నల్గొండ: అత్యాధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసులు ప్రజలకు వేగంగా సేవలు అందిస్తున్నారు. తాజాగా ఆత్మహత్య చేసుకోబోతున్న ఓ వ్యక్తిని నిమిషాల వ్యవధిలో కాపాడి శభాశ్ పోలీస్ అనిపించుకున్నారు. ఈ సంఘటన నల్గొండలో జరిగింది. ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారని స్పీడ్ డయల్ 100కు ఫోన్ రావడంతో వెంటనే పోలీసులు స్పందించారు. అయితే సమాచారం అందించిన వ్యక్తి మునుగోడు రోడ్డు అని మాత్రమే చెప్పారు. అయినా కూడా పోలీసులు అప్రమత్తమై గాలించి బలవన్మరణ యత్నం చేయాలనుకున్న వ్యక్తిని ప్రాణాలతో కాపాడారు.
విధి నిర్వహణలో భాగంగా సాగర్ రోడ్డులో ఉండగా మంగళవారం రాత్రి 9.44 నిమిషాలకి శంకర్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకోబోతున్నాడని 100కు సమాచారం వచ్చింది. వెంటనే స్పందించిన సిబ్బంది అతడి సమాచారం అడగ్గా తన లొకేషన్ మునుగోడు రోడ్డు అని మాత్రమే తెలిపాడు. ఆ తర్వాత తిరిగి ఆయనకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. అతడి గురించి సమాచారం తెలుసుకుని 4 నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకుని ఉరి వేసుకున్న శంకర్‌ను కాపాడారు. అయితే అప్పటికే ఉరి వేసుకోవడంతో స్తృహ తప్పాడు. వెంటనే ప్రథమ చికిత్స చేసి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. విధి నిర్వహణలో చురుగ్గా వ్యవహరించి వ్యక్తి ప్రాణాలను కాపాడిన డయల్ 100 సిబ్బంది సీహెచ్ సత్యనారాయణ, పీసీలు సురేశ్‌లను ఉన్నతాధికారులు అభినందించారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల పనితీరు మెరుగ్గా ఉండడంతో ప్రజలు అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment