రైలు నుంచి జారిపడిన మణికంఠ
సాక్షి, సంగెం(వరంగల్) : రైలు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ప్రాణాన్ని పోలీసులు కాపాడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బెల్లంపల్లిలో ఉపవాస ప్రార్ధనలకు హాజరై తిరుగు ప్రయాణంలో ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సామర్లకోటకు చెందిన మణికంఠ తన భార్య రూపతో కలిసి సోమవారం రాత్రి వెళ్తున్నాడు. అయితే, మణికంఠ అర్థరాత్రి ప్రమాదవశాస్తు రైలు నుంచి జారిపడిపోయాడు. విజయవాడ వరకు రైలు ఎక్కడ ఆగదు. దీంతో ఆయన భార్య రూప వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి జరిగిన విషయం తెలియజేసింది.
ఎక్కడ పడిపోయాడో తెలియకపోవడంతో సంగెం, గీసుకొండ, నెక్కొండ పోలీసుస్టేషన్లకు సమాచారం అందించారు. సంగెం పెట్రోలింగ్ సిబ్బంది జగదీష్‌కుమార్, కుమారస్వామి, రైల్వే సిబ్బంది సహకారంతో చింతలపల్లి ఎల్గూర్‌స్టేషన్ల మధ్య వెదికారు. రెండు గంటల పాటు శ్రమించి ఎల్గూర్‌రంగంపేట రైల్వే గేటుకు కిలోమీటరు దూరంలో రక్తపు మడుగులో పడిన ఉన్న మణికంఠను గుర్తించి 108కు సమాచారం అందించారు. స్ట్రేచర్‌పై ప్రధాన రహదారివరకు మోసుకుని వచ్చి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
అనంతరం మణికంఠ భార్య రూపకు సమాచారం అందించడంతో ఆమె ఎంజీఎంకు చేరుకుంది. సరౖఝెన సమయంలో ఆస్పత్రికి చేర్చడం వల్ల నిండు ప్రాణం కాపాడిన సంగెం కానిస్టేబుళ్లు జగదీష్, కుమారస్వామిలను ఈస్ట్ జోన్ డీసీపీ కేఆర్ నాగరాజు, మామునూర్ ఏసీపీ శ్యాంసుందర్ అభినందించి రివార్డులు అందజేశారు. కాగా అత్యవసర సమయాల్లో డయల్ 100కు కాల్‌చేసి పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పోలీసు కమిషనర్ రవిందర్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment