సార్‌.. నా భార్య పుట్టింటి నుంచి రావడం లేదు! | Different Phone Calls To 100 Number In Hyderabad | Sakshi
Sakshi News home page

సార్‌.. నా భార్య పుట్టింటి నుంచి రావడం లేదు!

Published Sun, Jun 6 2021 2:32 PM | Last Updated on Sun, Jun 6 2021 3:08 PM

Different Phone Calls To 100 Number In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ పోలీసులకు చుక్కలు చూపిస్తుంది. ఒకవైపు విధుల్లో పాల్గొంటూనే ఇంకోవైపు 100కు వచ్చే డయల్స్‌కు అటెండ్‌ చేస్తున్నారు. డయల్‌ 100కు వస్తున్న ఫోన్‌కాల్స్‌ డిఫరెంట్‌గా ఉంటుండటంతో పోలీసులు నవ్వాలో.. ఏడ్వాలో.. అర్థ కాని పరిస్థితి తలెత్తుతుంది. ఒకవేళ ఆ ఫోన్‌కాల్‌కు స్పందించకపోతే ఉన్నతాధికారులకు  ఫిర్యాదులు అందుతాయన్న భయంతో అవి చిత్రవిచిత్రమైన (టైంపాస్‌) కాల్స్‌ అయినప్పటికీ అటెండ్‌ చేస్తున్నారు. డయల్‌ 100కు ప్రతిరోజు వెస్ట్‌జోన్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్ల నుంచి ఇలాంటి చిత్రవిచిత్రమైన కాల్స్‌ 40 నుంచి 50 వరకు వస్తున్నాయి.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ప్రతిరోజు 10 నుంచి 15 కాల్స్‌ ఇలాంటివి వస్తుండటంతో పోలీసులు తలపట్టుకుంటున్నారు. కుక్కపిల్ల తప్పిపోయిందని..బాయ్‌ఫ్రెండ్‌ మాట్లాడటం లేదని.. టైంపాస్‌ కావడం లేదని.. నీళ్లు రాకున్నా.. కరెంటు పోయినా.. చెత్త ఊడ్చకపోయినా.. ఇలా రకరకాల కారణాలతో ఫోన్లు చేస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉంటే పిచ్చెక్కిపోతున్నదంటూ... ఇంట్లో భర్త కొట్టాడంటూ.. మరికొందరకు 100కు కాల్‌ చేసి చెప్పుకొస్తున్నారు. పోలీసులు మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా తప్పనిసరిగా ఆయా ప్రాంతాలకు వెళ్లి బాధితులు చెప్పింది వింటున్నారు. ఒకవైపు చెక్‌పోస్ట్‌ల వద్ద ట్రాఫిక్‌ నియంత్రణ చేస్తూనే ఇంకోవైపు ఈ కాల్స్‌ను కూడా అటెండ్‌ చేస్తున్నారు. 

మిస్సింగ్‌లతోనూ సతమతం... 
ఒకవైపు లాక్‌డౌన్‌ అమలవుతుండగా ప్రేమ జంటలు మిస్సింగ్‌ అవుతుండటంతో యువతుల తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నెలరోజుల వ్యవధిలో ప్రేమ పేరుతో ఆరు మంది యువతులు మిస్సయ్యారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నెల రోజుల వ్యవధిలో ఇద్దరు వివాహిత మహిళలు, నలుగురు యువతులు అదృశ్యమయ్యారు. పోలీసులకు ఈ మిస్సింగ్‌ కేసులు కత్తిమీద సాములా మారుతున్నాయి. ఇలాంటి కేసులను చేధించే క్రమంలో పోలీసులకు ఎదురవుతున్న అనుభవాలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. 

పుట్టింటి నుంచి భార్య రావడంలేదంటూ.. 
సార్‌.. నేను మెకానిక్‌ను.. సయ్యద్‌నగర్‌లో ఉంటాను.. నా భార్య వారం రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. రమ్మంటే రావడం లేదు.. నేనింకో పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను.. నా భార్యతో విడాకులు ఇప్పించి.. ఆ కాగితం ఇస్తే రెండో పెళ్లి చేసుకుంటాను అని గత గురువారం రాత్రి 100కు వెంకటేష్‌ అనే మెకానిక్‌ డయల్‌ చేశాడు. వెంటనే ఆ సమాచారాన్ని బంజారాహిల్స్‌ పోలీసులకు కనెక్ట్‌ చేశారు. వెంకటేష్‌ అడ్రస్‌ పట్టుకొని అక్కడికి వెళ్లిన పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి సర్దిచెప్పారు. 

బాయ్‌ఫ్రెండ్‌ కోసం... 
సార్‌.. లాక్‌డౌన్‌ వల్ల నేను నా బాయ్‌ఫ్రెండ్‌ను కలవలేకపోతున్నాను.. మూడు రోజులుగా నా బాయ్‌ఫ్రెండ్‌ ఫోన్‌ చేయడం లేదు.. ఆయన ఫోన్‌ చేయకపోతే నేను చచ్చిపోయేలా ఉన్నాను.. దయచేసి నా బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడించండి.. మూడు రోజుల క్రితం బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌.12కు చెందిన ఓ యువతి 100కు డయల్‌ చేసి ఏడ్చింది. వెంటనే ఆ సమాచారాన్ని బంజారాహిల్స్‌ పోలీసులకు కనెక్ట్‌ చేశారు. ఆ యువతితో మాట్లాడిన పోలీసులు బాయ్‌ఫ్రెండ్‌ ఫోన్‌నెంబర్‌ తీసుకొని ఆయనతో మాట్లాడి వెంటనే నీ ప్రియురాలితో మాట్లాడని చెప్పారు. అరగంట తర్వాత ఆ యువతి పోలీసులకు ఫోన్‌ చేసి నా బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడించినందుకు థ్యాంక్స్‌ అంటూ ఫోన్‌ పెట్టేసింది. 

కుక్కపిల్ల కోసం.. కూతుళ్లు రాకపోవడంతో... 
సార్‌.. నా ఇద్దరు కూతుళ్లు వ్యాక్సిన్‌ వేసుకోవడానికి మాదాపూర్‌ వెళ్లారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో తిరిగి వస్తుండగా నోవాటెల్‌ హోటల్‌ వద్ద ఓ కుక్కపిల్ల ప్రమాదానికి గురై విలవిల్లాడుతుండటంతో నా కూతుళ్లు ఇద్దరూ చలించిపోయారు. ఆ కుక్కపిల్లను కాపాడేదాకా మేం ఇక్కడి నుంచి రామంటూ ఏడవడంతో ఆ మహిళ శుక్రవారం రాత్రి 100కు డయల్‌ చేసింది. తనకు పోలీస్‌ ఎస్కార్ట్‌ ఇస్తే నోవాటెల్‌ వద్దకు వెళ్లి ఆ కుక్కను కాపాడి నా ఇద్దరు కూతుళ్లను తీసుకొని వస్తానని చెప్పింది. ఆ సమాచారాన్ని బంజారాహిల్స్‌ పోలీసులకు కనెక్ట్‌ చేయగా ఆ మహిళతో మాట్లాడి లాక్‌డౌన్‌ సమయంలో అలా కుదరదని చెప్పారు. నా ఇద్దరు కూతుళ్లు రాకపోతే ఎవరు బాధ్యులని ఆమె ప్రశ్నించడంతో తప్పేది లేక పోలీసులు మాదాపూర్‌ పోలీసులతో మాట్లాడి ఆ కుక్కపిల్లను ఆస్పత్రికి పంపించి ఇద్దరు బాలికలను బంజారాహిల్స్‌కు తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. 

టైంపాస్‌ కావడం లేదంటూ... 
సార్‌.. లాక్‌డౌన్‌ వల్ల నాకు టైంపాస్‌ కావడం లేదు.. స్నేహితులతో మద్యం తాగితే టైంపాస్‌ అయ్యేది.. ఇప్పుడు కష్టంగా ఉందంటూ నాలుగు రోజుల క్రితం ఓ వ్యక్తి 100కు రాత్రంతా 20 సార్లు ఫోన్‌ చేసి విసిగించాడు. అయి నా సరే పోలీసులు ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని బంజారాహిల్స్‌ పోలీసులకు కనెక్ట్‌ చేస్తూ వచ్చారు. ఇక్కడి పోలీసులు ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి ఇది పద్ధతి కాదని కౌన్సెలింగ్‌ ఇచ్చారు. వాళ్లు వెళ్లిన ఐదు నిమిషాల్లోనే మళ్లీ 100కు ఆ వ్యక్తి డయల్‌ చేశాడు. అలా రాత్రంతా ఫోన్‌ చేస్తూనే ఉన్నాడు. ఇదేమిటంటే మ ద్యం తాగుతున్నప్పుడు పిచ్చాపాటి మాట్లాడుకోవడం నాకు అలవాటని చెప్పుకొచ్చాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement