సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెతుకు సీమ రైతాంగాన్ని ప్రతియేటా ప్రకృతి విపత్తులు దెబ్బతీస్తున్నాయి. 2011 ఏప్రిల్ మొదలుకుని కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఎనిమిది పర్యాయాలు వర్షాలు, వడగండ్ల వల్ల రైతులు కోట్లాది రూపాయల పంట నష్టపోయారు. ఈ యేడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఐదు పర్యాయాలు ప్రకృతి కన్నెర్ర చేయడంతో రూ.30 కోట్లకు పైగా పంట నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అక్టోబర్ 22 నుంచి 26 తేదీ నడుమ పైలీన్ తుపాను సృష్టించిన నష్టం రూ.26 కోట్లకు పైనే ఉంటుందని వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా నిగ్గు తేల్చాయి. నష్టం జరిగిన ప్రతిసారి అధికార యంత్రాంగం వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తోంది. అయితే నష్టం అంచనాలో శాస్త్రీయత పాటించడం లేదని రైతులు మొత్తుకుంటున్నా అధికారులు నిబంధనలు సాకుగా చూపుతున్నారు.
మండలంలో 50 శాతానికి పైగా పంట నష్టం జరిగితేనే పరిహారం చెల్లింపు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. నూర్పిళ్లు జరిగి అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యానికి నష్టం జరిగినా పరిగణనలోకి తీసుకోవడం లేదు. క్షేత్ర స్థాయికి వెళ్లకుండానే వ్యవసాయ, రెవెన్యూ యంత్రాంగాలు నివేదికలు రూపొందిస్తున్నట్లు ఫిర్యాదులు చేసినా ఫలితం కనిపించడం లేదు. పైలీన్, హెలెన్ నష్టాన్ని మినహాయిస్తే 2011 ఏప్రిల్ నుంచి 2013 ఏప్రిల్ వరకు ఆరు పర్యాయాల్లో జరిగిన నష్టానికి రూ.11.48 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ రావాల్సి ఉంది. పరిహారం కోసం రైతాంగం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా నయా పైసా విదల్చడం లేదు.
అరకొర లెక్కలు... ఆత్మహత్యలు
పైలీన్ తుపాను వల్ల జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయల నష్టం జరిగిందని రైతు సంఘాల ప్రతినిధులు ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర బృందానికి లేఖ సమర్పించారు. అయితే ప్రభుత్వం రూ.2.60 కోట్లకు మించి పరిహారం విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదు. వ్యవసాయంలో ఎదురవుతున్న నష్టాలను భరించలేక మెదక్ జిల్లాలో ఈ యేడాది 93 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అధికారులు మాత్రం కేవలం పది మంది రైతులు మాత్రమే ఆత్మహత్యలు చేసుకున్నట్లు నివేదికలు సిద్ధం చేశారు. నష్టపోయిన రైతులకు ఉదారంగా పరిహారం ఇస్తే తప్ప తిరిగి కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు.
తుపాన్లతో పంటలకు తీవ్ర నష్టం
Published Mon, Nov 25 2013 11:11 PM | Last Updated on Sat, Mar 23 2019 7:54 PM
Advertisement