‘హెలెన్’ ముప్పు ఉంది.. అప్రమత్తంగా ఉండండి | Cyclone Helen storm there is a risk for the district be alert | Sakshi
Sakshi News home page

‘హెలెన్’ ముప్పు ఉంది.. అప్రమత్తంగా ఉండండి

Published Sat, Nov 23 2013 4:25 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM

Cyclone Helen storm there is a risk for the district be alert

కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాకు హెలెన్ తుపాన్ వచ్చే ప్రమాదం ఉందని, జిల్లావాసులను అప్రమత్తం చేయాల్సిందిగా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ అధికారులను ఆదేశించారు. జిల్లాకు హెలెన్ ముప్పు ఉందని వాతావరణ ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం ఆయన రెవెన్యూ, పంచాయతీ రాజ్, మెడికల్, విద్యుత్, నీటిపారుదల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల కంటే అతి భారీ వ ర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
 
  ఈదురుగాలుల వల్ల చెట్లు కూలి రహదారులపై పడి ట్రాఫిక్ అంతరాయం కలగవచ్చని, అలాంటి పరిస్థితులు ఏర్పడితే వెంటనే సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. పూరి గుడిసెలు, పాత ఇండ్లు ఉన్న వారిని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. పాత భవనాలు ఉన్న పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని సూచించారు. రోడ్లపై ఆరబెట్టుకుంటున్న ధాన్యాన్ని రైతులు వెంటనే ఇళ్లలోకి తీసుకెళ్లేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఇప్పటికే చాలావరకు జిల్లాలో చెరువులు నీటితో సమృద్ధిగా ఉన్నాయని, ఇప్పుడు వర్షాలు పడితే అవి పొంగిపొర్లే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలన్నారు.
 
 వ్యాధులు ప్రబలకుండా వైద్యసిబ్బంది అవసరమయ్యే మందులు సిద్ధం చేసుకుని, ప్రజలకు సకాలంలో అందించాలన్నారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కూలితే, ప్రాణనష్టం జరగకుండా విద్యుత్ అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలన్నారు. కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేశామని, దానికి 08542-245377నంబర్‌ని కేటాయించినట్లు కలెక్టర్ వెల్లడించారు. సమస్యలుంటే ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్‌కి తెలియ జేస్తూ, సమస్యను అధిగమించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జేసీ ఎల్.శర్మణ్, డీఆర్వో రాంకి షన్, డీపీఓ రవీందర్, ఆర్డీఓ హన్మంతరావు, తదితరులు పాల్గొన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement