సాక్షి, హైదరాబాద్: దారిన వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే మనకెందుకులే అని వెళ్లిపోయే రోజులు పోయాయి. ఫోన్ చేసినా పోలీసులు స్పందిస్తారో లేదో అనే సందేహం గతంలో ఉండేది. కానీ టెక్నాలజీతో కూడిన పోలీసింగ్ రావడంతో క్షణాల్లో స్పందించడం, ఆ మేరకు కావాల్సిన సర్వీస్ వేగవంతం కావడం ఇప్పుడు ప్రజల్లో ఎనలేని నమ్మకాన్ని పెంచింది. ఒకప్పుడు డయల్ 100కు ఫోన్ చేయాలంటే బాధితులే సందిగ్ధం వ్యక్తం చేసేవారు. కానీ ఇప్పుడు థర్డ్ పార్టీ వ్యక్తులు కూడా డయల్ 100కు ఫోన్ చేసి ఘటనలపై సమాచారం అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఉన్న వారిని రక్షించడం నుంచి ప్రాపర్టీ నేరాల వరకు అన్నింటిపై క్షణాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. అటు పోలీస్ శాఖ నుంచి కూడా నిమిషాల్లోనే సేవలు అందుతుండటం డయల్ 100ను మరింత విస్తృతం చేసేందుకు ఉపయోగపడుతోంది.
కేవలం 8నిమిషాల్లోనే...
రాష్ట్రవ్యాప్తంగా డయల్ 100కు ఒక ఘటనపై ఫోన్ రాగానే పోలీసులు సంబంధిత స్థలానికి కేవలం 8నిమిషాల్లో చేరిపోతుండటం పోలీస్ శాఖను ప్రజలకు మరింత దగ్గర చేసిందనే చెప్పాలి. అత్యాధునిక పెట్రోలింగ్ వాహనాలు, అనేక విప్లవాత్మక యాప్స్ అందుబాటులోకి రావడంతో ఇది సులభమైంది. డయల్ 100కు వచ్చిన కాల్ మానిటరింగ్ చేయడంతో పాటు దగ్గర్లో ఉన్న పెట్రోలింగ్ వాహనం ఘటన స్థలికి వెళ్తుందా? లేదా అన్నది కూడా గమనించే వ్యవస్థ పోలీసులను నిమిషాల్లో బాధితుల దగ్గరకు వెళ్లేలా చేస్తోంది. ఇలా రాష్ట్రంలో గడిచిన ఏడాదిలో 8.5 లక్షల మంది డయల్ 100 ద్వారా పోలీస్ సేవలను వినియోగించుకున్నారు. రోడ్డు ప్రమాదాలు, పబ్లిక్ న్యూసెన్స్, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలు, మహిళలపై వేధింపులు, ఇతర నేరాలు, ప్రాపర్టీ నేరాలు, ఆత్మహత్యలు ఇలా మొత్తంగా 8.5లక్షల ఘటనలపై డయల్ 100కు ఫోన్ రావడం, పోలీసులు స్పందించడం జరిగింది.
మహిళలపై వేధింపులే ఎక్కువ
2018 జనవరి నుంచి డిసెంబర్ చివరివరకు డయల్ 100కు రోడ్డు ప్రమాదాలపై 1.4లక్షల కాల్స్ వచ్చాయి. అదేవిధంగా పబ్లిక్ న్యూసెన్స్ కింద 346, గాయపరిచిన కేసుల్లో 1.8లక్షలు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై 8,936, సాధారణ న్యూసెన్స్ 1.4లక్షల కాల్స్‌వచ్చినట్టు పోలీస్ శాఖ రికార్డులు స్పష్టం చేశాయి. అదేవిధంగా మçహిళలపై వేధింపులకు సంబంధించినవి 2.1లక్షలు, ప్రాపర్టీ నేరాల్లో 28,402, ఆత్మహత్యలపై 24,611 కాల్స్ వచ్చినట్టు వెల్లడించారు.
స్పందించే సమయం తగ్గించేందుకు
రాష్ట్రవ్యాప్తంగా డయల్ 100కు కాల్‌రాగానే పోలీసులు ఘటనా స్థలికి 8నిమిషాల్లో చేరుతున్నారు. ఇది పోలీస్ శాఖ సరాసరి సర్వీస్ డెలివరీ, రెస్పాన్స్ సమయం. అయితే ఇందులో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కేవలం 3నిమిషాల్లోనే పోలీస్ సేవలందుతున్నాయి. అదేవిధంగా సైబరాబాద్, రాచకొండలో 5నుంచి 6నిమిషాల్లో స్పందిస్తున్నారు. జిల్లాల్లోని కొన్ని రూరల్ ప్రాంతాల్లో రెస్పాన్స్ సమయం తగ్గించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల రూరల్ ప్రాంతాల్లోని స్టేషన్లకు రెండు బ్లూకోట్స్ పెట్రోలింగ్ బైక్‌లతోపాటు ఒక అత్యాధునిక పెట్రోలింగ్ కారును అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ వాహనాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించనున్నారు. దీని ద్వారా సంబంధిత వాహనాలు ఎక్కడ తిరుగుతున్నాయో జీపీఎస్ టెక్నాలజీ ద్వారా తెలిసిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment