స్కూల్ ఫీజుగా ప్లాస్టిక్‌ను ఇస్తున్న విద్యార్థులు
ఈ భూగోళం మీద ప్లాస్టిక్ తొడుగు ఉంది. అది నీటిలో నానదు. మట్టిలో కలవదు. నిప్పులో కాల్చితే విషంగా మారుతుంది. అలాంటి ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. లేదా రీసైకిల్ చేయాలి. అందుకే అసోంలోని ఆ స్కూల్ 2016లో వృథా ప్లాస్టిక్కే స్కూల్ ఫీజ్‌గా ప్రారంభమైంది. ఏడేళ్లు గడిచినా దిగ్విజయంగా నడిచి పర్యావరణ హితమైన స్కూల్‌గా ప్రశంసలు అందుకుంటోంది.
ఫీజుకు బదులు ప్లాస్టిక్ వేస్ట్‌ను ఎవరైనా తీసుకుంటారా? ఆ స్కూల్‌లో తీసుకుంటారు. ఎంత వేస్ట్ తెస్తే అంత మెచ్చుకుంటారు కూడా. పర్మితా శర్మ, మజిన్ ముక్తార్ అనే పర్యావరణ ప్రేమికుల, బాలల హితుల వినూత్న ఆలోచన ఇది. అసోంలోని పమోహీలో ‘అక్షర్’పేరుతో వీరిద్దరూ ఒక పాఠశాల స్థాపించారు 2016లో. దీనిని భిన్నంగా నడపాలని నిశ్చయించుకున్నారు.
చదువు, స్కిల్స్, పర్యావరణ స్పృహ సిలబస్‌గా ఉండాలనుకున్నారు. అందుకే ఫీజు కట్టాలంటే నోట్లు తేవద్దు వేస్ట్ ప్లాస్టిక్ తెండి అని చెప్పసాగారు. వీలైనన్ని ప్లాస్టిక్ వ్యర్థాలు తీసుకెళ్తే ఫీజు కట్టినట్లు రసీదు ఇస్తారు. మరో విషయం ఏమిటంటే ఇక్కడ విద్యార్థులను వారి వయసును బట్టి కాకుండా అవగాహన స్థాయిని బట్టి తరగతుల్లో వేస్తారు. ఎనిమిదేళ్లు వచ్చిన వారు 3వ క్లాస్‌లో ఉండాలని రూల్ లేదు. నాలుగులో ఉండొచ్చు లేదా రెండులోనూ ఉండొచ్చు.
ప్లాస్టిక్ భూతం నుంచి కాపాడాలని..
మనుషులు బాగా చలి పుడితే దేనితోనైనా చలిమంట వేసుకోవడానికి వెనుకాడరు. అసోంలో చలి ఎక్కువ. కాని కట్టెలు ఖర్చు. అందుకే చలిమంటల కోసం ప్రజలు ప్లాస్టిక్ బాటిళ్లను, కవర్లను తెచ్చి మంటల్లో వేయసాగారు. ప్లాస్టిక్ వ్యర్థాలను బహిరంగంగా తగులబెట్టడం పర్యావరణానికి తీవ్రమైన హాని. దీనిపై అక్కడి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం రాలేదు.
దానికి తోడు ప్లాస్టిక్ తగులపెట్టడం వల్ల వెలువడే విష వాయువులు పీల్చి పిల్లలు జబ్బు పడసాగారు. దీంతో సామాజిక కార్యకర్త అయిన పర్మితా శర్మకు ఓ ఆలోచన తట్టింది. తన మిత్రుడు, అమెరికాలో బాలల విద్యారంగంలో పని చేస్తున్న నిపుణులు మజిన్‌తో తన ఆలోచనను పంచుకుంది. అసోం భౌగోళిక పరిస్థితుల గురించి, అక్కడ నెలకొన్న సవాళ్ల గురించి మజిన్‌కు వివరించింది. అలా వారిద్దరి ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే ‘అక్షర్’ విద్యాలయం.
ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేస్తున్న విద్యార్థులు
ఎవరు చేరుతారు?
స్కూలంటే డబ్బు తీసుకుని చదువు చెప్పాలి. ప్లాస్టిక్ తెండి స్కూల్‌లో చేరండి అంటే ఎవరు చేరతారు. పైగా సంప్రదాయ విద్యకు, వృత్తి విద్యకు మధ్య వారధిగా ప్రారంభించిన ఈ పాఠశాలకు విద్యార్థులను రప్పించడం మొదట్లో సవాలుగానే మారింది. ఇక అక్కడి పేద పిల్లలు దగ్గర్లోనే ఉన్న రాళ్ల క్వారీలలో పనిచేస్తారు. వారిని బడికి పంపిస్తే ఆదాయం కోల్పోతామని తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకు పంపేందుకు ససేమిరా అన్నారు. దీంతో తల్లిదండ్రుల అవసరాలకు తగిన విధంగా స్కూల్ సమయాన్ని, బోధనను ‘అక్షర్’ లో రూపకల్పన చేశారు.
ప్లాస్టిక్ ఇటుకలు..
‘అక్షర్’లో నెదర్లాండ్స్ నుంచి తెప్పించిన మెషినరీ ద్వారా ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేస్తారు. పాత ప్లాస్టిక్‌తో ఇటుకలు తయారు చేస్తారు. వీటిని నిర్మాణాల్లో వాడొచ్చు. పిల్లలు స్కూల్ అయ్యాక ఈ ఇటుకల తయారీ నేర్చుకుంటున్నారు. అలాగే పూలకుండీలు, బౌల్స్ వంటివి ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు రెండున్నర వేల ప్లాస్టిక్ బాటిళ్లు, ఏడు లక్షల ప్లాస్టిక్ కవర్లు ఇక్కడ రీసైకిల్ అయ్యాయి.
అసోంను ప్లాస్టిక్ పీడ నుంచి విముక్తం చేయాలంటే తమ స్కూల్ మోడల్‌ని ఫాలో కావాలని పర్మిత, మజిన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికి 5 స్కూళ్లు ఈ విధానాన్ని అవలంబిస్తున్నాయి. అంటే ఫీజుగా ప్లాస్టిక్‌ను తీసుకుంటున్నాయి. మరో వంద స్కూళ్లు ఇలా చేస్తే బాగుంటుందని పర్మిత, మజిన్ భావిస్తున్నారు. అసోంలో మాత్రమే కాదు దేశమంతా ఈ మోడల్‌ను ఉపయోగిస్తే ప్లాస్టిక్ వ్యర్థాలను కచ్చితంగా తరిమికొట్టడం వీలవుతుంది.
ఇవి చదవండి: Kalaiyarasi: తను ఒక ‘రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్’..
Comments
Please login to add a commentAdd a comment