ప్రతీకాత్మక చిత్రం
ఆపరేషన్ స్మైల్–6లో భాగంగా అనాథలు, వీధిబాలలు, రెస్టారెంట్లు, హోటళ్లు, పరిశ్రమల్లో పనిచేసే బాలకార్మికుల సమాచారాన్ని తమకు అందజేయాలని విమెన్‌సేఫ్టీ వింగ్ చీఫ్, ఐజీ స్వాతిలక్రా విజ్ఞప్తి చేశారు. అలాంటి చిన్నారులు ఎక్కడ కనిపించినా.. డయల్ 100, ఫేస్‌బుక్, హాక్‌ఐ, వాట్సాప్, 1098లకు సమాచారం అందించాలని కోరడంతోపాటుగా సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీనిచ్చారు.
వివిధ కారణాల వల్ల ఏటా వందలాది మంది చిన్నారులు వెట్టిచాకిరీలో బందీలుగా మారుతున్నారని, ఈ తరహా బాధిత చిన్నారులు కనిపించిన పోలీసులకు సమాచారం అందించాలన్నారు. జనవరి 1 నుంచి 31 వరకు జరగనున్న ఆపరేష న్ స్మైల్‌లో ప్రత్యేక బృందాలు రద్దీ ప్రాంతాల్లో చిన్నారులను కాపా డేందుకు రంగంలోకి దిగాయి. ఇప్పటి దాకా దాదాపు 900 మందికిపైగా చిన్నారులను కాపాడారు. వారిలో ముగ్గురిని దర్పణ్ యాప్ ద్వారా గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
సాక్షి, హైదరాబాద్ : వెట్టిచాకిరీలో మగ్గిపోతున్న చిట్టిచేతులను కాపాడాలని, వారి ముఖంలో చిరునవ్వును తిరిగి తేవాలన్న సంకల్పంతో 2015లో చేపట్టిన ఆపరేషన్ స్మైల్– ముస్కాన్‌లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పటిదాకా తెలంగాణ పోలీసులు దాదాపు 32 వేలకుపైగా చిన్నారులను కాపాడారు. 15 వేలమందిని తిరిగివారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. 16 వేలమందిని వివిధ హోమ్స్‌కు తరలించారు. ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ పేరుతో చేప డుతున్న కార్యక్రమం రెండు నెలలపాటే జరుగుతుంది.
ఏడాది మొత్తం సాధ్యమేనా?
బాలకార్మికులు, వీధిబాలల రక్షణకు ఈ స్పెషల్ డ్రైవ్ ఏడాది మొత్తం చేపట్టాలని పోలీసుశాఖకు శిశు సంక్షేమ, లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి పలువురు నిపుణులు సూచనలు చేశారు. దీనికి డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఇదే సమయంలో జనవరి, జూలై రాగానే..పనులు చేయించుకునేవారంతా ఆ పిల్లలు దొరక్కుండా జాగ్రత్తపడుతున్నారు. అందుకే, ఏడాదిమొత్తం చేయాలని పలువురు కోరుతున్నారు. అయితే, మానవ వనరుల కొరత, ఇతర కారణాల వల్ల సాధ్యం కాకపోయినా..ఈసారి ఏడాది మొత్తం వెట్టిచాకిరీ, పిల్లల అక్రమ రవాణాపై నిఘా ఉంచాలని పోలీసులకు డీజీపీ సూచించారు. ఈ నేపథ్యంలో పిల్లలను తరలించే స్మగ్లర్లు, ఏజెంట్లు, యజమానులపై ఈసారి పీడీ యాక్టులు పెట్టాలన్న ఒత్తిడి సర్వత్రా వ్యక్తమవుతోంది.
వేధిస్తోన్న సదుపాయాల లేమి..!
స్మైల్ సందర్భంగా చేపట్టే ఆపరేషన్‌లో పోలీసులు వేలాదిమంది చిన్నారులను కాపాడుతుంటారు. వారందరికీ వివిధ హోమ్స్‌లలో ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇక్కడ చాలామందికి ఒకే చోట ఆశ్రయం కల్పించడం వల్ల సదుపాయాల సమస్య ఎదురవుతోంది. ఈసారి ప్రతీ పిల్లాడికి ఇచ్చే నగదును పెంచుతామని మహిళా శిశు సంక్షేమ శాఖ హామీనిచ్చింది. మరోవైపు ఇతర రాష్ట్రాల పిల్లలను కాపాడాక వారి సమస్యలు తెలుసుకునేందుకు భాష సమస్యగా మారుతోంది.
దుబాసీలు లేకపోవడం వల్ల బిహార్, గుజరాత్, ఒడిశా, అస్సాం నుంచి వస్తోన్న బాలల వివరాలు, చిరునామా కనుక్కోవడం చాలా క్లిష్టంగా మారుతోంది. పదేపదే పోలీసులకు దొరుకుతున్న బాలల్లో మార్పుకోసం సైకాలజిస్టును నియమించాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఈసారి భాష అనువాదానికి దుబాసీ, పిల్లల మానసికస్థితిని అంచనా వేసేందుకు సైకాలజిస్టుల నియామకం జరుగుతుందా లేదా అన్నది చూడాలి. ఏటేటా పట్టుబడుతున్న పిల్లల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment