అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి | Suspicious Woman Suicide In Warangal District | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

Published Mon, May 7 2018 6:36 AM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM

Suspicious Woman Suicide In Warangal District - Sakshi

బొడిగె స్వరూప మృతదేహం

సంగెం : ఉరివేసుకుని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. అయితే తమ కుమార్తెను ఆమె భర్త హత్యచేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. మృతురాలి తల్లి సూరమ్మ, సోదరుడు అంజయ్య కథనం ప్రకారం.. వర్ధన్నపేట మండలం కట్య్రాలకు చెందిన చెంగాల సూరమ్మ, మల్లయ్య దంపతుల పెద్ద కుమార్తె స్వరూప(45)ను 30 ఏళ్ల క్రితం సంగెం మండలం షాపూర్‌కు చెందిన బొడిగె చిట్టిబాబుకు ఇచ్చి వివాహం చేశారు. కొన్నేళ్ల పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో కొంతకాలం తర్వాత కలతలు చోటు చేసుకున్నాయి. చిట్టిబాబు, స్వరూప దంపతులకు సంతానం లేదు.

ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుని శివనగర్‌లో కాపురముంటున్నాడు. దీంతో స్వరూప, చిట్టిబాబుకు మధ్య గొడవలు జరిగాయి. ఇటీవల స్వరూప తల్లిదండ్రులు రాసిచ్చిన భూమి విషయంలో కలతలు ఏర్పడ్డాయి. దీంతో ఉదయం స్వరూప వంటగదిలోని ఇనుప పైపునకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తమ కుమార్తెను భర్త చిట్టిబాబు హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు.

విషయం తెలుసుకున్న పర్వతగిరి సీఐ శ్రీదర్‌రావు, ఎస్సైలు దీపక్, కరుణాకర్‌రావు.. సిబ్బందితో వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు నిర్వహించారు. కాగా సాయంత్రం వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement