శాయంపేట శివారులో మోహరించిన పోలీసులు, రెవెన్యూ సిబ్బంది
గీసుకొండ: ఓ కంపెనీ అడిగిన మేర ప్రభుత్వం భూములు కట్టబెడుతున్న వైనం వివాదాస్పదమవుతోంది. వరంగల్ జిల్లాలోని గీసుకొండ– సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు(కేఎంటీపీ)లో చిన్న పిల్లల గార్మెంట్లు తయారీకి కేరళకు చెందిన కైటెక్స్ కంపెనీని నెలకొల్పుతున్నారు. ఇప్పటికే పార్కులో కంపెనీకి 187 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.
షెడ్ల నిర్మాణం జరుగుతుండగా ప్రహరీ గోడ వంకరగా ఉందని, వాస్తు సవరించుకోవడానికి మరో 13.29 ఎకరాలు కావాలని కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు సమ్మతించిన రెవెన్యూ యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో శాయంపేటహవేలి పరిధిలో కేటాయించేందుకు రైతులకు నోటీసులు జారీ చేశారు. శనివారం ఉదయం అధికారులు సర్వేకు రాగా పోలీసులు రైతుల చేలవద్ద మొహరించారు.
పోలీసులు, రెవెన్యూవర్గాలపై రైతుల ఆగ్రహం
ఈ క్రమంలో పోలీసులు, రెవెన్యూ అధికారులపై రైతులు మండిపడ్డారు. సర్వేను నిలిపివేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. పలువురు మహిళా రైతులు క్రిమిసంహారక మందు డబ్బాలను పట్టుకుని నిరసన తెలపగా వారిని పోలీసులు నివారించారు. ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు సంగెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత రెవెన్యూ సిబ్బంది సర్వే పనులను కొనసాగించారు.
‘‘ఎకరా రూ.50లక్షలుంటే మాకు పది లక్షలే ఇచ్చారు’’
కేఎంటీపీ కోసం కొంత భూమిని ఇప్పటికే ఇచ్చామని, ఎకరానికి రూ.10 లక్షల చొప్పున చెల్లించిన ప్రభుత్వం ప్రతి ఎకరానికి వంద గజాల ఇంటి స్థలం, పార్కులో ఉద్యోగం ఇప్పిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదని రైతులు వాదిస్తున్నారు. తమ దగ్గర కారుచౌకగా భూములను తీసుకుని కంపెనీలకు ఐదారు రెట్ల ధరలకు అమ్ముతోందని ఆరోపిస్తున్నారు. సారవంతమైన రెండు పంటలు పండే నీటి వసతి ఉన్న తమ భూములకు ఎకరానికి సుమారు రూ.50లక్షల మేర మార్కెట్ ధర ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చే ధర తమకు సమ్మతం కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment