Sangem
-
CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవ సంకల్పయాత్ర.. భీమలింగానికి రేవంత్ ప్రత్యేక పూజలు
సాక్షి, వరంగల్: సంగెం నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర శుక్రవారం మధ్యాహ్నాం నుంచి ప్రారంభమైంది. భీమలింగం వరకు 2.5 కి.మీ మేర ఈ పాదయాత్ర కొనసాగింది. తొలుత యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చేరుకున్న సీఎం రేవంత్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైటీడీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. యాదాద్రి ఆలయంతో పాటు జిల్లా అభివృద్ధి పనులు, పెండింగ్ పనులపై చర్చించారు.అనంతరం వలిగొండ మండలం సంగెం గ్రామానికి చేరుకుని మూసీ పరీవాహక ప్రాంత రైతులతో కలిసి కాల్వల్ని పరిశీలించారు. తర్వాత రైతులు, కుల వృత్తిదారులతో సమావేశమై వారి యోగక్షేమాలు, మూసీ జలాలతో జరిగే నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. సంగెం-భీమలింగం-ధర్మారెడ్డిపల్లి కెనాల్ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు పాదయాత్ర కొనసాగింది. మూసీలో నీటి కాలుష్యాన్ని రేవంత్‌రెడ్డి పరిశీలించారు. భీమలింగంకు సీఎం పూజలు చేశారు. నాగిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసే సభలో సీఎం ప్రసంగించారు. అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్నారు. -
కైటెక్స్ వాస్తు కోసం భూ సర్వే
గీసుకొండ: ఓ కంపెనీ అడిగిన మేర ప్రభుత్వం భూములు కట్టబెడుతున్న వైనం వివాదాస్పదమవుతోంది. వరంగల్ జిల్లాలోని గీసుకొండ– సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు(కేఎంటీపీ)లో చిన్న పిల్లల గార్మెంట్లు తయారీకి కేరళకు చెందిన కైటెక్స్ కంపెనీని నెలకొల్పుతున్నారు. ఇప్పటికే పార్కులో కంపెనీకి 187 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. షెడ్ల నిర్మాణం జరుగుతుండగా ప్రహరీ గోడ వంకరగా ఉందని, వాస్తు సవరించుకోవడానికి మరో 13.29 ఎకరాలు కావాలని కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు సమ్మతించిన రెవెన్యూ యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో శాయంపేటహవేలి పరిధిలో కేటాయించేందుకు రైతులకు నోటీసులు జారీ చేశారు. శనివారం ఉదయం అధికారులు సర్వేకు రాగా పోలీసులు రైతుల చేలవద్ద మొహరించారు. పోలీసులు, రెవెన్యూవర్గాలపై రైతుల ఆగ్రహం ఈ క్రమంలో పోలీసులు, రెవెన్యూ అధికారులపై రైతులు మండిపడ్డారు. సర్వేను నిలిపివేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. పలువురు మహిళా రైతులు క్రిమిసంహారక మందు డబ్బాలను పట్టుకుని నిరసన తెలపగా వారిని పోలీసులు నివారించారు. ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు సంగెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత రెవెన్యూ సిబ్బంది సర్వే పనులను కొనసాగించారు. ‘‘ఎకరా రూ.50లక్షలుంటే మాకు పది లక్షలే ఇచ్చారు’’ కేఎంటీపీ కోసం కొంత భూమిని ఇప్పటికే ఇచ్చామని, ఎకరానికి రూ.10 లక్షల చొప్పున చెల్లించిన ప్రభుత్వం ప్రతి ఎకరానికి వంద గజాల ఇంటి స్థలం, పార్కులో ఉద్యోగం ఇప్పిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదని రైతులు వాదిస్తున్నారు. తమ దగ్గర కారుచౌకగా భూములను తీసుకుని కంపెనీలకు ఐదారు రెట్ల ధరలకు అమ్ముతోందని ఆరోపిస్తున్నారు. సారవంతమైన రెండు పంటలు పండే నీటి వసతి ఉన్న తమ భూములకు ఎకరానికి సుమారు రూ.50లక్షల మేర మార్కెట్ ధర ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చే ధర తమకు సమ్మతం కాదన్నారు. -
2019లో ‘ఉత్తమ’ అధికారి అవార్డు.. ఏసీబీ వలలో సంగెం తహసీల్దార్
ఆయన ప్రభుత్వం గుర్తించిన ఉత్తమ అధికారి. పైసా లేనిదే పనిచేయడనే విమర్శలున్నాయి. పనిచేసిన చోటల్లా పైత్యం చూపినట్లు సçహోద్యోగులు చెబుతున్నారు. ఎట్టకేలకూ పాపం పండింది. ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సాక్షి, వరంగల్: రెవెన్యూ శాఖలో అవినీతి తిమింగళాన్ని ఏసీబీ అధికారులు పక్కాగా వల పన్ని పట్టుకున్నారు. సంగెం తహసీల్దార్ నరిమేటి రాజేంద్రనాథ్‌ను శుక్రవారం ఉదయం 10 గంటలకు హంటర్‌రోడ్డు నందిహిల్స్‌లోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. సంగెం మండల పరిధి కాపులకనిపర్తిలోని వ్యవసాయ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ వ్యవహారంలో సంబంధిత రైతును నాలుగు నెలలుగా తహసీల్దార్ ఇబ్బందికి గురిచేస్తున్నాడు. ఈక్రమంలో బాధిత రైతు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులను అశ్రయించాడు. పక్కా పథకం ప్రకారం.. ఏసీబీ అధికారులు తహసీల్దార్ రాజేంద్రనా«థ్‌ను పట్టుకున్నారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ వై.హరీశ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కాపులకనిపర్తిలో చింతనెక్కొండకు చెందిన నల్లెపు కుమార్‌కు మూడెకరాల భూమి ఉంది. అందులో నుంచి తన చెల్లెలికి ఎకరం భూమిని గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్నాడు. కానీ తహసీల్దార్ రాజేంద్రనాథ్ రిజిస్ట్రేషన్ చేయకుండా.. నాలుగు నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. హనుమకొండలోని రాజేంద్రనాథ్ నివాసం ఈక్రమంలో రైతు ఈనెల 2న తహసీల్దార్ అడిగిన రూ.50 వేలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగానే శుక్రవారం తహసీల్దార్ రాజేంద్రనాథ్ రైతు కుమార్‌కు ఫోన్ చేసి డబ్బులు తీసుకుని ఇంటికి రావాలన్నాడు. రైతు నుంచి డబ్బులు తీసుకున్న వెంటనే అతడిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం రాజేంద్రనాథ్ నివాసంలో కంప్యూటర్, ఇతర ఫైల్స్ పరిశీలించారు. విలువైన భూముల పత్రాలు, వాహనాలు, ప్లాట్లు ఇతర విలువైన పత్రాలు లభించినట్లు సమాచారం. అనంతరం సంగెం తహసీల్దార్ కార్యాలయానికి రాజేంద్రనాథ్‌ను తీసుకొచ్చి ఆర్డీఓ మహెందర్‌జీ సమక్షంలో రికార్డులు తనిఖీ చేసి, సోదాలు నిర్వహించారు. కాగా.. తహసీల్దార్ కార్యాలయంలో పలు డాక్యుమెంట్లను, రికార్డులను, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను, సీసీ పుటేజీలను సీజ్ చేసినట్లు సమాచారం. దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు శ్యాంసుందర్, శ్రీను, సిబ్బంది పాల్గొన్నట్లు ఏసీబీ డీఎస్పీ వై.హరీశ్‌కుమార్ తెలిపారు. ఆది నుంచి అదేతీరు! సంగెం తహసీల్దార్ రాజేంద్రనాథ్ ఉద్యోగ ప్రస్థానం ఆది నుంచి వివాదాస్పదమే! గతంలో డీటీ స్థాయిలో ఓప్రజాప్రతినిధి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేశారు. అక్కడ్నుంచి బదిలీ అయిన తర్వాత సుదీర్ఘకాలం ఉమ్మడి వరంగల్ జిల్లాలో జేసీల వద్ద సీసీగా పని చేశారు. తర్వాత ధర్మసాగర్లో పని చేశారు. జిల్లాల విభజన అనంతరం వరంగల్ జిల్లాకు వెళ్లిన ఆయన మొదట్లో నల్లబెల్లి తహసీల్దార్‌గా వెళ్లారు. అక్కడ కూడా వివాదాస్పద పనులతో ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. దీంతో ఉన్నతాధికారులు అతడిని కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. కలెక్టరేట్‌కు వచ్చిన తర్వాత ఆయన తీరు మరింత ఆందోళనకరంగా మారిందని ఆరోపణలున్నాయి. కలెక్టరేట్ ఏఓగా పని చేస్తూ ఉద్యోగులు, ఉన్నతాధికారులకు మధ్య సమన్వయం చేయాల్సిన సమయంలో ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించేలా పనులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సదరు అధికారి ఇబ్బందులు భరించలేక జిల్లాలోని సçహోద్యోగులు, రెవెన్యూ శాఖలోని ఇతర స్థాయి ఉద్యోగులు ఇతడి వేధింపులపై ఓ జిల్లాస్థాయి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కరుగా తమ బాధలు చెప్పుకున్నట్లు సమాచారం. పదే పదే ఆరోపణలు వస్తున్నా.. కొందరు అధికారులు సదరు తహసీల్దార్‌కు అన్ని విధాలా అండగా నిలవడం తీవ్రస్థాయిలో విమర్శలకు దారితీసింది. అండగా నిలిచిన ఆజిల్లా ఉన్నతాధికారి బదిలీ కావడంతో కలెక్టరేట్ నుంచి రాజేంద్రనాథ్ బదిలీ అనివార్యమైంది. దీంతో తోటి ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నట్లు చెబుతుంటారు. తీవ్రస్థాయిలో ఆరోపణలున్న రాజేంద్రనాథ్‌ను 2019లో ఉత్తమ అధికారి అవార్డు అందించడం విశేషం. -
టాటా చెప్పేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు..
అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు కళ్లెదుటే కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు పడిన బాధ వర్ణనాతీతం. తన అక్కకు టాటా చెప్పేందుకు వెళ్లిన చిన్నారిని మృత్యువు బస్సు రూపంలో కబళించగా.. అప్పటివరకు ముద్దు ముద్దు మాటలతో మాట్లాడిన తమ కూతురు ఇక లేదనే చేదు నిజాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. గుళ్లూ.. గోపురాలు తిరిగితే దేవుడు ఇచ్చిన బిడ్డను దేవుడే తీసుకెళ్లాడంటూ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సాక్షి, సంగెం: అప్పటివరకు ముద్దు ముద్దు మాటలతో మాట్లాడిన చిన్నారిని ప్రైవేట్ స్కూల్ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాధ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకా రం.. అక్క స్కూల్‌కు వెళ్తుంటే టాటా చెప్పేం దుకు వెళ్లి చెల్లెలు తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషాధ సంఘటన ఇది. స్థానికులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని కాట్రపల్లికి చెందిన కర్ర జ్యోత్స్న, అమరేందర్‌రెడ్డిలకు సమ్మిత, మనస్విత(రెండున్నర సంవత్సరాలు) సంతానం ఉన్నారు. పెద్దకూతురు వరంగల్ అర్బన్ జిల్లా మామునూర్ క్యాంపులోని పాత్‌ఫైండర్ ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతుంది. బుధవారం బస్సు హారన్ విని తల్లి పెద్ద కూతురు సమ్మితను స్కూల్ బస్సు ఎక్కించడానికి చిన్న కూతురును తీసుకుని ఇంటి సమీపంలోని రోడ్డు వరకు వెళ్లింది. రోడ్ అటు వైపు దాటి ఆగిఉన్న బస్సులో పెద్ద కూతురును ఎక్కించింది. చిన్న కూతురును తీసుకుని బస్సు ముందు నుంచి ఇంటికి వస్తుండగా బస్సు డ్రైవర్ కాగితాల లింగమూర్తి ఆజాగ్రత్తగా ముందుకు వెళ్లడంతో బస్సు ముందు టైర్ కిందపడిన చిన్నారి మనస్విత తల పైనుంచి వెళ్లడంతో రోడ్‌పై ఉన్న కర్ర రాజిరెడ్డి, మిలుకూరి రామచంద్రారెడ్డి, మందాటి రాజేశ్వర్‌రెడ్డి చూసి కేకలు వేయడంతో బస్సును నిలిపివేశాడు. తలకు బలమైన గాయమై అక్కడికక్కడే చిన్నారి మృతిచెందింది. చిన్నారి మనస్విత తండ్రి అమరేందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. కాగా, చిన్నారి మృతిచెందడంతో కుటుంబసభ్యులు రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టించాయి. -
ప్రాణం కాపాడిన ‘100’
సాక్షి, సంగెం(వరంగల్) : రైలు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ప్రాణాన్ని పోలీసులు కాపాడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బెల్లంపల్లిలో ఉపవాస ప్రార్ధనలకు హాజరై తిరుగు ప్రయాణంలో ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సామర్లకోటకు చెందిన మణికంఠ తన భార్య రూపతో కలిసి సోమవారం రాత్రి వెళ్తున్నాడు. అయితే, మణికంఠ అర్థరాత్రి ప్రమాదవశాస్తు రైలు నుంచి జారిపడిపోయాడు. విజయవాడ వరకు రైలు ఎక్కడ ఆగదు. దీంతో ఆయన భార్య రూప వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి జరిగిన విషయం తెలియజేసింది. ఎక్కడ పడిపోయాడో తెలియకపోవడంతో సంగెం, గీసుకొండ, నెక్కొండ పోలీసుస్టేషన్లకు సమాచారం అందించారు. సంగెం పెట్రోలింగ్ సిబ్బంది జగదీష్‌కుమార్, కుమారస్వామి, రైల్వే సిబ్బంది సహకారంతో చింతలపల్లి ఎల్గూర్స్టేషన్ల మధ్య వెదికారు. రెండు గంటల పాటు శ్రమించి ఎల్గూర్‌రంగంపేట రైల్వే గేటుకు కిలోమీటరు దూరంలో రక్తపు మడుగులో పడిన ఉన్న మణికంఠను గుర్తించి 108కు సమాచారం అందించారు. స్ట్రేచర్‌పై ప్రధాన రహదారివరకు మోసుకుని వచ్చి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మణికంఠ భార్య రూపకు సమాచారం అందించడంతో ఆమె ఎంజీఎంకు చేరుకుంది. సరౖఝెన సమయంలో ఆస్పత్రికి చేర్చడం వల్ల నిండు ప్రాణం కాపాడిన సంగెం కానిస్టేబుళ్లు జగదీష్, కుమారస్వామిలను ఈస్ట్ జోన్ డీసీపీ కేఆర్ నాగరాజు, మామునూర్ ఏసీపీ శ్యాంసుందర్ అభినందించి రివార్డులు అందజేశారు. కాగా అత్యవసర సమయాల్లో డయల్ 100కు కాల్చేసి పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పోలీసు కమిషనర్ రవిందర్ కోరారు. -
పంచాయతీలకు ‘కో ఆప్షన్’
సాక్షి, సంగెం: గ్రామ పంచాయతీల్లో ఇక కో ఆప్షన్ సభ్యులను నియమించబోతున్నారు. నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని రాజకీయ నిరుద్యోగులకు కొంత ఊరట లభించనున్నది. గతంలో కనీవిని ఎరుగని విధంగా ప్రతి పంచాయతీ పాలకవర్గంలో కోఆప్షన్ సభ్యులను నియమించుకునేందుకు చట్టంలో వెసులుబాటు కల్పించింది. మండల పరిషత్, జిల్లా పరిషత్‌ల మాధిరిగా గ్రామపంచాయతీలకు సైతం కోఆప్షన్ సభ్యుల నియామకాన్ని పొందుపరిచారు. దీంతో నూతన పంచాయతీ పాలక వర్గాలు కొలువుదీరి ఆరు నెలలు కావస్తున్నది. పంచాయతీ పాలనపై నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు నిధులు, విధులపై శిక్షణ తరగతులను నిర్వహించారు. కొత్త చట్టం ప్రకారం ఇక కో ఆప్షన్ సభ్యుల నియామక ప్రక్రియ మిగిలింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కోఆప్షన్ సభ్యుల ఎంపిక విధానంపై మార్గదర్శకాలు జారీ చేస్తే ఆయా పంచాయతీల పాలకవర్గం అభిప్రాయం మేరకు సర్పంచ్ సన్నిహితులు, విధేయులకు అవకాశం లభించనుంది. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో పాటుగా గ్రామానికి చెందిన ముగ్గురిని కోఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేసుకుంటే వారి విలువైన సలహాలను గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం కొంత మేరకు తోడ్పాటు లభించినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. నూతనంగా ఎంపిక కాబోయే కో ఆప్షన్ సభ్యులకు వార్డు సభ్యులతో సమాన హోదా లభించనుంది. గ్రామపంచాయతీల్లో తీర్మాణం చేసే సమయంలో చేసే చర్చలో వారు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మండల, జిల్లా పరిషత్ స్థాయిలో కో ఆప్షన్ సభ్యులను నామినేట్ చేసినట్లుగా గ్రామపంచాయతీల్లోను ముగ్గురిని నామినేట్ చేసి వారి ద్వారా గ్రామాభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు తీసుకునోవాలనేది ప్రభుత్వ వ్యూహం. అందులో భాగంగా ప్రతి పంచాయతీకి ముగ్గురు కోఆప్షన్ సభ్యులను నియమించేందుకు కార్యాచరణ రూపొందించారు. వీరికే అవకాశం.. ప్రతి గ్రామపంచాయతీలో ముగ్గురు చొప్పున కోఆప్షన్ సభ్యులను పంచాయతీ పాలకవర్గం నిర్ణయం మేరకు అధికారులు నియమిస్తారు. గ్రామాల్లో విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగులు, సంఘ సంస్కర్తలు, గ్రామాభివృద్ధికి కోసం ఇదివరకే కృషిచేసేవారిలో వంటి వారి నుంచి ముగ్గురిని పంచాయతీకి నియమించనున్నారు. ఈ ముగ్గురు గ్రామాల్లో నివసిస్తున్నవారు అయి ఉండాలి. వీరిలో ఒక మహిళ తప్పనిసరిగా ఉంటారు. జిల్లాలో 401 గ్రామపంచాయతీలున్నాయి. ప్రతి పంచాయతీకి ముగ్గురి చొప్పున 1,203 మంది కోఆప్షన్ సభ్యులను నియమించనున్నారు. దీంతో గ్రామాల్లో కొంతమేరకు రాజకీయ నిరుద్యోగులకు ఊరట కలగనుంది. ఈ కోఆప్షన్ సభ్యులను నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంపిక చేసి మండల అధికారులకు జాబితా అందిస్తారు. జాబితా అందిన తర్వాత మండల అధికారి సభ్యులను ప్రకటించే అవకాశం ఉంది. పలువురు ఆశావాహులు మండలస్థాయి నాయకులతో కలిసి ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలను కలిసి గ్రామ కోఆప్షన్‌గా అవకాశం కల్పించాలని మంతనాలు జరుపుతున్నారు. -
ట్యాంకు ఎక్కి యువకుడి హల్చల్
సాక్షి, సంగెం: తన వల్ల పెద్దమనుషులు 5వ రోజు కర్మకాండలకు రారని ఆందోళనకు గురైన ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేసిన సంఘటన మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... మండల కేంద్రానికి చెందిన గుండేటి కుమారస్వామి(30) సమీప బంధువు గుండేటి ఎల్లమ్మ మృతి చెందింది. ఈ నెల 6వ తేదీన ఎల్లమ్మ మృతి చెంది 3వ రోజు కావడంతో కుమారస్వామి వంటలు చేశాడు. అక్కడ భోజనాలు జరుగుతున్న క్రమంలో మద్యం మత్తులో ఉండి పెద్ద మనుషులను దుర్భాషలాడాడు. దీంతో మనస్తాపం చెందిన కుల పెద్ద మనుషులు నేడు నిర్వహించబోయే 5వ రోజు కర్మలకు హాజరుకామని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు కుమారస్వామిని నీవల్లే కుల పెద్దలు రావటం లేదని మందలించారు. దీంతో ఆందోళన చెందిన కుమారస్వామి గ్రామపంచాయతీ వద్ద ఉన్న వాటర్ ట్యాంకు ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ వద్ద ఉన్న గుండేటి కొమ్మాలు, అనిల్, మెట్టుపల్లి రమేశ్, కక్కెర్ల సంతోష్‌గౌడ్‌లు చాటుగా వాటర్ ట్యాంకు ఎక్కి కుమారస్వామికి నచ్చజెప్పి కిందకు దింపారు. విషయం తెలుసుకుని పోలీసులు వచ్చి యువకుడిని పోలీసుస్టేషన్ తరలించారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
సంగెం : ఉరివేసుకుని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. అయితే తమ కుమార్తెను ఆమె భర్త హత్యచేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. మృతురాలి తల్లి సూరమ్మ, సోదరుడు అంజయ్య కథనం ప్రకారం.. వర్ధన్నపేట మండలం కట్య్రాలకు చెందిన చెంగాల సూరమ్మ, మల్లయ్య దంపతుల పెద్ద కుమార్తె స్వరూప(45)ను 30 ఏళ్ల క్రితం సంగెం మండలం షాపూర్‌కు చెందిన బొడిగె చిట్టిబాబుకు ఇచ్చి వివాహం చేశారు. కొన్నేళ్ల పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో కొంతకాలం తర్వాత కలతలు చోటు చేసుకున్నాయి. చిట్టిబాబు, స్వరూప దంపతులకు సంతానం లేదు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుని శివనగర్‌లో కాపురముంటున్నాడు. దీంతో స్వరూప, చిట్టిబాబుకు మధ్య గొడవలు జరిగాయి. ఇటీవల స్వరూప తల్లిదండ్రులు రాసిచ్చిన భూమి విషయంలో కలతలు ఏర్పడ్డాయి. దీంతో ఉదయం స్వరూప వంటగదిలోని ఇనుప పైపునకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తమ కుమార్తెను భర్త చిట్టిబాబు హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పర్వతగిరి సీఐ శ్రీదర్‌రావు, ఎస్సైలు దీపక్, కరుణాకర్‌రావు.. సిబ్బందితో వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు నిర్వహించారు. కాగా సాయంత్రం వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి
సంగెం (వరంగల్ జిల్లా) : సంగెం మండలం పుటాన్ తండాలో విషాదం చోటుచేసుకుంది. ఊరికి సమీపంలో ఉన్న కుంట దగ్గరకు ఆడుకోవడానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తూ నీటిలో పడి మృతిచెందారు. కార్తీక్(7), రాజు(10) అనే ఇద్దరు చిన్నారులు కుంటలో పడి మునిగిపోవడంతో పక్కనే ఉన్న మరో బాలుడు సిద్ధు భయంతో పారిపోయాడు. జరిగిన విషయాన్ని గ్రామానికి వెళ్లి వివరించాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న గ్రామస్తులు ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు.