
కానిస్టేబుల్ నాగమణి మర్డర్ నిందితుడికి రిమాండ్
పరమేశ్‌కు సహకరించిన మరో వ్యక్తి కోసం గాలింపు
వివరాలు వెల్లడించిన సీఐ సత్యనారాయణ
ఇబ్రహీంపట్నం: కులాంతర వివాహం చేసుకోవడంతో పాటు ఆస్తి కోసం బెదిరిస్తోందనే కారణంతో సొంత అక్కను చంపిన నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వివరాలను సీఐ సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కులాంతర వివాహం, ఆస్తి వ్యవహారంతోనే కానిస్టేబుల్ నాగమణిని ఆమె సొంత తమ్ముడు కొంగర పరమేశ్(26) హత్య చేశాడని పేర్కొన్నారు. నాగమణి కదలికలపై నిందితుడికి సమాచారం ఇచ్చిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. మృతురాలు నాగమణికి అక్క హైమావతి, తమ్ముడు పరమేశ్ ఉన్నారు.
2009లో అక్క వివాహం జరగ్గా ఆమె భర్తతో కలిసి తుర్కయంజాల్‌లో నివసిస్తోంది. పదేళ్ల క్రితమే తల్లిదండ్రులు చనిపోవడంతో నాగమణి, పరమేశ్ రాయపోల్‌లోని పెద్దనాన్న సంరక్షణలో పెరిగారు. 2014లో నాగమణికి పటేల్‌గూడ వాసితో వివాహం జరిగింది. ఈ సమయంలో పసుపుకుంకుమల కింద ఎకరా భూమి రాసిచ్చారు. అనంతరం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో నాగమణి అతన్ని వదిలేసి, రాయపోల్ వచ్చేసింది. హయత్‌నగర్‌లోని హాస్టల్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమైంది. ఈ క్రమంలో 2020లో కానిస్టేబుల్‌గా ఎంపికై కుషాయిగూడ, హయత్‌నగర్ పీఎస్‌లలో పనిచేసింది. 2022లో మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. రాయపోల్‌లో ఉన్నప్పుడే ఆ గ్రామానికి చెందిన బండారి శ్రీకాంత్‌తో ఉన్న పరిచయం ప్రేమగా మారింది.
విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించినా ఆమె వినలేదు. దీంతో మొదటి పెళ్లి జరిగిన సమయంలో ఆమెకు ఇచ్చిన ఎకరా భూమిని తిరిగి ఇచ్చేసింది. గత నెల 10న యాదగిరిగుట్టలో శ్రీకాంత్‌ను కులాంతర వివాహం చేసుకుంది. ల్యాబ్ టెక్నీషియన్, డ్రైవర్‌గా పనిచేసే శ్రీకాంత్‌తో కలిసి వనస్థలిపురం సహారా ఎస్టేట్స్‌లోని ఓ అద్దెంట్లో కాపు రం పెట్టారు. ఈ క్రమంలో తన ఎకరం తనకు తిరిగివ్వాలని తమ్ముడిని డిమాండ్ చేసింది. కులాంతర వివాహం చేసుకొని తమ పరువు తీయడమేగాకుండా, భూమి ఇవ్వాలని పేచీ పెడుతోందని పరమేశ్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
పథకం ప్రకారం ఓ కత్తి (కమ్మ కత్తి)కొని కారులో దాచిపెట్టి అవకాశం కోసం ఎదురుచూడసా గాడు. ఆదివారం భర్తతో కలిసి వచి్చందని తెలియడంతో హత్యకు సిద్ధమయ్యాడు. నాగమణి కదలికలను తెలిపేందుకు స్నేహితుడు అచ్చన శివను ఉపయోగించుకున్నాడు. సోమవారం ఉదయం స్కూటీపై విధులకు బయలుదేరిన విషయాన్ని శివ ఫోన్‌లో చేరవేశాడు. దీంతో పరమేశ్ కారులో ఆమెను వెంబడించాడు. మన్నె గూడ రోడ్డు జంక్షన్ వద్ద వెనకనుంచి ఢీకొట్టి, కిందపడగానే∙వెంటనే కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.
పోలీసులు మంగళవారం రాయపోల్ సమీపంలోని జనహర్ష వద్ద పరమేశ్‌ను పట్టుకున్నారు. అతని నుంచి కారుతోపాటు ఐ ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. ఇతనికి సహకరించిన శివ కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నారు.