Vizianagaram Collectorate
-
ప్లాస్టిక్ తెస్తే పావు కేజీ స్వీటు
జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నియంత్రణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటి వరకు పలుమార్లు ఈ తరహా చర్యలు తీసుకున్నా సత్ఫలితాలు రాలేదు. దీంతో తాజాగా వినూత్న తరహాలో పర్యావరణానికి, ప్రజలకు హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థాలపై సమరభేరికి కార్పొరేషన్ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం రోటరీ క్లబ్ విజయనగరంతో కలిసి పని చేయాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు నిషేధించిన 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌తో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణకు చర్యలు తీసుకోనుంది. ఈనెల 17న జొన్నగుడ్డి ప్రాంతం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. – విజయనగరం సాక్షి, విజయనగరం : నగరంలో ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధంపై ఈ విడత వినూత్న పంధాతో కార్పొరేషన్ ముందడుగు వేస్తోంది. రోటరీ క్లబ్ విజయనగరం అనుసంధానంతో నిర్వహించనున్న ఈ వినూత్న కార్యక్రమంలో భాగంగా కేజీ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇస్తే వారికి పావు కిలో స్వీట్‌బాక్స్ ఇస్తారు. మరింత మంది దాతలు ముందుకొస్తే అర డజను గుడ్లను ప్యాక్ చేసి అందించాలని భావిస్తున్నారు. అదే పెద్ద పెద్ద సంస్థలు, పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులు ఒకేసారి 250 కిలోల ప్లాస్టిక్‌ను ఇస్తే వారికి భారీ నజరానా చెల్లించనున్నారు. ఇలా ఇంట్లో ఉండే హానికరమైన ఒక్కసారి వినియోగించే పారేయాల్సిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రయోగాత్మకంగా రాజీవ్‌నగర్ కాలనీ, దాసన్నపేట ప్రాంతాల్లో నిర్వహించగా.. మంచి స్పందన లభించింది. ఈ స్పందనతో వారిలో మరింత చైతన్య నింపేందుకు ఇంటింటికి ప్రత్యేకంగా డస్డ్బిన్లు పంపిణీ చేశారు. అపార్ట్మెంట్లలో నివసించే వారైతే హోమ్ కంపోస్ట్‌ను తయారు చేసుకునే దిశగా చైతన్యపరుస్తున్నారు. ఈసారైన విజయవంతమయ్యేనా? ఈ ఏడాదిలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో 50 మైక్రాన్ల మందం కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ విక్రయాలపై ప్రజారోగ్య విభాగం అధికారులు గట్టిగానే కొరఢా ఝళిపించారు. దాదాపు 80 శాతం ఈ తరహా ప్లాస్టిక్‌ను వినియోగించేందుకు భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు. కానీ పలు కారణాలతో అధికారులు దాడులు నిలిపివేయటంతో మళ్లీ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. కోలగట్లతో ప్రారంభం జొన్నగుడ్డి ప్రాంతంలో తొలుత ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు కార్పొరేషన్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, రోటరీ క్లబ్ అధ్యక్షుడు రవి మండాలు వెల్లడించారు. వారు గురువారం కార్పొరేషన్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో చేపట్టబోయే ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయా ప్రాంతీయులకు ముందుగా సమాచారం అందజేస్తామన్నారు. 250 కిలోలకు పైగా ప్లాస్టిక్‌ను అందజేసిన వారిని జనవరి 26న కలెక్టర్‌తో సన్మానించనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రక్రియ అమలుకు వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటామని తెలిపారు. నలభై వేల ఇళ్లకు గుడ్డ సంచులను ఉచితంగా పంపిణీ చేయనున్నామని వివరించారు. -
కలక్టరేట్ ఎదుట యువతి ఆత్మాహత్యాయత్నం
సాక్షి, విజయనగరం: జిల్లా కలక్టరేట్ వద్ద వివాహిత ఆత్మహత్యా యత్నం చేసిన ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ స్పందన కార్యక్రమంలో ఆమె తన వెంట తెచ్చుకున్న చీమల మందు తిని.. అధికారుల ముందే ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. దీనిని గమనించిన అధికారులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను బొబ్బిలి మండలం అలజంగి గ్రామానికి చెందిన పతివాడ వసుంధర (22)గా గుర్తించారు. ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, ఇటీవల ఆమెను భర్త వదిలేశాడు. దీనిపై 3 నెలలుగా ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ.. కలెక్టర్ స్పందన కార్యక్రమానికి వచ్చిన ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో 108 అంబులెన్స్‌లో ఆమెను అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
పేదలను చదువుకోనివ్వరా?
కలెక్టరేట్‌ను ముట్టడించిన విద్యార్థులు మూసివేసిన హాస్టళ్లను తక్షణమే తెరవాలి : ఎస్ఎఫ్ఐ విజయనగరం క్రైం : సంక్షేమ వసతిగృహాలను మూసివేస్తూ పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తారా? అని ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రశ్నించారు. జిల్లాలో మూతపడిన హాస్టళ్లను తెరిపించాలని, మెస్ చార్జీలను పెంచాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకున్న విద్యార్థులు.. ప్రధాన గేటు ముందు బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. డీఆర్ఓ బయటకు వచ్చి విద్యార్థులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫలితం లేకపోవడంతో రహదారిపై బైఠాయించేందుకు సిద్ధమయ్యారు. ఈలోగా విజయనగరం వన్‌టౌన్ సీఐ వి.వి.అప్పారావు, టూటౌన్ సీఐ జి.దుర్గాప్రసాద్‌లు విషయాన్ని డీఆర్ఓ జితేంద్ర దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు డీఆర్ఓ విద్యార్థుల నుంచి వినతిపత్రం స్వీకరించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాని హామీ ఇవ్వడంతో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన విరమించారు. పేద విద్యార్థులకు చదువును దూరం చేస్తున్న చంద్రబాబు ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె.సురేష్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం ఒక వైపు ‘బడి పిలుస్తోంది’ అంటూనే మరో వైపు బడులు, హాస్టళ్లు మూసివేసి పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్యారంగం ప్రధానమైనదని, దీన్ని అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తుంటే ఇక్కడ మాత్రం విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. మూసివేసిన సంక్షేమ హాస్టళ్లను తక్షణమే ప్రారంభించాలని, మెస్‌చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ.. గురుకుల, కేజీబీవీ, రెసిడెన్సియల్స్ పాఠశాలల సమస్యలు పరిష్కరించి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన యూనివర్సిటీని ప్రారంభించి క్లాసులు నిర్వహించాలన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 25న విజయవాడలో మహాధర్నా తలపెడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పి.రామ్మోహన్, లక్ష్మణ్, సాయి, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. -
అంగన్వాడీల పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: అంగన్వాడీ కేంద్రాల పని తీరుపై కలెక్టర్ కాంతిలాల్ దండే అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రీవెన్స్‌తో పాటూ మిగిలిన సందర్భాల్లోనూ వస్తున్న అంగన్వాడీల పనితీరు సక్రమంగా లేవనే ఫిర్యాదులే అధికంగా వస్తున్నాయని.. అసలు సీడీపీఓలు ఏం చేస్తున్నారని ఐసీడీఎస్ పీడీ శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. క్షేత్ర పర్యటనలు పెంచి సక్రమంగా పని చేయని అంగన్వాడీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురువారం తన చాంబర్లో ఏజేసీ నాగేశ్వరరావుతో కలిసి ఐసీడీఎస్ అధికారుల తో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని గ్రామా ల్లో కేంద్రాలను సక్రమంగా తెరవడం లేదని, సరుకులు అందించడంలో విఫలమవుతున్నార ని వస్తున్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరిం చాలని ఆదేశించారు. ఇకపై అటువంటి ఫిర్యాదులు వస్తే సీడీపీఓలపై చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. పిల్లల హాజరుతో పాటు బాలింతలు, గర్భిణులకు క్రమం తప్పకుండా ఆరోగ్యపరీక్షలు నిర్వహించాలని సూచించారు. అంగన్ వాడీలు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహించి న వారిపై వేటు వేయాలన్నారు. నాబార్డు ఆర్ఐడీఎఫ్ కింద మంజూరైన అంగన్వాడీ భవన నిర్మాణాలను మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాకు 171భవనాలు మంజూ రు కాగా కేవలం 121 భవనాలు మాత్రమే గ్రౌండ్ అవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదని ఈఈ వివరించారు. దీనికి స్పందించిన కలెక్టర్ తక్షణమే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రాంభం కాని భవనాలను మార్చిలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భవన నిర్మాణాలు పూర్తి చేయాలి రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్ కింద మంజూరైన పాఠశాలల అదనపు తరగతుల గదుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. తన కార్యాలయంలో గురువారం పలుశాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రారంభం కాని నాలుగు భవనాలు పూర్తి చేసి వచ్చే విద్యాసంవత్సరం నాటికి సిద్ధం చేయాలని డీఈఓ కృష్ణారావును ఆదేశించారు. 331 వంట గదులు మంజూరు కాగా కేవలం 13 మాత్రమే పూర్తి కావడంపై పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థలాల విషయమై జనవరి 9లోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. 86 పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టడానికి రూ1.87కోట్లు మంజూరైనట్లు తెలిపారు. శిథిలావస్థకు చేరిన తహశీల్దార్ కార్యాలయాలకు నూతన భవనాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమగ్ర కార్యాచరణ ప్రణాళిక నిధులతో నిర్మిత భవనాల ప్రగతి పర్యవేక్షించాలని సబ్‌కలెక్టర్ శ్వేతామహంతికి సూచించారు. కాగా, ఎస్సీ ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ వసతి గృహాల నిర్మాణానికి కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఆమోదం తెలిపింది. పాచిపెంట, పార్వతీపురం, ఎస్.కోట, చీపురుపల్లి నియోజక వర్గ కేంద్రాల్లో వీటిని నిర్మించనున్నారు. సమావేశంలో సబ్‌కలెక్టర్ శ్వేతామహంతి, ఏజేసీ నాగేశ్వరరావు, జెడ్పీ సీఈఓ ఎన్.మోహనరావు, సోషల్వెల్ఫేర్ డీడీ ఆదిత్యలక్ష్మి పాల్గొన్నారు. -
విజయనగరం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు
లెహర్ తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ గురువారం ఇక్కడ వెల్లడించారు. 19 గ్రామాలు తుఫాన్ ప్రభావం వల్ల తీవ్ర ఇక్కట్లు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆ గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు చెప్పారు. అలాగే జిల్లా కలెక్టరేట్‌తోపాటు పార్వతీపురంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తుఫాన్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 34 పునరావాస కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఎక్కడ, ఎవరికైన తుఫాన్ వల్ల ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైన 1077, 08922-236947 (కలెక్టరేట్లోని టోల్ ఫ్రీ నెంబర్లు), 08963-221006 (పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయం) ఫోన్ చేయవచ్చని జిల్లా ప్రజలకు సూచించారు. తీర ప్రాంత మండలాలైన భోగాపురం, పూసపాటిరేగ తదితర గ్రామాలు అత్యంత ప్రభావితమైయ్యే ప్రాంతాలుగా గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. -
శతశాతం ఓటర్ల నమోదు లక్ష్యం
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో శతశాతం ఓటరు నమోదు జరిగేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని రాష్ట్రఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు లక్ష్యం నిర్దేశించుకోవాలని సూచించారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయక కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ కాంతిలాల్‌దండేతో కలసి రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్షించారు. ఓటరు నమోదు, చేర్పులు మార్పులకు సంబంధించి వీఎల్ఓలు రసీదులు తప్పని సరిగా ఇవ్వాలని స్పష్టం చేశారు. ఓటు తొలగించేటప్పుడు తప్పనిసరిగా సంబంధిత వ్యక్తికి సమాచారం అందించాలని ఆదేశించారు. ఓటరు జాబితాలను రేషన్ డిపోలతోపాటు, పంచాయతీ, పోలింగ్ కేంద్రాలు, పాఠశాలల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎవరి ఒత్తిళ్లకైనా తలొగ్గి తప్పు చేసినట్లు రుజువైతే చర్యలు తప్పవన్నారు. ఉపాధ్యాయులకు, బీఎల్ఓలకు ఫారం -6, 7, 8, 8ఏలపై శిక్షణ ఇవ్వాలని చెప్పారు. ప్రధానంగా చనిపోయిన, రెండు సార్లు నమోదైన వారి ఓట్లు లేకుండా ఇంటింట సర్వే చేపట్టాలని సూచించారు. అర్హుల పేర్లు తప్పినట్లు ఫిర్యాదు వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలూ కల్పించాలని చెప్పారు. కొత్త