మంగళగిరి(గుంటూరు జిల్లా): ప్రేమ పేరుతో మైనర్(16)ను ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దించబోయారు. బాలిక చాకచక్యంగా తప్పించుకుని డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సత్వరమే స్పందించి విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను మంగళగిరి డీఎస్పీ రాంబాబు మంగళవారం విలేకరులకు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్టకు చెందిన కంసాని రాజేష్ వివాహం చేసుకుని గుంటూరు జిల్లా మంగళగిరిలోని కొత్తపేటలో నివాసముంటున్నాడు. కొద్ది రోజులుగా రాజేష్ మంగళగిరిలోని పార్కు రోడ్డులో ఓ బాలికకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు.
చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి పరిచయం.. స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి
గత నెల 22న రాత్రి రాజేష్ తన బంధువులు అవినాష్, వినోద్ సహాయంతో బాలికను కారులో యాదగిరిగుట్ట తీసుకువెళ్లి ఓ లాడ్జిలో ఉంచాడు. అక్కడ మద్యం తాగించి బాలికను అవినాష్ లోబర్చుకున్నాడు. రాజేష్ బంధువు సిరి వ్యభిచారం నిర్వహిస్తుండగా బాలికను ఆ కూపంలోకి దించాలని చూశారు. దీన్ని గ్రహించిన బాలిక తప్పించుకుని డయల్ 100కు ఫోన్ చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు బృందాలుగా ఏర్పడి రాజేష్, అవినాష్, వినోద్, సిరిని అరెస్ట్ చేసి బాలికను రక్షించారు. బాలిక కనిపించకుండా పోయిన రోజునే ఆమె తల్లిదండ్రులు మంగళగిరిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందికి అర్బన్ ఎస్పీ రివార్డు ప్రకటించారు. సమావేశంలో సీఐ భూషణం, ఎస్‌ఐలు నారాయణ, మహేంద్ర పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment