ఇక.. ఈ–ఎస్సార్‌! | State police department has e-esrc policy making | Sakshi
Sakshi News home page

ఇక.. ఈ–ఎస్సార్‌!

Published Sat, Apr 13 2019 3:39 AM | Last Updated on Sat, Apr 13 2019 3:39 AM

State police department has e-esrc policy making - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సర్వీస్‌ రికార్డు... సంక్షిప్తంగా ఎస్సార్‌ అంటూ పిలిచే దీనికి పోలీసు విభాగంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఐపీఎస్‌లు కాని పోలీసు అధికారులు, కిందిస్థాయి సిబ్బందికి ఇది అత్యంత కీలకం. పరిపాలన విభాగం నిర్లక్ష్యంతో ఇందులో ఏర్పడే లోపాల కారణంగా కొందరైతే పదోన్నతుల్నీ కోల్పోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర పోలీసు విభాగం ఈ–ఎస్సార్‌ విధానానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌ కమిషనరేట్‌ సహా రాష్ట్రంలో 45 శాతం ఆన్‌లైన్‌ చేయడం పూర్తయింది.

త్వరలో పూర్తిస్థాయి డేటాబేస్‌ రూపొందించి టీఎస్‌ కాప్‌ యాప్‌ ద్వారా ప్రతి అధికారి, సిబ్బందికి దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) సహకారంతో వర్క్‌ ఫోర్స్‌ మేనేజ్‌మెంట్‌ పేరుతో ఈ–ఎస్సార్‌ను అమలు చేస్తున్నారు. గతంలో కోర్టు ఆదేశాలతో ఆఘమేఘాల మీద పోలీసు ఉన్నతాధికారులు చేపట్టిన ఇన్‌స్పెక్టర్‌ ఆపై స్థాయి అధికారుల పదోన్నతులు పరిపాలనా విభాగంలోని లోపాలను బట్టబయలు చేశాయి. అక్కడి క్లర్కులు చేస్తున్న అనేక పొరపాట్లు, నిర్లక్ష్యం కారణంగా ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులు డీఎస్పీ పదోన్నతుల కోసం అనేక వ్యయప్రయాసలకోర్చాల్సి వచ్చింది. మాన్యువల్‌ ఎస్సార్‌లో తలెత్తిన సమస్యల్ని సరిచేయించుకోవడం కోసం ఆయా అధికారులు డీజీపీ కార్యాలయం చుట్టూ కొన్ని వారాల పాటు ప్రదక్షిణలు చేశారు. 

మాన్యువల్‌తో ఇబ్బందులు..
సర్వీస్‌ రికార్డుల్ని మాన్యువల్‌గా నిర్వహిస్తుండటంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఓ అధికారి/సిబ్బందిపై వచ్చిన నెగెటివ్‌ అంశాలను వేగవంతంగా రికార్డులో పొందుపరుస్తున్న పరిపాలన విభాగం  పాజిటివ్‌ అంశాలను చేర్చట్లేదనే విమర్శలున్నాయి. పోలీస్‌ విభాగంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని, చిన్న తప్పుల్ని సైతం తీవ్రంగా పరిగ ణిస్తారు. బాధ్యులకు మెమోలు, చార్జ్‌మెమోలు, సాన్‌షూయ్, పోస్ట్‌పోన్‌ మెంట్‌ ఆఫ్‌ ఇంక్రిమెంట్‌ వంటి శిక్షలు వేస్తుంటారు. వాటి ఉత్తర్వుల్ని పరి పాలనా విభాగాలకు పంపి సర్వీసు రికార్డుల్లోకి ఎక్కేలా చర్యలు తీసుకుం టారు. కొన్నిశిక్షల్ని ఉపసంహరించినప్పుడు, కాలపరిమితి తీరిన తరు వాత ఆ వివరాలను సర్వీసు రికార్డుల్లో నమోదయ్యేలా చూస్తారు. అని వార్య కారణాల నేపథ్యంలో ప్రతికూల అంశాలను రికార్డుల్లో ఎక్కిం చినంత అనుకూలాంశాలు పొందుపర్చ ట్లేదనే ఆరోపణ ఉంది. 

పదోన్నతి కోల్పోయిన వారెందరో..
గతంలో జరిగిన ఇన్‌స్పెక్టర్‌ నుంచి డీఎస్పీ పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితాలో తనకంటే జూనియర్ల పేరు ఉండి, తన పేరు లేకపోవడాన్ని గమనించిన ఓ ఇన్‌స్పెక్టర్‌ ఆరా తీయగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ఈయనకు ఉన్నతాధికారులు చార్జ్‌మెమో ఇవ్వకుండానే ఆనవాయితీకి విరుద్ధంగా సాన్‌షూయ్‌ ఇచ్చారు. ఇది సర్వీసు రికార్డుల్లోకి ఎక్కింది. జరిగిన పొరపాటులో తన ప్రమేయం లేదని మొరపెట్టుకోగా... దాన్ని ఉపసంహరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీటిని సంబంధిత క్లర్కు నిర్లక్ష్యంగా వ్యవహరించి పోస్ట్‌ పోన్‌మెంట్‌ ఆఫ్‌ ఇంక్రిమెంట్‌గా సర్వీసు రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో రెండు శిక్షలు ఉన్నాయంటూ సదరు ఇన్‌స్పెక్టర్‌ పేరును అధికారులు సీనియారిటీ జాబితాలో చేర్చలేదు. మరో ఇన్‌స్పెక్టర్‌కు ఎదురైన ఇబ్బంది మరీ ఘోరంగా ఉంది.

ఈయనకు గతంలో సాన్‌షూయ్, పోస్ట్‌పోన్‌మెంట్‌ ఆఫ్‌ ఇంక్రిమెంట్‌ రెండూ సర్వీసు రికార్డుల్లోకి ఎక్కాయి. నిబంధనల ప్రకారం సాన్‌షూయ్‌ వచ్చిన ఏడాది వరకు, పోస్ట్‌పోన్‌మెంట్‌ వచ్చిన రెండేళ్ల వరకు ఆ అధికారికి పదోన్నతులు తదితరాలు వర్తించవు. ఒకే తేదీన ఈ రెంటినీ పొందిన సదరు ఇన్‌స్పెక్టర్‌ వాస్తవానికి రెండేళ్లలోనే రెంటి కాలపరిమితి పూర్తి చేసుకున్నారు. దీనికి విరుద్ధంగా మూడేళ్ల వరకు అర్హుడు కాదంటూ పరిపాలనా విభాగం సీనియారిటీ జాబితాలో పేరు చేర్చకపోవడంతో పదోన్నతి, సీనియారిటీ కోల్పోవాల్సి వచ్చింది. ఇలాంటి కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న అధికారులు కోకొల్లలుగా ఉంటారు. 

45 శాతం పూర్తి..
వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర పోలీసు విభాగం ఎస్సార్‌ను ఆన్‌లైన్‌ చేస్తూ ఈ–ఎస్సార్‌ ప్రవేశపెడుతోంది. హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 45 శాతం ఈ ప్రాజెక్టు పూర్తయింది. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక విరామం ఇచ్చినా త్వరలో పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఇకపై ప్రతి పోలీసు అధికారి/సిబ్బందికి సంబంధించిన సర్వీసు రికార్డులు అన్ని వేళల్లోనూ టీఎస్‌ కాప్‌లో అందుబాటులో ఉంటుంది. ఏవైనా లోపాలు ఉన్నట్లు గమనిస్తే కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన పని లేదు.

ఆ యాప్‌ ద్వారానే దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత సమయంలో సమస్య పరిష్కారమవుతుంది. అలా కానిపక్షంలో వీటిని పర్యవేక్షించే ఉన్నతాధికారులకు పరిపాలన విభాగం సిబ్బంది ఆ దరఖాస్తు ఎన్ని రోజులు పెండింగ్‌లో ఉంది? ఎందుకు ఉంచాల్సి వచ్చింది? తదితర వివరాలు ఎప్పటికప్పుడు చెప్పాల్సి ఉంటుంది. ‘భద్రత’పథకం కింద ఇచ్చే రుణాలు, ఇతర సౌకర్యాలు తదితరాలను కూడా ఆన్‌లైన్‌ ద్వారానే యాప్‌లోకి తీసుకువచ్చి పారదర్శకంగా చేయాలని రాష్ట్ర పోలీసు విభాగం నిర్ణయించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement