ఫీజు కట్టడానికి డబ్బు లేదా.. అయితే ప్లాస్టిక్‌ ఇవ్వండి! | Plastic Waste Policy: School Accepts Plastic Waste As School Fee In Assam | Sakshi
Sakshi News home page

ఫీజు కట్టడానికి డబ్బు లేదా.. అయితే ప్లాస్టిక్‌ ఇవ్వండి!

Published Mon, Jul 26 2021 12:20 PM | Last Updated on Mon, Jul 26 2021 12:35 PM

Plastic Waste Policy: School Accepts Plastic Waste As School Fee In Assam - Sakshi

చాలా దుకాణాల్లో మనమిచ్చిన నోట్లకు చిల్లర లేకపోతే బదులుగా చాక్లెట్లు చేతిలో పెట్టడం ట్రేడ్‌ ట్రెండ్‌ అయింది!అసోంలోని ఓ బడిలో.. ఫీజు కట్టడానికి డబ్బులేకపోతే పోగేసిన ప్లాస్టిక్‌ను ఇచ్చి బడిలో పాఠాలు నేర్చుకోవచ్చు అనేది పాలసీగా మారింది! ఆ పాఠశాల పేరు అక్షర్‌.. గువాహటిలో ఉంది. అదెలా మొదలైందంటే.. 

న్యూయార్క్‌లో ఉండే మజిన్‌ ముఖ్తార్‌ విభిన్నమైన స్కూల్‌ ప్రాజెక్ట్‌తో 2013లో ఇండియాకు తిరిగి వచ్చాడు. అదే సమయంలో టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేస్తున్న పర్మిత శర్మను అనుకోకుండా కలిశాడు. విద్యారంగంలో పనిచేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటోన్న పర్మిత..ముఖ్తార్‌తో కలసి 2016లో అక్షర్‌ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. చక్కటి కరిక్యులమ్‌తో సాఫీగా సాగిపోసాగింది.  ఒకరోజు బడి ఆవరణలో పోగైన ప్లాస్టిక్‌ వ్యర్థాలను తగలబెట్టారు. తరగతి గదుల్లోకి పొగవాసన రావడంతో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు పిల్లలు. అది విద్యార్థుల ఆరోగ్యానికీ, పర్యావరణ హితానికి ఎంత హానికరమో గ్రహించారు పర్మిత, ముఖ్తార్‌లు. ఆ ప్లాస్టిక్‌ను ఇటు బడిలోని పిల్లలకు ఉపయుక్తంగా.. అటు పర్యావరణానికి క్షేమంగా మార్చాలని నిర్ణయించుకున్నా రిద్దరూ. ఫీజుకు బదులుగా ప్లాస్టిక్‌ను తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆలస్యం చేయకుండా అమల్లో పెట్టారు. ఇప్పుడు అక్షర్‌ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులంతా ప్రతిరోజూ పుస్తకాల సంచితోపాటు ప్లాస్టిక్‌ వ్యర్థాల సంచినీ పట్టుకొని బడికెళ్తున్నారు. వాళ్లందరికీ అక్కడ చదువు ఉచితం.

ఆ ప్లాస్టిక్‌ను ఏం చేస్తున్నారు?
ఇరవై మంది విద్యార్థులతో ప్రారంభమైన ఆ స్కూలు స్ట్రెన్త్‌.. ప్లాస్టిక్‌ను ఫీజుగా తీసుకోవడం మొదలుపెట్టేప్పటికి వందకు పైనే దాటింది. తమ పరిసరాల్లోంచి తెచ్చిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను విద్యార్థులు బడి ఆవరణలో పోగేస్తారు. వాటిని ఎలా రీసైకిల్‌ చేయాలి? చేసిన వాటిని తిరిగి ఎలా ఉపయోగించాలో ప్రాక్టికల్స్‌ ద్వారా నేర్చుకుంటున్నారు ఒకేషనల్‌ ట్రైనింగ్‌లో భాగంగా. ఇదివరకే ఉన్న  ఆటలు, పాటలు, నృత్యం, సోలార్‌ ప్యానెలింగ్, ఆర్గానిక్‌ ఫార్మింగ్, ఎంబ్రాయిడరీ, కాస్మెటాలజీ, కార్పెంటరీ, గార్డెనింగ్, ఎలక్ట్రానిక్స్‌తో పాటు ఇప్పుడు ప్లాస్టిక్‌ రీసైకిలింగ్‌ కూడా స్కూల్‌ కరిక్యులమ్‌లో భాగమైంది. ఈ రీసైకిల్‌ ప్లాస్టిక్‌ను తరగతి గదులు, టాయ్‌లెట్ల నిర్మాణానికి మెటీరియల్‌గా వాడుతున్నారట. 

టాయ్‌మనీ..
‘మా ప్రతిపాదనను తొలుత అయిష్టంగానే ఒప్పుకున్నారు స్థానికులు. వీళ్లలో ఎక్కువ మంది క్వారీల్లో కూలికి వెళ్తూ రోజుకి 150 నుంచి 200 రూపాయలు సంపాదించేవాళ్లే. ఆ డబ్బుతో ఇల్లు గడవడమే గగనం. బడి ఫీజులేం కట్టగలరు? అందుకే చాలా మంది పిల్లలు స్కూల్‌కి వచ్చేవారు కాదు.  ఫీజుకు బదులు ప్లాస్టిక్‌ను తీసుకుంటే ఇటు పిల్లలనూ బడికి రప్పించిన వాళ్లమవుతాం.. అటు  పర్యావరణ పరిరక్షణ మీద అవగాహనా కల్పించిన వాళ్లమవుతాం అనిపించింది. ఊహించినట్టుగానే రెండూ జరుగుతున్నాయి. పిల్లలు చదువు పూర్తిచేసిన వెంటనే ఉద్యోగం తెచ్చుకునేలా వాళ్లను ట్రైన్‌ చేస్తున్నాం. హైస్కూలు పిల్లలతో ట్యూషన్స్‌ చెప్పించి వాళ్లకు కొంత డబ్బులు (టాయ్‌మనీ) ఇస్తున్నాం. అవి వాళ్లకు స్నాక్స్, బట్టలు, బొమ్మలు, షూలు వంటివి కొనుక్కోవడానికి ఉపయోగపడుతున్నాయి’ అని చెప్పారు పర్మిత, ముఖ్తార్‌. 
అక్షర్‌ ఫౌండేషన్‌ ద్వారా త్వరలోనే మరో వంద స్కూళ్లను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విస్తరించనున్నట్టూ తెలిపారు.
– విజయాదిలీప్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement