సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర పోలీసు విభాగం హాక్–ఐలో కీలక మార్పు చేసింది. మొబైల్ డేటా అందుబాటులో లేని/ఆన్‌లో లేని సందర్భాల్లో ఎస్‌ఓఎస్‌ను సమర్థంగా వినియోగించుకునేలా డయల్–100కు అనుసంధానం చేసింది. ఈ అప్‌డేటెడ్ ఆండ్రాయిడ్ వెర్షన్ బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చిందని పోలీసు విభాగం పేర్కొంది. హాక్–ఐ యాప్ వినియోగాన్ని గణనీయంగా పెంచేందుకు పోలీసులు సోషల్ మీడియా, ఎస్‌ఎంఎస్‌లు, పలు క్యాబ్‌లపై ఉంటున్న ప్రకటన బోర్డుల్నీ వాడుతున్నారు. ఫలితంగా దీన్ని ప్రజలు భారీ సంఖ్యలో డౌన్‌లోడ్ చేసుకున్నారు.
ఆఫ్‌లైన్‌లో ఇలా...
బుధవారం నుంచి అందుబాటులోకొచ్చిన ఈ వెర్షన్ ప్రకారం.. మొబైల్ డేటా లేనప్పు డు బాధితులు ఎస్‌ఓఎస్ బటన్ నొక్కితే అది ఫోన్ కాల్‌గా మారి ‘డయల్–100’కు చేరుతుంది. అక్కడి సిబ్బంది సదరు బాధితురాలు/బాధితుడు ఉన్న ప్రాంతాన్ని తెలుసుకుంటారు. ప్రతి గస్తీ వాహనానికీ జీపీఎస్ ఉండటంతో ‘100’ సిబ్బందికి ఏ వాహనం ఏ ప్రాంతంలో ఉందో కంప్యూటర్ తెరపై కచ్చితంగా తెలుస్తుంది. దీంతో బాధితుడు ఉన్న ప్రాంతానికి సమీపంలో ఉన్న వాహనానికే నేరుగా ఆ ఫోన్‌కాల్‌ను డైవర్ట్ చేస్తారు. ఈ వ్యవహారం మొత్తం కొన్ని సెకన్ల వ్యవధిలో పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment