సాక్షి, హైదరాబాద్ : మూడు నిమిషాలు టైమిస్తే పని ముగించేస్తానంటూ పోలీసాఫీసర్ పాత్రలో ఓ హీరో చెప్పిన పాపులర్ డైలాగ్.. దీన్ని రాష్ట్ర పోలీసులు ఏడే ఏడు నిమిషాలు అంటున్నారు. పోలీసు సాయం అవసరమైన వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డయల్ 100కు ఎవరైనా ఫోన్ చేస్తే 7 నిమిషాల్లో చేరుకుంటున్నామంటున్నారు. బాధితులెవరైనా 100కు డయల్ చేస్తే మూడు నిమిషాల్లోనే వారికి తిరిగి కాల్ చేసి రెండే రెండు నిమిషాల్లో పోలీసులు చేరుకుంటున్నట్లు ఉన్నతాధికారులు చెప్పారు.
శంషాబాద్‌లో దిశ హత్య ఘటన తర్వాత డయల్ 100కు కాల్స్ పెరిగాయి. సాధారణంగా రోజు వచ్చే కాల్స్ కంటే 2 నుంచి మూడువేల కాల్స్ అదనంగా వస్తున్నాయని పోలీసు అధికారులు వెల్లడించారు. పోలీ సులు ఘటనాస్థలానికి వచ్చే సమయంపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం స్పందించారు. డయల్ 100కు కాల్ వచ్చిన వెంటనే తాము స్పందిస్తున్నామని, దగ్గరలోని గస్తీ (పెట్రోలింగ్) వాహనాన్ని అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. కాల్ చేసిన వారి వద్దకు చేరుకునే మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఉంటే కాస్త ఆలస్యమవుతోందని చెప్పారు. ఇక జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ సమయం 10 నిమిషాలుగా ఉందని వెల్లడించారు. వాస్తవానికి నగరాల్లో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుంటున్న సమయం 7 నుంచి 10 నిమిషాలు ఉంటుండగా.. గ్రామాల్లో ఇది 10 నుంచి 12 నిమిషాలు ఉంటుంది.
ఎక్కువ ఫోన్‌కాల్స్ వాటివే..
సాధారణంగా డయల్ 100 కంట్రోల్ రూమ్‌కు వచ్చే ఫోన్‌కాల్స్‌లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు సంబంధించినవేనని ఆ తర్వాతి స్థానంలో గొడవలు, అగ్నిప్రమాదాలు, ఈవ్‌టీజింగ్ ఇతర నేరాలు ఉంటున్నాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. జిల్లాలో ఈ సగటు 300 నుంచి 500 వరకు ఉండగా..నగరం, పట్టణాల్లో 900 నుంచి 3000 వరకు ఉందని వెల్లడించారు. ఒక రోజుకు వచ్చే మొత్తం కాల్స్‌లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల నుంచే దాదాపుగా సగభాగం ఉంటున్నట్లు తెలిపారు. జనవరి నుంచి ఇప్పటివరకు డయల్ 100కు 75లక్షలు పైగా కాల్స్ వచ్చినట్లు వెల్లడించారు.
ధైర్యం కోల్పోవద్దు
ఆపద ఎదురైనపుడు ఆడపిల్లలు, మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దని విమెన్‌సేఫ్టీ వింగ్ చీఫ్, ఐజీ స్వాతి లక్రా విజ్ఞప్తి చేశారు. ఎవరు వేధించినా, బెదిరించినా..వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని ఆమె సూచించారు. ఏదైనా ఉపద్రవం ముంచుకు వస్తుందని అనుమానం వచ్చినా, ఎవరైనా వెంటాడినా సరే వెంటనే హాక్ ఐ యాప్‌లోని ఎమర్జెన్సీ బటన్‌ని వినియోగించుకోవచ్చ న్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులతోపాటు, షీటీమ్స్ సిబ్బంది కూడా నిమిషాల్లో మీకు రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
– స్వాతి లక్రా, ఐజీ విమెన్‌సేఫ్టీ వింగ్
Comments
Please login to add a commentAdd a comment