోనూ ఆసక్తికర అంశాలు ఉన్నాయా? అనేది పరిశీలిస్తుంటారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. న్యూసెన్స్ కాల్స్ చేసే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా.. అలా చేయకుండా వీలున్నంత వరకు వారికి సర్దిచెప్పడానికి, ఫోన్ ద్వారా కౌన్సిలింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా, పోలీసు అధికారిక వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చినా.. ఇప్పటికీ ఫలానా అధికారి ఫోన్ నెంబర్ కావాలనో, ఫలానా పోస్టులో ఏ అధికారి ఉన్నారనో, ఆ పోలీసుస్టేషన్ ఎక్కడనో తెలుసుకోవడానికి ‘డయల్–100’ ఫోన్లు చేస్తున్న వారు వందల సంఖ్యలోనే ఉంటున్నారు. కొందరైతే ఏకంగా సిటీ బస్సుల సమాచారం, చిరునామాలు కోరుతూ కాల్స్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారో, అక్కడ నుంచి వచ్చిన వారో ఇలాంటి కాల్స్ చేస్తే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నగరంలో నివసిస్తున్న విద్యాధికులు సైతం ఈ తరహాలో ఫోన్లు చేస్తుంటడం సిబ్బందికి తలనొప్పిగా మారింది. విచిత్ర వేధింపులూ ఎక్కువే.. కంట్రోల్ రూమ్‌లో పనిచేసే సిబ్బందికి కొన్ని సందర్భాల్లో వేధింపులూ తప్పట్లేదు. కొందరు ఫోన్లు చేసి పోలీసు విభాగంతో సంబంధంలేని అంశాలు అడుగుతుంటారు. సిబ్బంది నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తే దూషణలకు దిగుతూ అభ్యంతరకరంగా మాట్లాడుతుంటారు. కొందరు ఆకతాయిలైతే పదేపదే ఫోన్లు చేయడంతో పాటు ఏమీ మాట్లాడకుండా ఉండటమో, వెంటనే కట్ చేసేయడమో చేస్తుంటారు. వీటిని అధికారికంగా బ్లాంక్ కాల్స్‌గా పరిగణిస్తున్న సిబ్బంది పక్కన పెట్టేస్తున్నారు. అలాంటి నెంబర్లను బ్లాక్ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. భవిష్యత్‌లో వారికే ఏదైనా ఇబ్బంది ఎదురైతే వ్యవహారం ‘నాన్న పులి’ కథ మారదిగా మారుతుందనే ఉద్దేశంతో ‘డయల్–100’ సిబ్బంది ఉపేక్షిస్తున్నారు. తగ్గిన ‘బెదిరింపులు’ నగరంలో ఒకప్పుడు ఎక్కడపడితే అక్కడ కాయిన్ బాక్సులు ఉండేవి. వీటిని వినియోగించి ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఎక్కడకు ఫోన్లు చేస్తున్నారు? అనే అంశాలపై సరైన పర్యవేక్షణ ఉండేది కాదు. దీంతో వీటిని వినియోగించే ఆకతాయిలు ఫలానా చోట బాంబు ఉందనో, మరోటి జరుగుతోందనో పోలీసుల్ని పరుగులు పెట్టించేవారు. ఈ కాయిన్ బాక్సుల మాదిరిగానే ఆ తరహా కాల్స్ సైతం గణనీయంగా తగ్గిపోయాయి. సెల్‌ఫోన్, ల్యాండ్లైన్ల నుంచి ఇలాంటి కాల్స్ చేస్తే బాధ్యుల్ని తేలిగ్గా గుర్తించి చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుంది. దీంతో ఈ తరహా ఆకతాయిలు వెనుకడుగు వేస్తున్నారు. నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు కావడంతో ఉన్న కొన్ని కాయిన్ బాక్సుల్నీ ఈ తరహాలో ‘వినియోగించడానికి’ ఆకతాయిలు ధైర్యం చేయట్లేదు. పోలీసుల స్పందన, జవాబుదారీతనంలో వచ్చిన మార్పు ప్రజలు గమనిస్తున్నారు. ఫలితంగా సమాచారం ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రజల భద్రత కోసం ఏర్పాటైన ‘డయల్–100’ను వినియోగించుకోవడంతో ఎవరికి వారు బాధ్యతగా మెలగాలి. ఆకతాయిల వల్ల పని గంటలు వృధా అవుతున్నాయి. ఆ ప్రభావం నిజంగా ఆపదలో చిక్కుకున్న వారిపై పడుతోందని కంట్రోల్ రూమ్‌కు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. సిటీలో అందిన ఫోన్ కాల్స్ ఇవీ.. ♦ ఆగస్టు వరకు వచ్చిన కాల్స్ 1.8 లక్షలు ♦ బాడీలీ అఫెన్సులపై 22 శాతం ♦ సౌండ్ పొల్యూషన్‌పై 21 శాతం ♦ మహిళలపై నేరాలపై 13 శాతం ♦ రోడ్డు ప్రమాదాలపై 10 శాతం ♦ సొత్తు సంబంధ నేరాలపై 5 శాతం ♦ న్యూసెన్స్ తదితరాలు 29 శాతం రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ఫోన్ కాల్స్ సంఖ్య ఇలా.. ఏడాది కాల్స్ సంఖ్య 2017 5,34,967 2018 8,76,998 2019 (ఆగస్టు) 8,68,059 -
ప్రాణం కాపాడిన ‘100’
సాక్షి, సంగెం(వరంగల్) : రైలు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ప్రాణాన్ని పోలీసులు కాపాడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బెల్లంపల్లిలో ఉపవాస ప్రార్ధనలకు హాజరై తిరుగు ప్రయాణంలో ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సామర్లకోటకు చెందిన మణికంఠ తన భార్య రూపతో కలిసి సోమవారం రాత్రి వెళ్తున్నాడు. అయితే, మణికంఠ అర్థరాత్రి ప్రమాదవశాస్తు రైలు నుంచి జారిపడిపోయాడు. విజయవాడ వరకు రైలు ఎక్కడ ఆగదు. దీంతో ఆయన భార్య రూప వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి జరిగిన విషయం తెలియజేసింది. ఎక్కడ పడిపోయాడో తెలియకపోవడంతో సంగెం, గీసుకొండ, నెక్కొండ పోలీసుస్టేషన్లకు సమాచారం అందించారు. సంగెం పెట్రోలింగ్ సిబ్బంది జగదీష్‌కుమార్, కుమారస్వామి, రైల్వే సిబ్బంది సహకారంతో చింతలపల్లి ఎల్గూర్స్టేషన్ల మధ్య వెదికారు. రెండు గంటల పాటు శ్రమించి ఎల్గూర్‌రంగంపేట రైల్వే గేటుకు కిలోమీటరు దూరంలో రక్తపు మడుగులో పడిన ఉన్న మణికంఠను గుర్తించి 108కు సమాచారం అందించారు. స్ట్రేచర్‌పై ప్రధాన రహదారివరకు మోసుకుని వచ్చి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మణికంఠ భార్య రూపకు సమాచారం అందించడంతో ఆమె ఎంజీఎంకు చేరుకుంది. సరౖఝెన సమయంలో ఆస్పత్రికి చేర్చడం వల్ల నిండు ప్రాణం కాపాడిన సంగెం కానిస్టేబుళ్లు జగదీష్, కుమారస్వామిలను ఈస్ట్ జోన్ డీసీపీ కేఆర్ నాగరాజు, మామునూర్ ఏసీపీ శ్యాంసుందర్ అభినందించి రివార్డులు అందజేశారు. కాగా అత్యవసర సమయాల్లో డయల్ 100కు కాల్చేసి పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పోలీసు కమిషనర్ రవిందర్ కోరారు. -
అందేంత దూరంలోనే ‘వంద’
సాక్షి, హైదరాబాద్: దారిన వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే మనకెందుకులే అని వెళ్లిపోయే రోజులు పోయాయి. ఫోన్ చేసినా పోలీసులు స్పందిస్తారో లేదో అనే సందేహం గతంలో ఉండేది. కానీ టెక్నాలజీతో కూడిన పోలీసింగ్ రావడంతో క్షణాల్లో స్పందించడం, ఆ మేరకు కావాల్సిన సర్వీస్ వేగవంతం కావడం ఇప్పుడు ప్రజల్లో ఎనలేని నమ్మకాన్ని పెంచింది. ఒకప్పుడు డయల్ 100కు ఫోన్ చేయాలంటే బాధితులే సందిగ్ధం వ్యక్తం చేసేవారు. కానీ ఇప్పుడు థర్డ్ పార్టీ వ్యక్తులు కూడా డయల్ 100కు ఫోన్ చేసి ఘటనలపై సమాచారం అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఉన్న వారిని రక్షించడం నుంచి ప్రాపర్టీ నేరాల వరకు అన్నింటిపై క్షణాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. అటు పోలీస్ శాఖ నుంచి కూడా నిమిషాల్లోనే సేవలు అందుతుండటం డయల్ 100ను మరింత విస్తృతం చేసేందుకు ఉపయోగపడుతోంది. కేవలం 8నిమిషాల్లోనే... రాష్ట్రవ్యాప్తంగా డయల్ 100కు ఒక ఘటనపై ఫోన్ రాగానే పోలీసులు సంబంధిత స్థలానికి కేవలం 8నిమిషాల్లో చేరిపోతుండటం పోలీస్ శాఖను ప్రజలకు మరింత దగ్గర చేసిందనే చెప్పాలి. అత్యాధునిక పెట్రోలింగ్ వాహనాలు, అనేక విప్లవాత్మక యాప్స్ అందుబాటులోకి రావడంతో ఇది సులభమైంది. డయల్ 100కు వచ్చిన కాల్ మానిటరింగ్ చేయడంతో పాటు దగ్గర్లో ఉన్న పెట్రోలింగ్ వాహనం ఘటన స్థలికి వెళ్తుందా? లేదా అన్నది కూడా గమనించే వ్యవస్థ పోలీసులను నిమిషాల్లో బాధితుల దగ్గరకు వెళ్లేలా చేస్తోంది. ఇలా రాష్ట్రంలో గడిచిన ఏడాదిలో 8.5 లక్షల మంది డయల్ 100 ద్వారా పోలీస్ సేవలను వినియోగించుకున్నారు. రోడ్డు ప్రమాదాలు, పబ్లిక్ న్యూసెన్స్, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలు, మహిళలపై వేధింపులు, ఇతర నేరాలు, ప్రాపర్టీ నేరాలు, ఆత్మహత్యలు ఇలా మొత్తంగా 8.5లక్షల ఘటనలపై డయల్ 100కు ఫోన్ రావడం, పోలీసులు స్పందించడం జరిగింది. మహిళలపై వేధింపులే ఎక్కువ 2018 జనవరి నుంచి డిసెంబర్ చివరివరకు డయల్ 100కు రోడ్డు ప్రమాదాలపై 1.4లక్షల కాల్స్ వచ్చాయి. అదేవిధంగా పబ్లిక్ న్యూసెన్స్ కింద 346, గాయపరిచిన కేసుల్లో 1.8లక్షలు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై 8,936, సాధారణ న్యూసెన్స్ 1.4లక్షల కాల్స్‌వచ్చినట్టు పోలీస్ శాఖ రికార్డులు స్పష్టం చేశాయి. అదేవిధంగా మçహిళలపై వేధింపులకు సంబంధించినవి 2.1లక్షలు, ప్రాపర్టీ నేరాల్లో 28,402, ఆత్మహత్యలపై 24,611 కాల్స్ వచ్చినట్టు వెల్లడించారు. స్పందించే సమయం తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్తంగా డయల్ 100కు కాల్‌రాగానే పోలీసులు ఘటనా స్థలికి 8నిమిషాల్లో చేరుతున్నారు. ఇది పోలీస్ శాఖ సరాసరి సర్వీస్ డెలివరీ, రెస్పాన్స్ సమయం. అయితే ఇందులో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కేవలం 3నిమిషాల్లోనే పోలీస్ సేవలందుతున్నాయి. అదేవిధంగా సైబరాబాద్, రాచకొండలో 5నుంచి 6నిమిషాల్లో స్పందిస్తున్నారు. జిల్లాల్లోని కొన్ని రూరల్ ప్రాంతాల్లో రెస్పాన్స్ సమయం తగ్గించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల రూరల్ ప్రాంతాల్లోని స్టేషన్లకు రెండు బ్లూకోట్స్ పెట్రోలింగ్ బైక్‌లతోపాటు ఒక అత్యాధునిక పెట్రోలింగ్ కారును అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ వాహనాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించనున్నారు. దీని ద్వారా సంబంధిత వాహనాలు ఎక్కడ తిరుగుతున్నాయో జీపీఎస్ టెక్నాలజీ ద్వారా తెలిసిపోతుంది. -
హలో అనండి..పరిష్కారం పొందండి
ఒంగోలు: అసాంఘిక వ్యవహారాలు, అనుమానిత వ్యక్తుల కదలికలు, రోడ్డు ప్రమాదాలకు సంభందించిన లేక ఇతరత్రా ఏ అత్యవసర సమాచారం అయినా 100కు ఫోన్ చేస్తే సహాయం అందించేందుకు పోలీసు శాఖ సంసిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు అన్నారు. బుధవారం స్థానిక గెలాక్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో డయల్ 100 వాల్‌పోస్టర్‌ను ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు, పిల్లలపై వేధింపులు, దాడులు జరిగినా, రోడ్డు ప్రమాదాలు అలాగే ఏ ఇతర ప్రమాదాలు సంభవించినా, శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం అయ్యే పరిస్థితి ఉన్నా, పేకాట, వ్యభిచారం లాంటివి జరుగుతున్నా, గంజాయి విక్రయం/వినియోగం వంటి అసాంఘిక కార్యకలాపాలను గుర్తించినా, అనుమానిత వ్యక్తులు లేదా నేరస్తుల కదలికలను గుర్తించినా 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఫిర్యాదులపై పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోయినా, ఎటువంటి చర్యలు తీసుకోకపోయినా, సరిగ్గా స్పందించకపోయినా, మీ పట్ల దురుసుగా అమర్యాదకరంగా ప్రవర్తించినా, లంచం అడిగినా వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డయల్ 100కు వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
డయల్ –100కు 2,357 ఫిర్యాదులు
అనంతపురం సెంట్రల్ : సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన డయల్ –100కు జనవరిలో 2,357 ఫోన్‌కాల్స్ వచ్చాయని ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తున్నట్లు వివరించారు. బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
డయల్ 100 @ 2,566 కాల్స్
అనంతపురం సెంట్రల్ : ఆపదలు, సమస్యల్లో ఉన్న బాధితుల వద్దకే పోలీసులు వెళ్లి సత్వరమే పరిష్కారం చూపడం కోసం ఏర్పాటు చేసిన డయల్–100కు అక్టోబర్‌లో 2,566 కాల్స్ అందాయని జిల్లా ఎస్పీ ఎస్వి.రాజశేఖరబాబు తెలిపారు. డయల్ 100కు వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేస్తున్నారన్నారు. గత నెలలో ప్రతి రోజూ సగటున సుమారు 83 కాల్స్ వచ్చాయన్నారు. దాడులకు సంబంధించి 367, రోడ్డు ప్రమాదాలు 1134, చోరీలు 60, ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు 37, మహిళలకు సంబంధించినవి 188, అల్లర్లు 99, న్యూసెన్స్ 197, స్వతహాగా గాయపడినవి 168 తదితర సమస్యలు వచ్చినట్లు వివరించారు. ఇందులో 101 కేసులు కూడా నమోదు చేశారన్నారు. ఫిర్యాదు చేసిన బాధితులకు వందశాతం న్యాయం జరుగుతుందన్నారు. -
డయల్ 100కు 2351 కాల్స్
వివరాలు తెలిపిన రూరల్ ఎస్పీ కె. నారాయణ్‌నాయక్ పట్నంబజారు: గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో డయల్ 100కు మంచి స్పందన లభిస్తోందని రూరల్ ఎస్పీ కె. నారాయణ్‌నాయక్ చెప్పారు. ప్రజలు వారి సమస్యలపై ఫోన్ చేసిన తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవటంలో అధికారులు, సిబ్బంది పనితీరును అభినందించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గత సెప్టెంబరు నెలలో 2351 కాల్స్ వచ్చాయన్నారు. వాటిలో మనుషులపై దాడులకు సంబంధించి 451, స్త్రీలను ఇబ్బందులు, వేధింపులకు గురి చేసిన ఫోన్ కాల్స్ 221, రోడ్డు ప్రమదాలకు చెందినవి 901, ఆత్మహత్యకు చెందినవి 42, చోరీలకు సంబంధించి 29, ప్రజాశాంతికి భంగం ఇతర ఘర్షణలు, తగదాలు, గొడవలు, చిన్నపాటి వివాదాలకు చెందినవి 707 ఫోన్‌కాల్స్ వచ్చాయన్నారు. మొత్తం వచ్చిన2351 కాల్స్‌లో 48 కాల్స్ౖపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఆయా సబ్డివిజన్ల పరిధిలోని డీఎస్పీలతో పాటు, ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి సమన్వయంతో పనిచేయిస్తున్నామని తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే అధికారులు, సిబ్బందిని ఘటనా స్థలానికి పంపటంతో పాటు అక్కడి స్థితిగతులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. చిన్నపాటి కేసులను స్టేషన్ ఎస్‌హెచ్‌వోల ద్వారా అప్పటికప్పుడే పరిష్కరిచంటంతో పాటు, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామని వివరించారు. డయల్ 100కు తప్పుడు సమాచారం ఇచ్చినా, ఆకతాయి ఫోన్‌కాల్స్ చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. -
షీ టీమ్స్‌కు 2,220 ఫిర్యాదులు : సీపీ
షీ టీమ్స్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 2,220 ఫిర్యాదులు తమకు అందినట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. మహేందర్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. షీమ్స్ కు సోషల్ మీడియా ద్వారా, నేరుగా, ఇతరత్రా మీడియా ద్వారా ఎన్ని ఫిర్యాదులు అందాయో ఆయా కేసుల నమోదు గురించి చెప్పారు. ప్రత్యక్షంగా 378, ఈమెయిల్స్ ద్వారా 165, ఫేస్ బుక్ ద్వారా 320, వాట్సాప్ ద్వారా 162, డయల్ 110 ద్వారా అధికంగా 1157 ఫిర్యాదులు స్వీకరించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 712 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని సీపీ పేర్కొన్నారు. ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని, మరో 65 మందిపై నిర్భయ కేసులు పెట్టినట్లు మహేందర్ రెడ్డి వివరించారు. -
పోలీస్ వాట్సప్
కరీంనగర్ క్రైం: రోడ్డుపై వెళుతున్న మీ పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారా...? పోలీస్‌స్టేషన్‌కు వెళితే సిబ్బంది మిమ్ముల్ని ఇబ్బందులు పెడుతున్నారా...? మీ కాలనీలో అనుమానితులెవరైనా సంచరిస్తున్నారా...? ట్రాఫిక్ రద్దీగా క్రమబద్దీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులెవరు కన్పించడం లేదా...? మీరు చదువుకునే కాలేజీల్లో సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారా...? వీటికోసం మీరు ఇకపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులు వస్తారా? రారా? అని సందేహించాల్సిన పనిలేదు. మీ మొబైల్ ఫోన్లో ఆండ్రాయిడ్ వ్యవస్థ ఉంటే చాలు. జరుగుతున్న ఘటనను ఫొటో తీసి సంబంధిత సమాచారాన్ని వ్యాట్సప్కు పంపితే చాలు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించుకుని నేరాలను అరికట్టడమే కాకుం డా ప్రజలకు మరింత దగ్గరగా చేరువయ్యేం దుకు కరీంనగర్ జిల్లా పోలీస్ యంత్రాంగం నడుం బిగించింది. అందులో భాగంగా ఈ-రక్ష, ఈ-శోధన, ఈ-టెక్నాలజీ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న జిల్లా పోలీస్ బాస్ శివకుమార్ తాజాగా వాట్సప్ సేవలను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. అతి త్వరలో వాట్సప్ నెంబర్‌ను ప్రజల ముందుకు తీసుకురానున్నారు. వాట్సప్ సమాచారంపై ప్రత్యేక దృష్టి వాట్సప్ నంబర్‌కు వస్తున్న వివిధ రకాల చిత్రాలను, సమాచారాన్ని పర్యవేక్షించేందుకు ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. వాట్సప్ ద్వారా వచ్చిన సమాచారాన్ని 52 సీసీ టీవీల ద్వారా ఎప్పటికప్పుడు వీక్షించేందుకు సిబ్బందిని నియమిస్తారు. ఎక్కడినుంచి సమాచారం వచ్చిందో తెలుసుకుని అక్కడికి దగ్గర్లో ఉన్న అధికారులకు సమాచారం పంపిస్తారు. దీంతో కొద్ది నిమిషాల్లోనే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం డయల్ 100 వ్యవస్థ ఉన్నప్పటికీ అది హైదరాబాద్‌లోని కంట్రోల్ రూంలో ఉండటం, అక్కడినుంచి జిల్లాలకు వెళ్లడం, ఆ తరువాత సంబంధిత పోలీస్స్టేషన్ల కు వెళ్లడం వల్ల కొంత సమయం వృథా అవుతోంది. దీంతోపాటు పలువురు ఆకతాయిలు డయల్ 100కు తప్పుడు సమాచారం ఇస్తూ పోలీసులను పక్కదారి పట్టిస్తున్నారు. అట్లాకాకుండా వాట్సప్ నంబర్‌కు వచ్చే ఫొటోలు, సమాచారాన్ని చూసి వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. అనుమానితుల ఫొటోలను పోలీసు రికార్డులో ఉన్న వాటితో సరిపోల్చి చూసేందుకు వాట్సప్ చిత్రాలు ఉపయోగపడుతాయి. త్వరలో జిల్లా పోలీస్ శాఖ ఒక వాట్సప్ నంబర్‌ను ప్రకటించనున్నది. ప్రజలకు తేలిగ్గా గుర్తుండేందుకు ఫ్యాన్సీ నెంబర్‌కు ఎంపిక చేసే పనిలో పడింది. రెండు మూడు రోజుల్లో ఈ నెంబర్‌ను ప్రకటిస్తారు. టెక్నాలజీలో పరుగులు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఎస్పీ కార్యాలయం సోలార్ పవర్‌తో నడిపిస్తున్నారు. పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన సోలార్ సిస్టమ్స్ పనులు ప్రారంభించింది. ప్రస్తుతం ఎస్పీ కార్యాలయానికి కావాల్సిన విద్యుత్‌ను సోలార్ నుంచే తయారు చేస్తున్నారు. తెలంగాణలో ఈ ఏర్పాటున్న మొదటి ఎస్పీ కార్యాలయంగా స్థానం సంపాదించింది. ఇప్పటికే జిల్లా అంతాటా సీసీ కెమోరాల నిఘా ఏర్పాటు చేశారు. సిరిసిల్లను స్మార్ట్ పోలీస్ సిటీగా రూపొందించే కార్యక్రమాలు దాదాపు పూర్తవుతున్నాయి. వీటిలో పాటు జిల్లాలో మరో ఏడు ప్రధాన పట్టణాలను స్మార్ట్ పోలీస్ సిటీలుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీటికి సంబంధించిన పనులు కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. పోలీసు అధికారులకు ట్యాబ్ అందజేత, త్రినేత్ర, పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, రోడ్డు ప్రమాదాల కోసం ప్రత్యేక డ్రైవ్, ఈ-రక్ష, ఈ-శోధన, ఈ-టెక్నాలజీ పేరుతో పలు కార్యక్రమాలు రూపొందించి సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. -
శతకోటి సమస్యల్లో ‘డయల్-100’
ఉమ్మడి రాష్ట్రంలో జీవీకే(ఈఎంఆర్ఐ)తో నిర్వహణా ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుకు రూ.51 కోట్లు అవసరం రాజధాని తేలకుండా ఎక్కడ ఏర్పాటు చేయాలి? సాక్షి, హైదరాబాద్: ప్రజల నుంచి అందే ఫిర్యాదులపై తక్షణమే రంగంలోకి దిగేందుకు పోలీసు విభాగం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘డయల్ 100’ రాష్ట్ర విభజనతో సమస్యలను ఎదుర్కొంటోంది. ఫోన్ ద్వారా అందే ఫిర్యాదులను కంట్రోల్ రూం సంబంధిత పోలీస్ స్టేషన్‌కు చేరవేసి స్పందనను కూడా పర్యవేక్షించటం ‘డయల్ 100’ బాధ్యత. ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటయ్యే వరకు ‘108’ సేవల్ని అందిస్తున్న జీవీకే-ఈఎంఆర్ఐతో నిర్వహణా ఒప్పందం కుదిరింది. విభజన తరువాత హైదరాబాద్-సైబరాబాద్‌ల్లో డయల్ 100 వ్యవస్థను పటిష్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని పర్యవేక్షించే 108 వ్యవస్థ అంతా హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహణపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎవరి ఖర్చు ఎంత: గతేడాది ‘డయల్-100’ ప్రారంభించినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోని 1,681 పోలీస్స్టేషన్లను అనుసంధానించారు. ఫిర్యాదులపై రహస్యంగా విచారించాల్సి ఉన్నందున ‘డయల్ -100’ పర్యవేక్షణకు ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని నియమించారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నందున నిర్వహణ కింద ‘జీవీకే-ఈఎంఆర్ఐ’కి ఏటా నిర్ణీత మొత్తం చెల్లించేలా పోలీసు విభాగం ఒప్పందం చేసుకుంది. విభజన తరవాత దీని అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ‘డయల్-100’ వ్యవస్థను ఉమ్మడిగా వినియోగించుకోవాలంటే నిర్వహణా వ్యయంలో సగం చెల్లిస్తే సరిపోతుందని తొలుత చెప్పిన తెలంగాణ పోలీస్ అధికారులు అనంతరం మూలధన వ్యయంలోనూ సగం చెల్లించాలంటూ స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ఆధునీకరించాల్సి ఉండటంతో ఈ మొత్తం చెల్లించాలని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అధికారులు మాత్రం నెలకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. పోనీ తెలంగాణతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా డయల్ 100 ఏర్పాటు చేద్దామన్నా ‘రాజధాని’ సమస్యగా మారింది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఇందుకు రూ.35 కోట్లు అవసరం. ఇక మూలధన వ్యయం కింద మరో రూ.9 కోట్లు, నిర్వహణా వ్యయం కోసం మరో రూ.5 కోట్లు నుంచి రూ.7 కోట్లు తప్పనిసరి. ఇంత ఖర్చు పెట్టి ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పాలన్నా ఇంకా రాజధాని నగరం ఏదో తేలకపోవడంతో ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది సమస్యగా మారుతోంది. ఆగస్టు 15వ తేదీలోగా ఈ సమస్యను పరిష్కరించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.