ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ వాణిజ్యకేంద్రం. అమెరికాలోని కాన్సస్ నగరంలో మిస్సోరీ నదీ తీరానికి ఉత్తర ప్రాంతంలో ఉంది. నేలకు 150 అడుగుల లోతున 5.1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భూగర్భ వాణిజ్య సముదాయంలో నిరంతరం వెయ్యిమందికి పైగా కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు.
ఈ ప్రాంతంలో 27 కోట్ల ఏళ్ల నాటి సున్నపురాతి నిల్వలు బయటపడటంతో, ఇక్కడి సున్నపురాతినంతా తవ్వి తీసి, సొరంగ మార్గాలను ఏర్పాటు చేసి ఈ భూగర్భ వాణిజ్య సముదాయాన్ని నిర్మించారు.
హంట్ మిడ్‌వెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్మించిన ఈ వాణిజ్య సముదాయంలో ఎన్నో సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. పలు ఈ–కామర్స్ సంస్థలు, ఆహార ఉత్పత్తుల సంస్థలతో పాటు కార్ల తయారీ సంస్థ ‘ఫోర్డ్’ కూడా ఇక్కడి నుంచి కొన్ని కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ప్రైవేటు సంస్థలతో పాటు అమెరికన్ ప్రభుత్వం కూడా ఇక్కడ కొన్ని కార్యాలయాలను నిర్వహిస్తోంది.
ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యాలయాల్లో ఒక పోస్టాఫీసు, ఆర్కైవ్స్ కార్యాలయం, రికార్డు స్టోరేజీ కార్యాలయం ఉన్నాయి. పేరుకు ఇది వాణిజ్య సముదాయమే అయినా, విస్తీర్ణం దృష్ట్యా, వసతుల దృష్ట్యా ఇది నగరాన్ని తలపిస్తుంది. ఇందులో సరుకుల రవాణాకు వీలుగా 3.4 కిలోమీటర్ల రైలుమార్గం, సరుకులతో పాటు మనుషుల రవాణాకు వీలుగా 17 కిలోమీటర్ల రోడ్డు మార్గం ఉండటం విశేషం. బయటి వాతావరణం ఎలా ఉన్నా, ఇందులోని వాతావరణం మాత్రం ఏడాది పొడవునా 19–21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండేలా ఏసీలు నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు, కార్మికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment