సాక్షి, ముంబై: అత్యవసర సమయంలో పోలీసుల సాయం కోసం డయల్ చేయడానికి ఇదివరకు అందుబాటులో ఉన్న ఒకటి సున్నా సున్నా (100) అనే హెల్ప్‌లైన్ నంబరు త్వరలో 112 గా మారనుంది. గ్లోబల్ పొజీషనింగ్ సిస్టం (జీపీఎస్) ద్వారా పనిచేసే ఈ 112 నంబరు త్వరలో వినియోగంలోకి రానుంది. కొత్త నంబరు పని చేయడం ప్రారంభించగానే 100 నంబరును నిలిపివేయనున్నట్లు అదనపు పోలీసు కమిషనర్ జాలిందర్ సుపేకర్ వెల్లడించారు.
ఈ కొత్త నంబరును జీపీఎస్‌తో అనుసంధానించడం వల్ల సాయం కోసం ఫోన్ చేసిన బాధితుడి లొకేషన్ గుర్తించి, కొద్ది నిమిషాల్లోనే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుంటారని కమిషనర్ తెలియజేశారు. అంతేగాకుండా తప్పుడు కాల్, తప్పుడు సమాచారం అందించే వారి ప్రాంతాన్ని గుర్తించడం వల్ల పోలీసులు చర్యలు తీసుకునేందుకు ఈ ఆ«ధునిక ఎంతో దొహదపడనుంది.
ఫేక్ కాల్స్‌కు చెక్!
గత అనేక దశాబ్దాలుగా ఎంతో ప్రాచుర్యం పొందిన, అందరికి గుర్తుండే 100 నంబరు త్వరలో కనుమరుగుకానుంది. చోరీలు, హత్యలు, ఈవ్‌టీజింగ్, అస్యభకరంగా ప్రవర్తించడం ఇలా అనేక రకాల ఫిర్యాదులు ఈ నంబరుపై చేయాల్సి ఉంటుంది. వృద్దులు, పిల్లలు, మహిళలకు ఎలాంటి సాయం అవసరమైన త్వరలో అందుబాటులోకి రానున్న ఈ ఆధునిక హెల్ప్‌లైన్ నంబరును సంప్రదించాల్సి ఉంటుంది. ఎవరైన బాధితులు సాయం కోసం ఈ నంబరును సంప్రదిస్తే తొలుత ముంబై లేదా నాగ్‌పూర్‌లోని కాల్ సెంటర్‌కు వెళుతుంది. అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది బహుభాషీయులు కావడంతో ఫిర్యాదుదారుడికి భాషాపరమైన ఇబ్బందులు తలెత్తబోవని అదనపు పోలీసు కమిషనర్ జాలిందర్ సుపేకర్ అన్నారు.
త్వరలో అందుబాటులోకి రానున్న ఈ ఆధునిక హెల్ప్‌లైన్ నంబరును ఎలా రిసీవ్ చేసుకోవాలో పోలీసులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇదివరకు 100 నంబరుపై పోలీసులను ఆటపట్టించేందుకు లేదా ఫలాన రైలులో లేదా విమానంలో బాంబు ఉందని ఇలా అనేక తప్పుడు ఫోన్లు వచ్చేవి. దీంతో కాల్స్ నిజమా...? అబద్దమా...? తెలుసుకునేందుకు, ఆకతాయిలను అరెస్టు చేయడానికి పోలీసుల విలువైన సమయం చాలా వృథా అయ్యేది. కానీ, ఈ ఆ««ధునిక 112 నంబరును సంప్రదించిన వ్యక్తి ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాడో లోకేషన్ గురించి వెంటనే తెలిసిపోతుంది. ఒకవేళ అది తప్పుడు కాల్ అయితే పోలీసులు కొద్ది నిమిషాల్లోనే అక్కడి చేరుకుని దర్యాప్తు చేపడతారని కమిషనర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment