సాక్షి, అమరావతి: ఆపదలో ఆపన్న హస్తం అందించే ‘డయల్ 100’ వ్యవస్థను పోలీసు శాఖ మరింత బలోపేతం చేసి ప్రజల భద్రతకు గట్టి భరోసానిస్తోంది. అత్యవసర సేవలు అందించే ఈ వ్యవస్థను సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించి మెరుగ్గా తీర్చిదిద్దింది. అందుకోసం డయల్ 100, డయల్ 112 వ్యవస్థను సమ్మిళితం చేస్తోంది. రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి మరిన్ని అత్యవసర సేవలను డయల్ 100 పరిధిలోకి తెచ్చేలా కసరత్తు చేస్తోంది.
20 జిల్లాల్లో ఇప్పటికే ఏకీకృత వ్యవస్థ
అత్యవసర సర్వీసుల కోసం కేంద్ర ప్రభుత్వం డయల్ 112 వ్యవస్థను తెచ్చింది. చాలా రాష్ట్రాలు చాలా ఏళ్లుగా సొంతంగా నిర్వహిస్తున్న అత్యవసర సేవల వ్యవస్థలను దాదాపుగా తొలగించాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అత్యవసర సేవలు మరింత సమర్థంగా అందించేందుకు ఈ రెండు వ్యవస్థలను అందుబాటులో ఉంచింది.
అయితే డయల్ 100, డయల్ 112 కోసం రెండు వేర్వేరు కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు కాకుండా ఏకీకృత వ్యవస్థను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఈ రెండు వ్యవస్థలను సమ్మిళితం చేశారు. వైఎస్సార్, అన్నమయ్య, పల్నాడు, బాపట్ల, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వీటిని ఇంకా అనుసంధానించాల్సి ఉంది.
సత్ఫలితాలనిస్తున్న సమ్మిళితం
డయల్ 100, డయల్ 112ను అనుసంధానించడం సత్ఫలితాలనిస్తోంది. డయల్ 112 కాల్ సెంటర్‌కు 2020లో 7.55 లక్షల కాల్స్ రాగా వాటిలో చర్యలు తీసుకోదగ్గవి 6,162 ఉన్నాయి. వీటిపై పోలీసులు దర్యాప్తు జరిపి 196 కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇక 2021లో 9.67 లక్షల కాల్స్ రాగా చర్యలు తీసుకోదగ్గవి 10,292 ఉన్నాయి. వాటి ఆధారంగా 242 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
డయల్ 100కి సగటున రోజుకు ఐదు వేల కాల్స్ వచ్చాయి. 2022లో డయల్ 100, డయల్ 112 సమ్మిళిత ప్రక్రియ ప్రారంభమయ్యాక అత్యవసర సేవలు గణనీయంగా మెరుగయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 17.82 లక్షల కాల్స్ రాగా వాటిలో చర్యలు తీసుకోదగ్గ కాల్స్ 85,143 ఉన్నాయి. వీటిని బట్టి ఇప్పటివరకు 2,518 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం విశేషం. ప్రజల అత్యవసర కాల్స్‌పై పోలీసు శాఖ సత్వరం స్పందిస్తూ వేగంగా చర్యలు తీసుకుంటోందనడానికి ఈ గణాంకాలే తార్కాణం.
రాష్ట్ర కమాండ్ కంట్రోల్ నుంచే పర్యవేక్షణ
తాజాగా డయల్ 100ను రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానించారు. దీనికి వచ్చే కాల్ నేరుగా జిల్లా కేంద్రంలోని కార్యాలయంతోపాటు రాష్ట్ర కమాండ్ కంట్రోల్‌కు చేరుతుంది. కాల్స్‌పై సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని సిబ్బంది ఎంత త్వరగా స్పందించారో రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తారు. దీంతో పోలీసు వ్యవస్థలో మరింత జవాబుదారీతనం పెరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందనున్నాయి.
లొకేషన్ ట్రాకింగ్ వ్యవస్థ..
డయల్ 100లో కొత్తగా లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్‌ను పోలీసు శాఖ ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు ఎవరైనా అత్యవసర సర్వీసుకు కాల్ చేస్తే తాము ఎక్కడ ఉన్నారో చెప్పాల్సి వస్తోంది. గుర్తు తెలియని ప్రదేశాల్లో ఆపదలో చిక్కుకున్న వారికి ఇది సమస్యాత్మకంగా మారింది. పూర్తి వివరాలు వెల్లడించేందకు తగినంత సమయం లేని సందర్భాల్లో పోలీసులు అక్కడకు చేరుకోవడం సవాల్‌గా పరిణమించింది.
దీనికి పరిష్కారంగా కాలర్ లొకేషన్ ఆటోమేటిక్‌గా డయల్ 100 కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు తెలిసేలా సమాచార వ్యవస్థను ఆధునీకరించారు. దీంతో డయల్ 100కు కాల్ వచ్చిన కచ్చితమైన ప్రదేశానికి పోలీసులు సత్వరం చేరుకుని తగిన చర్యలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది.
డయల్ 100 పరిధిలోకి మరిన్ని సేవలు
డయల్ 100 వ్యవస్థను దశలవారీగా విస్తరించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. కేవలం పోలీసు సేవలే కాకుండా మరిన్ని సేవలను ఈ పరిధిలోకి తెస్తున్నారు.
డయల్ 100కు కాల్ చేసి అగ్నిమాపక సేవలు, అంబులెన్స్ లాంటి వైద్య సేవలు, రాష్ట్ర విపత్తు స్పందన బలగాలు (ఎస్‌డీఆర్‌ఎఫ్) మొదలైన సేవలను కూడా పొందే సౌలభ్యాన్ని త్వరలో కల్పించనున్నారు. దశలవారీగా దాదాపు 20 సేవలను డయల్ 100 పరిధిలోకి తెచ్చేందుకు పోలీసుశాఖ సన్నద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment