ప్లాస్టిక్‌ తెస్తే పావు కేజీ స్వీటు  | If Bring Plastic A Quarter KG Of Sweets Give In Vizianagaram | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ తెస్తే పావు కేజీ స్వీటు 

Published Fri, Nov 15 2019 10:46 AM | Last Updated on Fri, Nov 15 2019 10:46 AM

If Bring Plastic A Quarter KG Of Sweets Give In Vizianagaram - Sakshi

జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్‌ నియంత్రణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటి వరకు పలుమార్లు ఈ తరహా చర్యలు తీసుకున్నా సత్ఫలితాలు రాలేదు. దీంతో తాజాగా వినూత్న తరహాలో పర్యావరణానికి, ప్రజలకు హాని కలిగించే ప్లాస్టిక్‌ వ్యర్థాలపై సమరభేరికి కార్పొరేషన్‌ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం రోటరీ క్లబ్‌ విజయనగరంతో కలిసి పని చేయాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు నిషేధించిన 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌తో పాటు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణకు చర్యలు తీసుకోనుంది. ఈనెల 17న జొన్నగుడ్డి ప్రాంతం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  
– విజయనగరం 

సాక్షి, విజయనగరం : నగరంలో ప్లాస్టిక్‌ ఉత్పత్తుల నిషేధంపై ఈ విడత వినూత్న పంధాతో కార్పొరేషన్‌ ముందడుగు వేస్తోంది. రోటరీ క్లబ్‌ విజయనగరం అనుసంధానంతో నిర్వహించనున్న ఈ వినూత్న కార్యక్రమంలో భాగంగా కేజీ ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఇస్తే వారికి పావు కిలో స్వీట్‌బాక్స్‌ ఇస్తారు. మరింత మంది దాతలు ముందుకొస్తే అర డజను గుడ్లను ప్యాక్‌ చేసి అందించాలని భావిస్తున్నారు. అదే పెద్ద పెద్ద సంస్థలు, పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులు ఒకేసారి 250 కిలోల ప్లాస్టిక్‌ను ఇస్తే వారికి భారీ నజరానా చెల్లించనున్నారు. ఇలా ఇంట్లో ఉండే హానికరమైన ఒక్కసారి వినియోగించే పారేయాల్సిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రయోగాత్మకంగా రాజీవ్‌నగర్‌ కాలనీ, దాసన్నపేట ప్రాంతాల్లో  నిర్వహించగా.. మంచి స్పందన లభించింది. ఈ స్పందనతో వారిలో మరింత చైతన్య నింపేందుకు ఇంటింటికి ప్రత్యేకంగా డస్డ్‌బిన్‌లు పంపిణీ చేశారు. అపార్ట్‌మెంట్లలో నివసించే వారైతే హోమ్‌ కంపోస్ట్‌ను తయారు చేసుకునే దిశగా చైతన్యపరుస్తున్నారు.  

ఈసారైన విజయవంతమయ్యేనా? 
ఈ ఏడాదిలో కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో 50 మైక్రాన్ల మందం కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ విక్రయాలపై ప్రజారోగ్య విభాగం అధికారులు గట్టిగానే కొరఢా ఝళిపించారు. దాదాపు 80 శాతం    ఈ తరహా ప్లాస్టిక్‌ను వినియోగించేందుకు భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు. కానీ పలు కారణాలతో అధికారులు దాడులు నిలిపివేయటంతో మళ్లీ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది.   

కోలగట్లతో ప్రారంభం 
జొన్నగుడ్డి ప్రాంతంలో తొలుత ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు కార్పొరేషన్‌ కమిషనర్‌ ఎస్‌ఎస్‌ వర్మ, రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు రవి మండాలు వెల్లడించారు. వారు గురువారం కార్పొరేషన్‌ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో చేపట్టబోయే ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయా ప్రాంతీయులకు ముందుగా సమాచారం అందజేస్తామన్నారు. 250 కిలోలకు పైగా ప్లాస్టిక్‌ను అందజేసిన వారిని జనవరి 26న కలెక్టర్‌తో సన్మానించనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రక్రియ అమలుకు వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటామని తెలిపారు. నలభై వేల ఇళ్లకు గుడ్డ సంచులను ఉచితంగా పంపిణీ చేయనున్నామని వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement