సాక్షి, హైదరాబాద్: అల్లరిమూక గొడవపై డయల్ 100కి ఫోన్ చేసిన ఓ యువకుడిపై సైబరాబాద్ కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై బాధిత యువకుడి కుటుంబసభ్యులు డీజీపీ, సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. సంబంధిత కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వారికి హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. జీడిమెట్ల హెచ్‌ఏఎల్ కాలనీలో అల్లరిమూక గొడవపై సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఓ వ్యక్తి డయల్ 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో జీడిమెట్ల కానిస్టేబుల్ కాటేశ్వరరావు కాలనీకి వచ్చి అల్లరిమూకను చెదరగొట్టాడు.
ఆ తర్వాత డయల్ 100కి ఫిర్యాదు చేసిన అతడిని ఫోన్ చేసి ఇంటి నుంచి బయటకు పిలిచిన కానిస్టేబుల్ .. ‘అర్థరాత్రి పూట నా నిద్ర ఎందుకు చెడగొట్టావురా? ఎవరు కొట్టుకుని చస్తే నీకెందుకురా?’ అంటూ బూతు పురాణం అందుకున్నాడు. అంతకాకుండా రెండు చెంపలు వాయించి, తిడుతూ జీపులో జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. కుటుంబసభ్యులతో మాట్లాడనివ్వకుండా యువకుడి ఫోన్‌ను కాసిస్టేబుల్ లాక్కున్నాడు. మరోవైపు యువకుడు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనతో అరగంటపాటు కాలనీ అంతా గాలించారు. అయితే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాక ఆ యువకుడు మీడియా సంస్థ ఉద్యోగి అని తెలుసుకున్న కానిస్టేబుల్ తిరిగి ఇంటి వద్ద దిగబెట్టాడు. ఈ సంఘటనపై కుటుంసభ్యులు డీజీపీతో పాటు సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. డయల్ 100కి ఫోన్ చేస్తే.. ఇంటి నుంచి తీసుకెళ్లి మరీ ఎలా కొడతారంటూ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ వారికి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment