రోజుకు 65,131.. గంటకు 2,713.. నిమిషానికి 45.. ఈ లెక్క ఏమిటో తెలుసా..? లాక్‌డౌన్ మొదలైన నాటి నుంచి శనివారం వరకు డయల్–100కు వచ్చిన ఫోన్‌కాల్స్ సరాసరి. వీటిలో 81.92 శాతం కేవలం టెక్నికల్ కాల్స్ అంటే ఆశ్చర్యం కలగక మానదు. లాక్‌డౌన్ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లు పిల్లల చేతికి చేరడం, కొత్తగా అందుబాటులోకి వచ్చిన సేవ్‌అవర్ సోల్ (ఎస్‌ఓఎస్) సదుపాయంతో కూడిన యాప్స్ కారణంగా వచ్చిన పరిస్థితి ఇది. గత నెల 23 నుంచి ఈ నెల 25 వరకు డయల్–100కు మొత్తం 22,79,618 ఫోన్ కాల్స్ వచ్చాయి. వీటిలో 18,67,536అనుకోకుండా వచ్చివే కావడం గమనార్హం. ఈ పరిస్థితికి కారణం ఏమిటంటే.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైననిర్ణయంతో పాటు కొన్ని రకాలైన యాప్స్ కారణంగా డయల్–100కు వచ్చే కాల్స్ సంఖ్య భారీగా ఉంటోంది.
సాక్షి, సిటీబ్యూరో: డయల్–100 పోలీస్‌కు సంబంధించినది కాగా.. 112 పోలీస్, ఫైర్, అంబులెన్స్ సర్వీసులకు కలిపి దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన నంబర్. తెలంగాణలో 112ను సైతం 100కు అనుసంధానించారు. స్మార్ట్ ఫోన్‌లో పవర్ బటన్‌ను మూడుసార్లు నొక్కితే అది 100 లేదా 112కు కాల్ వెళ్లేలా ఏర్పాటు చేయడం కచ్చితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ పవర్ బటన్ ప్రెస్ చేయడంతో పాటు కొన్ని రకాలైన ఎమర్జెన్సీ యాప్స్, అలెర్ట్ సిస్టమ్స్‌తో కూడిన యాప్స్ కారణంగా వీటి సంఖ్య పెరిగింది. ఈ తరహా యాప్స్ ఉన్న ఫోన్లకు భారీ కుదుపు వచ్చినా, గాల్లో నిర్ణీత విధానంలో తిప్పినా ఆ కాల్ డయల్–100కు వెళ్లిపోతోంది. చిన్నారులు వీడియో గేమ్స్ ఆడుతూ పవర్ బటన్‌ను అనేకసార్లు నొక్కడం చేస్తున్నారు. ఆ సమయంలో ఫోన్‌ను ఇష్టానుసారంగా వాడటంతో కాల్ 100కు వెళ్లిపోతోంది. ఇలా గణనీయంగా కాల్స్ పెరిగిపోతున్నాయి.
‘ప్రెస్–1’ విధానం అమల్లోకి..
అసంకల్పితంగా వచ్చే కాల్స్ వల్ల 100 కంట్రోల్ రూమ్‌లో ఉండే సిబ్బందిపై తీవ్ర పనిఒత్తిడి ఉంటోంది. దీన్ని అడ్డుకోవడానికి పోలీసు విభాగం ‘ప్రెస్–1’ విధానం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఎవరైనా డయల్–100కు కాల్ చేస్తే తొలుత ఆన్సర్ చేసే ఐవీఆర్‌ఎస్ (ఇంటర్యాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) ఒకటి బటన్ నొక్కమని చెప్తుంది. అలా చేసిన తర్వాతే ఆ కాల్ కంటిన్యూ అయ్యి అక్కడి సిబ్బందికి కనెక్ట్ అవుతుంది. అలా ప్రెస్ చేయకపోతే కొన్ని సెకన్లలోనే ఆ కాల్ కట్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్ మొదలైన తర్వాత ‘100’కు వచ్చిన మొత్తం 22,79,618 కాల్స్‌లో ‘ఒకటి నొక్కి’ సిబ్బందికి చేరిన వాటి సంఖ్య కేవలం 4,12,082గా ఉంది. ఇలా కనెక్ట్ అయిన వాటిలోనే అసంకల్పితంగా వచ్చిన కాల్స్ సంఖ్య వేలల్లో ఉంటోంది. ఈ నిర్ణీత కాలంలో ప్రెస్–1 తర్వాత డయల్–100 సిబ్బందికి కాల్ కలిసిన తర్వాత సైతం అనుకోకుండా ఫోన్ వచ్చింది అని పెట్టేసిన వారి సంఖ్య 8,262గా ఉంది. దీని ప్రకారం మొత్తం 22.9 లక్షల కాల్స్‌లో వాస్తవ కాల్స్ కేవలం 41,12,082 మాత్రమే అని డయల్–100 గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
తగ్గిన ‘బెదిరింపు’ కాల్స్..
డయల్–100కు ఒకప్పుడు బాంబు బెదిరింపు కాల్స్ బెడద ఎక్కువగా ఉండేది. ఆకతాయిలతో పాటు రైళ్లు, బస్సులు, విమానాలు వాటి నిర్ధేశిత సమయంలో బయలుదేరకుండా ఉండేందుకు, రద్దయ్యేందుకు ఈ కాల్స్ చేస్తుండేవాళ్లు.. వరుస సెలవులు, బంద్‌ల సమయంలో ఈ హోక్స్ కాల్స్ బెడద ఎక్కువగా ఉండేది. అయితే కాయిన్ బాక్సులతో పాటు ఈ కాల్స్ కూడా కనుమరుగయ్యాయి. నగరంలో ఒకప్పుడు ఎక్కడపడితే అక్కడ ఫోన్లు చేసుకోవడానికి ఉపకరించే కాయిన్ బాక్సులు ఉండేవి. దీంతో ఆకతాయిలు వాటి నుంచి ఫోన్లు చేసేవారు. ఈ కాయిన్ బాక్సుల మాదిరిగానే ఆ తరహా కాల్స్ సైతం ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయాయి.
పిల్లల చేతికి చేరడంతోనే..
డయల్–100కు అనవసర కాల్స్ పెరిగిపోవడానికి ప్రధాన కారణం చిన్నారుల చేతికి స్మార్ట్ ఫోన్లు చేరడమే. లాక్‌డౌన్ కారణంగా తల్లిదండ్రులు, పిల్లలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఫోన్లు పిల్లల చేతుల్లోకి వెళ్లిపోయాయి. గేమ్స్‌లో ముగినిపోయిన పిల్లలు ఈ ఎమర్జెన్సీ సర్వీసుకు కాల్ చేసేస్తున్నారు. కొందరు కాల్ వెళ్తున్న.. వెళ్లిన విషయం గమనించి వెంటనే కట్ చేస్తున్నారు. మరికొందరు ప్రెస్–1 నొక్కకపోవడంతో కాల్ కట్ అవుతోంది. తక్కువ సంఖ్యలో మాత్రం కాల్ కంట్రోల్ రూమ్ సిబ్బందికి చేరిన తర్వాత వాళ్లు ఏ సహాయం కావాలని అడుగుతుంటే మిన్నకుండిపోతున్నారు. ఈ కాల్స్‌ను డయల్–100 సిబ్బందే కట్ చేస్తున్నారు. – పోలీసు ఉన్నతాధికారి
Comments
Please login to add a commentAdd a comment