ఈవీఎంలు.. ఈ సారి కొత్త ఈవీఎంలను అందజేస్తామని భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. మొదటి స్థాయి పరిశీలన రాజకీయపార్టీ ప్రతినిధుల సమక్షంలో చేపట్టి వీడియోగ్రఫీ చేయించాలని సూచించారు. నాలుగు సంవత్సరాలు పైబడి జిల్లాలో పని చేస్తున్న తహశీల్దార్లు, ఎస్సైలకు ఎన్నికల విధులు కేటాయించరాదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు సహకరించాలి... శతశాతం ఓటరు నమోదుకు సహకరించాలని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు భన్వర్‌లాల్ విజ్ఞప్తి చేశారు. జనవరి 25 తరువాత నమోదైన 45 వేల మందికి ఎపిక్ కార్డులు అందజేస్తామన్నారు. ప్రధానంగా జిల్లావ్యాప్తంగా ఉన్న 2,083 పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులను నియమించాలని సూచించారు. కళాశాలల్లో ఉన్న 18 ఏళ్లు నిండి న వారందరూ ఓటరుగా నమోదయ్యేలా విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని కోరారు. ఓటు హక్కు వినియోగంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కాంతిలాల్‌దండే మాట్లాడుతూ జిల్లాలో 23.42 లక్షల మంది జనాభా ఉన్నారని, అందులో 16.19 లక్షల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. జనాభా ప్రకారం 18 ఏళ్లు దాటిన యువకులు 53 వేల మంది ఉండగా.. కేవలం 15వేల మంది ఓటర్లుగా నమోదయ్యారని వివరించారు. ఎన్నికలకు సం బంధించి నమోదైన కేసులపై తీసుకున్న చర్యలను వివరించా రు. ఈ సమావేశంలో జేసీ పి.ఎ.శోభ, పార్వతీపురం సబ్‌కలెక్టర్ శ్వేతామహంతి, ఐటీడీఏ పీఓ రజిత్కుమార్సైనీ, ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు, డీఆర్ఓ బి. హేమసుందర వెంకట రావు, ఆర్డీఓ జె. వెంకటరావులతో పాటు, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
మరో24 గంటలు!
విజయనగరం కలెక్టరేట్/ఫోర్ట్ న్యూస్‌లైన్: రైతుల కళ్లలో సుడులు రేపుతున్న హెలెన్ ప్రభావం మరో 24 గంటల పాటు ఉంటుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం తీరం దాటినా శనివారం సాయంత్రానికి దీని ప్రభావం తగ్గుతుందని వారు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతుండడంతో రైతులు పరుగులు తీస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతన్న వెన్నులో వణుకు పుడుతోంది. ఇప్పటికే 220 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్టు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అయితే వేయి ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. పార్వతీపురం డివిజన్లో కోసిన వరి పనలు నీళ్లలో తడిసి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా కురి సిన వర్షంతో పొలాల్లో నీరు చేరింది. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 10 మిల్లీమీటర్ల వర్షం కురిసింది చీపురుపల్లి, గరివిడి, కొత్తవలస, పాచిపెంట మండలాల్లో మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది. పనలపై ఉన్న వరి పంటను చక్కబెట్టుకోవటానికి రైతులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 24గంటల పాటు ప్రభావం.... హెలెన్ తుఫాన్ శుక్రవారం మధ్యాహ్నం మచిలీపట్నం వద్ద తీరం దాటింది. దీంతో కొంత వరకూ ముప్పు తప్పింది. అయితే మరో 24 గంటల పాటూ ఉంటుందని, ఆ తరువాత పూర్తిస్థాయిలో గండం గట్టెక్కినట్టేనని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం కూడా మత్స్యకారులు సముద్రంపైకి వేటకకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. కలెక్టరేట్లో 1077 టోల్‌ఫ్రీ నంబర్ కంట్రోల్ రూమ్ కొనసాగుతుంది. అయితే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పస్తులతో మత్స్యకార కుటుంబాలు హెలెన్ కారణంగా నాలుగు రోజులుగా చేపలవేట లేకపోవడంతో తీరంలో మత్స్యకార కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో వారు వేటకు వెళ్లడంలేదు. పడవలను తీరంలో లంగరు వేశారు. బోట్లు, వలలు పాడవకుండా వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాలులు, వర్షాల కారణంగా భోగాపురం మండలం లో గ్రామీణ ప్రాంతాల్లో రెండు రోజులగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
ప్రచారమే ఎజెండా
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని, సమస్యలను పట్టించుకోని పాలకులు ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల్లోకి రావటానికి ఎత్తుగడలు ప్రారంభించారు. ఇన్నాళ్లూ ప్రజల ముఖం చూడని వారు తమ ఉనికిని కాపాడుకోవడానికి రచ్చబండను వేదికగా ఉపయోగించుకునేందుకు యత్నాలు ప్రారంభించారు. జిల్లాలో ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్న మూడోవిడత రచ్చబండ కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంగా మారనుంది. ఏ పదవీ లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారినే వేదికపై కూర్చోబెట్టి, వారితో ఆస్తులు పంపిణీ చేసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. వేదికపైన కూర్చునేవారిని ఎంపిక చేసే అధికారం జిల్లా ఇన్చార్జి మంత్రికి ఇచ్చారు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని మండలాలతో పాటూ మున్సిపాల్టీల్లో కూడా రచ్చబండ నిర్వహణకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. పూర్తిగా ఇన్చార్జి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల సూచన మేరకే కార్యక్రమం జరగాలని ప్రకటించడంతో ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా మారనుందని అర్థమవుతోంది. నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేకపోయినా... ఇన్చార్జి మంత్రి సూచించిన పేర్లనే మండలస్థాయి కమిటీల్లో చేర్చాలని స్పష్టం చేశారు. 3వ విడత రచ్చబండ కార్యక్రమాన్ని ఐదు అంశాలకు మాత్రమే పరిమితం చేశారు. జిల్లా స్థాయిలో డీఆర్డీఏ పీడీ, డీఎస్ఓ, హౌసింగ్ పీడీ, సాంఘిక, గిరిజన సంక్షేమశాఖల డీడీలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పింఛన్‌దారులను ఆకట్టుకోడానికి 20 నుంచి 40 శాతం లోపు వికలాంగత్వం ఉన్నవారి వద్ద నుంచి కూడా మండల కమిటీలు దరఖాస్తులు స్వీకరించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే ఇదంతా కేవలం ప్రచారం కోసమే చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గత దరఖాస్తుల మాటేంటి ...? గత రెండు విడతల్లో ఇచ్చిన దరఖాస్తులకు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపించలేదు. వచ్చిన దరఖాస్తులకు.. మంజూరు చేస్తున్న వాటికి పొంతన లేకుండా పోయింది. రేషన్ కార్డుల కోసం 75 వేల దరఖాస్తులు రాగా ఇప్పుడు జరగనున్న రచ్చబండలో కేవలం 29,047 మందికి తాత్కాలిక కూపన్లు మాత్రమే జారీ చేయనున్నారు. అలాగే పింఛన్లకు సంబంధించి 50,860 దరఖాస్తులు రాగా, వాటిలో 31,263 అర్హత గలవిగా తేల్చారు. అందులో కూడా కేవలం 19,307 మందికి మాత్రమే పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లక్షా 10 వేలు దరఖాస్తులు రాగా వాటిలో 87 వేలు అర్హమైనవిగా గుర్తించిన అధికారులు ప్రస్తుతం జరగనున్న కార్యక్రమంలో 31,800 మందికి మాత్రమే మంజూరు పత్రాలు అందజేసేందుకు సిద్ధం చేస్తున్నారు. వివిధ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం 30శాతం మందికి మాత్రమే మంజూరు చేశారు. అధికూడా అధికార పార్టీ నేతలు సూచించిన వారికే మంజూరు చేసి నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఐదు అంశాలకే పరిమితం కేవలం రేషన్‌కార్డులు, పింఛన్ల పంపిణీ, గృహ నిర్మాణ లబ్ధిదారులకు అనుమతి ఉత్తర్వులు జారీ, ఇందిరమ్మ కలల కింద వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవా లు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు బకాయి ఉన్న విద్యుత్ బిల్లుల చెల్లింపులకే ఈ కార్యక్రమాన్ని పరిమితం చేశారు. లబ్ధిదారులతోనే... ఈసారి రచ్చబండ కార్యక్రమాన్ని కేవలం లబ్ధిదారులకే పరిమితం చేయనున్నారు. గతంలో మాదిరిగా ప్రజలంతా తమ సమస్యలను చెప్పుకొనేందుకు ఈసారి అవకాశం లేదు. కేవలం లబ్ధిదారుల మాత్రమే రావాలని, రేషన్‌కార్డు, పింఛన్ మంజూరయినట్టు తెలుపుతూ అధికారిక లేఖలు పంపేందుకు సిద్ధం చేస్తున్నారని సమాచారం. లబ్ధిదారులకు మంజూరు స్లిప్పులు ముందే ఇచ్చి వారిని రచ్చబండ సభల వేదికల వద్దకు తీసుకురావాలని, ఖర్చులను ఆయా విభాగాల రెగ్యులర్ బడ్జెట్ నుంచి భరించాలని ఉత్తర్వులు అందాయి.